Saturday, November 23, 2024
HomeదైవంMalayappa Swamy: కెనడాలోని వైభవంగా శ్రీ మలయప్ప స్వామి కల్యాణం

Malayappa Swamy: కెనడాలోని వైభవంగా శ్రీ మలయప్ప స్వామి కల్యాణం

కెనడా, USA లలోని వివిధ తెలుగు, భారతీయ, ధార్మిక సంస్థల నుండి వచ్చిన అభ్యర్థనల మేరకు తితిదే వారి అనుమతితో ఈ కల్యాణోత్సవాలు

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కెనడా, USA లలోని 14 నగరాల్లో శ్రీ శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా జూన్ 4వ తేదీన Toronto, 10వ తేదీన Montreal, 11న Ottawa లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. తితిదే నుండి వెళ్ళిన అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం కల్యాణాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ APNRTS మొదటినుండి తితిదేతో ఒకవైపు, ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గాలతో మరోవైపు సమన్వయము చేస్తూ వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం కల్యాణోత్సవం జరిగేలా చూసుకుంది. అక్కడి నిర్వాహకులు… భక్తులు, అర్చకులు, వేదపండితులకు, తితిదే అధికారులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Toronto, Ottawa లో వేదికను అలంకరించిన తీరు అద్భుతంగా ఉంది. కన్నులకు ఇంపుగా, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా స్వామి వారి కళ్యాణ వేదికను అలంకరించారు. ఈ కల్యాణోత్సవాలకు తెలుగు వారే కాక, ఇతర రాష్ట్రాలకు చెందిన 10 వేలకు పైగా స్వామివారి NRI భక్తులు హాజరై కల్యాణ ఘట్టాన్ని తిలకించి, భక్తిపరవశంతో పులకించారు. ఆయా నగరాల్లోని నిర్వాహకులు ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకొని, ఏర్పాట్లన్నీ ఘనంగా చేసారు. హాజరైన భక్తులందరూ స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొని స్వామివారి కల్యాణం నిర్వహించినందుకు సంతోషించారు. అనంతరం భక్తులందరికీ తిరుమల నుండి తెచ్చిన లడ్డూ ప్రసాదం అందించారు.

ఈ కల్యాణోత్సవాల్లో ప్రవాసాంధ్రుల వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు APNRTS అధ్యక్షులు అయిన శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మనదేశంలోని వివిధ ప్రాంతాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి కల్యాణోత్సవం జరుగుతుందన్నారు. తితిదే చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పర్యవేక్షణలో కెనడా, USA లలోని వివిధ తెలుగు, భారతీయ, ధార్మిక సంస్థల నుండి వచ్చిన అభ్యర్థనల మేరకు తితిదే వారి అనుమతితో ఈ కల్యాణోత్సవాలు జరుగుతున్నాయన్నారు. ఈ కల్యాణోత్సవాలకు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే కనుక… నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారి దర్శనం చేసుకోలేని ఎంతో మంది భక్తులు ఈ కల్యాణం ద్వారా స్వామీ, అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్నారన్నారు. శ్రీ. సంజయ్ కుమార్ వర్మ, హై కమీషనర్, ఇండియా హై కమీషన్, కెనడా MP లు శ్రీ. చంద్ర ఆర్యా గారు, శ్రీమతి. ఆనా రాబర్ట్స్ స్వామివారి కల్యాణంలో పాల్గొన్నారు. సుప్రభాత సేవ నుండి కల్యాణోత్సవం క్రతువు వరకు అన్నీ శాస్త్రం ప్రకారం తిరుమలలోలాగ జరిగాయన్నారు. అలాగే USA లోని 11 నగరాల్లో ఈ నెల 17వ తేదీ నుండి జూలై 23 వ తేదీ వరకు శ్రీవారి కల్యాణం నిర్వహిస్తున్నట్లు వెంకట్ తెలిపారు.

కెనడాలోని ఈ ౩ నగరాల్లో జరిగిన కల్యాణోత్సవాల్లో తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా (TACA) ముఖ్య పాత్ర పోషించింది. శ్రీ చారి సమంతపూడి పర్యవేక్షణలో శ్రీ. కరుణాకర్ రెడ్డి పాపల, శ్రీ శ్రీనాథ్ కుందూరి, శ్రీమతి. కల్పన మోటూరి, శ్రీ. వైశంపాయన్ దతార్, శ్రీ. అరుణ్, APNRTS రీజనల్ కో ఆర్డినేటర్స్ డా. జగన్ మోహన్ మరియు శ్రీ వేణుగోపాల్ చుక్కలూరి తదితరులు స్వామివారి కల్యాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసారు.

ఈ కార్యక్రమంలో తితిదే నుండి AEO (Gen) శ్రీ.. బి. వెంకటేశ్వర్లు, APNRTS కో ఆర్డినేటర్లు, ఆయా నగరాలలోని పలువురు ప్రముఖులు, భారతీయులు పాల్గొన్నారు. SVBC డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి కళ్యాణోత్సవం మొత్తం కార్యక్రమాన్ని వెబ్ లైవ్ కవరేజ్ ను సమన్వయము చేసారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News