తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్ కమీషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన 2కె రన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ తో కలిసి పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు జెండా ఊపి ఈ 2కె రన్ ను ప్రారంభించారు.
కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియం నుండి ప్రారంభమైన పరుగు తిరుమల నగర్ చౌరస్తా, భగత్ నగర్ – కలెక్టరేట్ – మల్టీప్లెక్స్ మీదుగా పోలీస్ పరేడ్ గ్రౌండకు చేరుకుంది. క్రీడాజ్యోతిని చేతబూని అధికారులు, వివిధ విభాగాలకు చెందిన ప్రతినిధులు ఈ రన్ లో పాల్గొన్నారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన పోలీసుల తోపాటు వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన అధికారులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాలకు చెందిన ప్రతినిధులు, క్రీడాకారులు దాదాపు 1000 మంది ఈ 2 కె రన్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో ప్రగతిపథంలో ముందుకుసాగుతోందన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సురక్ష దినోత్సవం కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాయని చెప్పారు. దశాబ్ది ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా నలుమూలల నుండి కార్యక్రమాలు జరుగుతుండటం విశేషమని పేర్కొన్నారు.
కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవ కార్యక్రమాలు అహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతున్నాయన్నారు. అభివృద్ధిని చాటుతూ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. అభివృద్ది కార్యక్రమాలకు అన్నివర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తమవంతు సహకారాన్ని అందిస్తున్నారని తెలిపారు. అభివృద్ధిలో ప్రభుత్వం ఎన్నో మైలురాళ్ళను అధిగమిస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ అనీల్ కుమార్, అడిషనల్ కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్ లాల్, డిసిపిలు ఎస్ శ్రీనివాస్ (శాంతిభద్రతలు), జి చంద్రమోహన్(పరిపాలన), యం భీంరావు (సిఎఆర్), జిల్లా మార్కెటింగ్ అధికారిణి పద్మావతి, అగ్నిమాపకశాఖ అధికారి వెంకన్న, డివైఎస్ఓ రాజవీరు, ఎసిపిలు తుల శ్రీనివాసరావు, విజయ్ కుమార్, మదన్ లాల్, విజయసారధి, కాశయ్య, సత్యనారాయణ, శ్రీనివాస్, సి.ప్రతాప్, ఎస్బిఐ లు జి వెంకటేశ్వర్లు, సంతోష్ కుమార్ పారా ఒలపింక్స్ క్రీడాకారులు అంజనారెడ్డి, ఒలంపిక్ అసోసియేషన్ ప్రతినిధులు, టిఎన్జిఓ ప్రతినిధులు, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.