బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా కొనసాగుతున్న మాండూస్.. తుపానుగా బలహీనపడిట్లు ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న.. తుపాను గమనాన్ని ఖచ్చితంగా అంచనా వేసేందుకు కారైక్కాల్, చెన్నైలోని డాప్లర్ వెదర్ రాడార్లతో పరిశీలిస్తున్నట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. మాండూస్ వాయవ్య దిశగా పయనించి.. ఈ అర్థరాత్రి తర్వాత పుదుచ్చేరి, శ్రీహరి కోటల మధ్య మహాబలిపురంకు సమీపంలో తీరం దాటనున్నట్లు ఐఎండీ పేర్కొంది.
తుపాను తీరాన్ని తాకే సమయంలో.. గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. ఐఎండీ వెల్లడించింది. అలాగే తీరం దాటే సమయంలో.. అరమీటరు ఎత్తున ఉప్పెన రావొచ్చని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తుపాను ప్రభావంతో ఇప్పటికే ఆపీ, తమిళనాడు వ్యాప్తంగా వర్షాలు మొదలయ్యాయి. 10వ తేదీ వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తెలిపారు.