సింగరేణి కార్మిక అన్నలే నా బలగం, నా బంధువులని, సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం సీఎం కెసిఆర్ ఎల్లవేళలా కృషి చేస్తారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం సింగరేణి-1 పరిధిలోని 2ఎ గనిపై తెలంగాణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా రామగుండం ఎమ్మెల్యే చందర్ చేపట్టిన దశబ్ది ప్రగతి యాత్ర ఘనంగా జరిగింది. ముందుగా ఎమ్మెల్యే చందర్ కు టీబీజీకేఎస్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల ఉనికిని కాపాడుకోవడానికి వారసత్వపు హక్కును సీఎం కెసిఆర్ పునరుద్ధరించారని ఎమ్మెల్యే చందర్ అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేని సీఎం కేసీఆర్ అధికారమును సైతం వదిలిపెట్టి, తెలంగాణ ప్రజల జీవన స్థితిని మార్చేందుకు 2001లో టిఆర్ఎస్ పార్టీని నెలకొల్పాడని అన్నారు. 14 సంవత్సర కాలంలో ఎంతోమంది రాష్ట్ర ఏర్పాటు కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, ఎట్టకేలకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్ల కాలంలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు దీటుగా అభివృద్ధిలో సంక్షేమంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. తెలంగాణ ప్రజల బతుకులు మార్చేందుకు అనేక సంక్షేమ పథకాలను రూపకల్పన చేసి, పగడ్బందీగా అమలు చేస్తున్నారని అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకం చేరుతుందనడంలో అతిశయోక్తి లేదని ఆయన అన్నారు. సమైక్య పాలనలో గత ప్రభుత్వాలు వారసత్వపు హక్కు పోగొట్టిందని, కానీ సీఎం కేసీఆర్ కార్మిక సంక్షేమాన్ని దృష్ట్యా వారసత్వ హక్కును పునరుద్ధరించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, కార్మికుల జీవితాల్లో ఆనంద వెలుగులు నింపింది అన్నారు. వారసత్వపు ఉద్యోగంతో సుమారుగా 16,000 మంది యువత ఉద్యోగులుగా రూపు దాల్చారని అన్నారు. దేశంలోని ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఎంతమంది నాయకులు అనాలోచితంగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సింగరేణి ఉనికిని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎంఎంటిఆర్ -14 చేసిందని అన్నారు. గొప్ప పాలనను అందిస్తున్న సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేస్తే ప్రజలు ఊరుకోరు అని హెచ్చరించారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు ప్రజా సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తారని అన్నారు. ప్రజల బాగు కోసం పోరాటం చేసింది బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో తాగునీరుకు సాగునీరుకి ఇబ్బంది ఉండకూడదని, కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు చేసి పంట పొలాలని సస్యశ్యామలంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కింది అన్నారు. తాను ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రామగుండం నియోజకవర్గం లో గత ప్రజా ప్రతినిధులు చెయ్యలేని అభివృద్ధి చేశానని అన్నారు. స్థానిక ప్రజలకు తరతరాలుగా సేవలు అందించే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి రామగుండ ప్రాంతాన్ని ఆరోగ్య ప్రాంతంగా తీర్చిదిద్దానని అన్నారు. అంతేకాకుండా సబ్ రిజిస్టర్, కోర్టు భవన సదుపాయం కార్యాలయాలను సైతం ఏర్పాటయ్య విధంగా కృషి చేశానని అన్నారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు దామోదర్, మల్లయ్య, శంకర్, రమేష్, శేషగిరి, జనగామ శ్రీనివాస్, శంకర్, దాసరి నర్సయ్య, గండు శ్రావణ్, ముదిగిరి మల్లేష్, దాసరి శ్రీనివాస్, పొలాడి శ్రీనివాసరావు, అయాజ్, కొమురయ్య, గండ్ర రాజు, కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య, బిఆర్ఎస్ నాయకులు దొమ్మటి వాసు, తోకల రమేష్, కుల్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.