దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర వైద్యారోగ్య రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేంత వరకు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల తపన కొనసాగుతూనే వుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. వైద్యారోగ్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాచరణ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని, కరోనావంటి కష్టకాలంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డాక్టర్లు నర్సులు సిబ్బంది ఉన్నతాధికారులు ప్రదర్శించిన పనితీరు గొప్పదని సిఎం కొనియాడారు.
ఎంతచేసినా వైద్యశాఖకు పలు దిక్కులనుండి విమర్శలు వస్తుంటాయని ఈ విషయాన్ని గమనించి ప్రజావైద్యం దిశగా ఈ శాఖ చేస్తున్న కృషిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని ఆ దిశగా ప్రజా సంబంధాల వ్యవస్థను మరింతగా మెరుగుపరుకుని ప్లానింగ్ చేసుకోవాలని సిఎం సూచించారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా నాడు జరిగిన వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా …ప్రముఖ ప్రభుత్వ దవాఖాన నిమ్స్’ విస్తరణ పనులకు సిఎం శంఖుస్థాపన చేశారు. ఇందులో భాగంగా నిర్మించనున్న ‘దశాబ్ధి వైద్య భవనా’ల్లో నూతనంగా 2000 ఆక్సీజన్ పడకలు అందుబాటులోకి రానున్నాయి. అత్యంత అధునాతన ఆపరేషన్ థియేటర్లు సహా వర్తమాన వైద్య రంగంలో ప్రజల వైద్యసేవలకు అవసరమయ్యే పలు రకాల వైద్య సేవలు అందనున్నాయి.
న్యూట్రిషన్ కిట్ల పంపిణీ ప్రారంభించిన సిఎం కేసీఆర్ :
గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా లాంఛనంగా ప్రారంభించారు. కేసీయార్ న్యూట్రిషన్ కిట్ లబ్ధిదారులు పార్వతి – ఉదయనగర్ కాలనీ చెందిన పార్వతి, భోళానగర్ కు చెందిన పర్వీనమ్మ, ఎంబీటీ నగర్ కు చెందిన శిరీషమ్మ, ప్రతాప్ నగర్ పంజాగుట్ట తేజశ్విని, శ్రీరామ్ నగర్ కు చెందిన సుజాతమ్మ, అంబెడ్కర్ నగర్ రేణుకమ్మ లకు న్యూట్రిషన్ కిట్లను సిఎం కేసీఆర్ లబ్ధిదారులకు అందచేశారు.