Thursday, September 19, 2024
HomeతెలంగాణJivan Reddy: మహిళలకు పట్టుచీరల పంపిణీ

Jivan Reddy: మహిళలకు పట్టుచీరల పంపిణీ

అతివల జీవన ప్రమాణాలే అభివృద్ధికి కొలమానాలు

రోజు రోజుకూ మెరుగవుతున్న అతివల జీవన ప్రమాణాలే అభివృద్ధికి కొలమానాలని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఘనంగా కొనసాగుతున్న తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆలూరు మండల కేంద్రంలోని గురడీ రెడ్డి ఫంక్షన్ హాలులో అంగరంగ వైభవంగా నిర్వహించిన మహిళా సంక్షేమ సంబరాల్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కలకంటి కన్నీరు పెట్టినింట సుఖశాంతులు కొలువుండవన్నారు.

- Advertisement -


సృష్టికర్త బ్రహ్మను కన్నది కూడా ఒక అమ్మేనని ఆయన పేర్కొన్నారు. స్త్రీ
అంటే ఆదిశక్తి. స్త్రీ అంటే ప్రకృతి. సృష్టికే ప్రతిసృష్టి నిచ్చి సమాజానికి మార్గ నిర్దేశనం చేసే మహిళ తనకు తానే సాటి. అమ్మగా, అక్కగా, చెల్లిగా ఆత్మీయతను అనురాగాన్ని పంచే అమృతమూర్తి మహిళ. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత’ ఎక్కడైతే స్త్రీలు గౌరవింప బడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారనే స్ఫూర్తిని నిజం చేస్తూ అవని నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో అతివల విజయాలకు హద్దులు లేవు.
లోకంలో స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు.
స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు.మనల్ని కంటిపాపలా కాపాడే ‘స్త్రీమూర్తి’ని గౌరవించుకోవడం మన అందరి బాధ్యత. మనమేదైన గొప్ప పని చేస్తే హీరోలు అని అంటారు. అలాంటి మన విజయం వెనుక స్త్రీ శక్తి లేకుంటే జీరోలమవుతాం. బతుకంతా జీవచ్చవమై భంగపడిన మహిళల బంధనాలను తెంచింది మన తెలంగాణ ప్రభుత్వం. వారికి బంగారు భవితవ్యం ఇవ్వడానికి మహిళా మా తల్లులను ముందుకు నడిపిస్తున్న దమ్మున్న సీఎం కేసీఆర్. మహిళాభ్యుదయానికి తెలంగాణ పుట్టిల్లు.

తెలంగాణలో మహిళలే మహారాణులు
కేసీఆర్ పాలనలో మహిళల పేరుతోనే అత్యధిక పథకాలు అమలవుతున్నాయి. సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు అని జీవన్ రెడ్డి చెప్పారు. ఒక్క ఆర్మూర్ నియోజకవర్గంలోనే కల్యాణ లక్ష్మీ ద్వారా 8,642 మంది, షాదీముబారక్ ద్వారా 1670 మంది పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు జరిగాయి.
మహిళా సంక్షేమాన్ని తెలంగాణకు ముందు,తెలంగాణకు తరువాతగా చూడాలి. నాడు మహిళలు మంచినీటి కోసం తెల్లవారు జామున లేచి బిందెలు పట్టుకొని మైళ్ళకొద్దీ నడచిన రోజులు, మంచినీటి కోసం ఆర్మూర్ రాజారాం నగర్ లో జరిగిన హత్యను గుర్తుకు తెచ్చుకోండి. నేడు ఆ పరిస్థితి ఉందా?. 450కోట్లు రూపాయలు వెచ్చించి నియోజకవర్గమంతా ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీటి సరఫరా చేస్తూ మహిళలకు కష్టాలు లేకుండా చేశాం. రూ.27కోట్లతో ఆర్మూర్ కు వందపడకల ఆసుపత్రి సాధించాం. ఇప్పటికే 24,670 మందికి ఉచిత ప్రసవాలు జరిగి ఒక్కో తల్లికి 50వేల రూపాయల చొప్పున ఖర్చు తప్పింది. 11,920 మందికి కేసిఆర్ కిట్లు ఇచ్చాం. కేసీఆర్ కిట్స్ లో తల్లికి చీరె, పుట్టిన బిడ్డకు బట్టలు, పిల్లల కోసం జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఆరోగ్య సామాగ్రి, ఆట వస్తువులు, దోమల తెర వంటి వాటితో శిశు రక్షణకు చర్యలు తీసుకున్నాం. మహిళా పథకాల గురించి చెబితే రామాయణం.. వింటే భారతమంతా. తెలంగాణలో స్త్రీలు పురుషులను మించిపోయేలా కదం తొక్కుతున్నారు. మహిళల ఉన్నతికి పాటుపడుతున్న ఏకైక సీఎం కేసీఆర్. కేసీఆర్ ప్రధాని అయితే దేశంలో మహిళలకు అసలైన పండుగ. తెలంగాణ మహిళా లోకం మద్దతు బీఆర్ఎస్ కే. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి నేను, నా సతీమణి రజితారెడ్డి, నా తమ్ముడు కలిసి పాటుపడుతున్నాం.ఆర్మూర్ అక్క చెల్లెళ్ళ ఆశీస్సులు నాకే. మూడోసారీ గెలిచి వారి రుణం తీర్చుకుంటా అని జీవన్ రెడ్డి భావోద్వేగంతో అన్నారు.

మహిళలకు సత్కారం, పట్టు చీరెల పంపిణీ

ఈ సందర్భంగా వివిధ రంగాలలో అధ్బుతమైన ప్రతిభ కనపరుస్తున్న మహిళలను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఆయన సతీమణి రజితా రెడ్డి కలిసి ఘనంగా సన్మానించారు. మహిళలందరికీ పట్టుచీరెలు పెట్టి వారి ఆశీస్సులు తీసుకున్నారు. మహిళా సంక్షేమ సంబురాలలో పాల్గొన్న వేలాదిమంది మహిళలకు విందు భోజనం ఏర్పాటు చేశారు. జీవన్ రెడ్డి దంపతులు స్వయంగా వారికి భోజనాలు వడ్డించారు.
ఈ కార్యక్రమంలో జడ్పిఛైర్మన్ విఠల్ రావు, మున్సిపల్ ఛైర్మన్ పండిత్ వినితా పవన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితా రెడ్డి, జడ్పిటిసి సంతోష్, ఆర్మూర్ ఎంపిపి పస్క నర్సయ్య, వైస్ ఎంపిపి చిన్నారెడ్డి, మాక్లూర్ ఎంపిపి మాస్త ప్రభాకర్, వైస్ ఎంపిపి సుక్కి సుధాకర్, గ్రామ సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి, ఉపసర్పంచ్ శ్రీనివాస్, ఎంపిటీసి మల్లేష్, బిఆర్ఎస్ పార్టీ ఆర్మూర్, నందిపేట్, మాక్లూర్ మండలాల అధ్యక్షులు ఆలూర్ శ్రీనివాస్ రెడ్డి, మచ్చర్ల సాగర్, సత్యనారాయణ, అధికారులతో పాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News