ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లా అంటే ఎంతో వెనుకబడిన ప్రాంతంగా పేరు ఉండేదని… బైపాస్ సమీపంలో ఎకరా పొలం ఎక్కువకు ఎక్కువ రూ.10 లక్షలకు లభించేదని ఇప్పుడు అక్కడ ఎకరా పొలం విలువ రూ.8 కోట్లను దాటిపోయిందని రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఎంతో కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. కేబుల్ టీవీ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బిజెపికి చెందిన హర్షవర్ధన్ రెడ్డి సహా ఇషాక్, బలరాం, వెంకటేష్, భాస్కర్, నరేష్ తో పాటు సుమారు 100 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు స్థానిక ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మంత్రి సమక్షంలో అధికార పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని రూ. 150 కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని… భవిష్యత్తులో ఈ ప్రాంతం అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా పేరు తెచ్చుకుంటుందన్నారు. మన పట్టణం బాగుపడితే ప్రజలందరి ఆస్తుల విలువ పెరుగుతుందని అందుకు మన మహబూబ్ నగర్ ఉదాహరణగా నిలిచిందన్నారు. ప్రస్తుతం ఒకవైపు బైపాస్ ఉండగా… త్వరలో కోస్గి బైపాస్ పూర్తవుతుందని తెలిపారు. భవిష్యత్తు మహబూబ్ నగర్ అద్భుతంగా ఉండబోతుందన్నారు. ఏళ్లుగా ఉన్న డ్రైనేజీ వర్షపునీటి ముంపు సమస్యను తీర్చినందుకు బి కే రెడ్డి కాలనీవాసులు స్థానికులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపి పాలాభిషేకం చేశారు. కేబుల్ ఆపరేటర్ల సమస్యను పరిష్కరించడం ఎంతో గొప్ప విషయం అని కేబుల్ ఆపరేటర్లు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్, టిడిపి నుంచి టిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు…
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 16వ వార్డు బోయపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డ్ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, టిడిపి వార్డు అధ్యక్షుడు యాదగిరి, కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద గొల్ల వెంకటయ్య, కేశవ్ సహా సుమారు 50 మంది… 16వ వార్డు కౌన్సిలర్ మోతిలాల్ మరియు వార్డు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సత్యం ఆధ్వర్యంలో మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో అధికార పార్టీలో చేరారు.