2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం మంజూరు చేసిన జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీలో మిస్ మ్యాచ్ కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలానీ సమూన్ హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులను ఆదేశించారు. నంద్యాల మండలం చాపీరేవుల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరానికి మంజూరు చేసిన జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీలో ఎలాంటి లోపాలకు తావివ్వకుండా పకడ్బందీగా పంపిణీ చేయాలని సంబంధిత పాఠశాలల హెడ్మాస్టర్లు, తరగతి ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేసిన ద్విభాషా (బైలింగ్వల్ టెస్ట్ బుక్స్) ఇంగ్లీష్ – తెలుగులో ముద్రించిన పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, యూనిఫామ్ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగులను కలెక్టర్ పరిశీలిస్తూ మిస్ మ్యాచ్ కాకుండా జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
1వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులకు పంపిణీ చేసే బైలింగ్వల్ టెస్ట్ బుక్స్ లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు. 10వ తరగతి చదివే విద్యార్థులకు ఇంగ్లీష్, తెలుగు మీడియంల వారీగా వచ్చిన పాఠ్య పుస్తకాలను విడివిడిగా సక్రమంగా పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే విద్యార్థులకు ఇస్తున్న రాగి జావను కలెక్టర్ పరిశీలించి విద్యార్థులకు అందజేస్తూ తను కూడా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అనురాధ, సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారి లలిత తదితరులు పాల్గొన్నారు.