Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Pawar family war: పవార్‌ కుటుంబంలో వారసత్వ పోరాటం

Pawar family war: పవార్‌ కుటుంబంలో వారసత్వ పోరాటం

ప్రశాంతంగా గడిచిపోతున్న కుటుంబంలో ఈ వారసత్వ నియామకం చిచ్చుపెట్టింది

గత 10వ తేదీన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌.సి.పి) అధినేత శరద్‌ పవార్‌ తన కుమార్తె సుప్రియా సూలేను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించడం ఆ పార్టీ నాయకులనే కాదు, దేశ ప్రజలందరినీ నిర్ఘాంతపరచింది. నిజానికి మహారాష్ట్ర రాజకీయాలను గమనిస్తున్నవారికి ఇదేమీ ఆశ్చర్యకర విషయం కాకపోవచ్చు కానీ, ఆయన ఎంచుకున్న సందర్భమే ఆశ్చర్యపరుస్తోంది. ఏదో ఒక రోజున శరద్‌ పవార్‌ తన కుమార్తెకే తన పార్టీ పగ్గాలను అప్పజెప్పే అవకాశం ఉన్నప్పటికీ ఆయన సోదరుడి కుమారుడు 63 ఏళ్ల అజిత్‌ పవార్‌ ఈ పదవికి అన్ని విధాలా అర్హుడనే భావం మహారాష్ట్ర ప్రజల్లో బాగా పాదుకుపోయి ఉంది. ఈ పదవి కోసం అజిత్‌ పవార్‌ కూడా చాలా కాలంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్‌.సి.పి ఈ ఏడాది రజతోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ నియామకం పార్టీలోని సంక్షోభానికే కాకుండా, ఆ కుటుంబంలోని లుకలుకలకు కూడా అద్దం పడుతోంది. హాయిగా, ప్రశాంతంగా గడిచిపోతున్న కుటుంబంలో ఈ వారసత్వ నియామకం చిచ్చుపెట్టింది.
మొత్తానికి ఈ నియామకం పార్టీకి ఒక పెద్ద సమస్యగా మారబోతోందనడంలో సందేహం లేదు. ఇది అజిత్‌ పవార్‌ను ఒక రకంగా అవమానించడంలాంటిది. ఆయన నాయకత్వం మీద నమ్మకం లేదని చెప్పకనే చెప్పినట్టయింది. దీన్ని ఆయన తేలికగా తీసుకునే ప్రసక్తే లేదు. పార్టీలో 82 ఏళ్ల శరద్‌ పవార్‌ను ద్వితీయ శ్రేణి నాయకులు సాధారణంగా ‘కాకా’ అని సంబోధిస్తుంటారు. అజిత్‌ పవార్‌ను మాత్రం ‘సాహెబ్‌’ అని అంటుంటారు. అజిత్‌కు పార్టీ మీద ఉన్న పట్టుకు ఇదొక నిదర్శనం. ‘తాయి’ (సుప్రియా సూలే)కి ప్రమోషన్‌ ఇవ్వడం బాగానే ఉంది కానీ, ‘దాదా’ (అజిత్‌) రాజీపడతారా అన్నది సమస్య అంటూ స్థానిక మరాఠీ పత్రికలు విశ్లేషణలు రాశాయి. మొత్తానికి మున్ముందు అజిత్‌ ఏం చేయబోతున్నారన్నది పార్టీలో ఒక పెద్ద ప్రశ్నగా, చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ 25 ఏళ్ల కాలంలో ఎన్‌.సి.సి ఎక్కువ మంది రాష్ట్ర నాయకులను తయారు చేయలేకపోయింది. ఆ పార్టీలో బాగా ఎదిగిన ఇద్దరిలో ఒకరు అజిత్‌ పవార్‌ కాగా, మరొకరు ఎన్‌.సి.పి రాష్ట్ర నాయకుడు జయంత్‌ పాటిల్‌. చగన్‌ భుజబల్‌ వెనుకబడిన వర్గాల నాయకుడే అయినప్పటికీ, దివంగత గోపీనాథ్‌ ముండే స్థాయికి మాత్రం చేరుకోలేకపోయారు. సుప్రియా సూలే ఒక మంచి వక్త. పార్టీ శ్రేణుల అభిమానాన్ని చూరగొన్నారు. అయితే, ఆమె జాతీయ స్థాయిలో మాత్రమే చురుకుగా, క్రియాశీలంగా వ్యవహరిస్తుంటారు.
ఇక శరద్‌ పవార్‌ విషయానికి వస్తే ఆయన ఒకప్పుడు ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తి. అపర రాజకీయ చాణక్యుడు. రాజకీయంగా అపారమైన అనుభవం పండించుకున్న వ్యక్తి. అయితే, ఆయన ఎంత ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన పార్టీ మహారాష్ట్రను దాటి బయటికి వెళ్లలేకపోయింది. మహారాష్ట్రలో కూడా ప్రస్తుతం ఆ పార్టీ మూడవ స్థానంలోనో, నాలుగవ స్థానంలోనో కొనసాగుతోంది. 2019లో అజిత్‌ పవార్‌ ఒక్కసారిగా తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఆయన హఠాత్తుగా దేవేంద్ర ఫడ్నవీస్‌ నాయకత్వంలోని బీజేపీకి మద్దతు ప్రకటించి, ఫడ్నవీస్‌ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా చేరిపోయారు. ఇది పార్టీని దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే, ఆ ప్రభుత్వం మూడు రోజులకే కుప్పకూలిపోయింది. ఇది శరద్‌ పవార్‌ ఆశీస్సులతో జరిగిందా లేక ఆయనను పక్కన పెట్టేసి నిర్ణయం తీసుకున్నారా అన్నది ఇప్పటికీ అంతుబట్టని విషయమే. ఆ తర్వాత శరద్‌ పవార్‌ మార్గదర్శనంలో కాంగ్రెస్‌, ఎన్‌.సి.పి, శివసేన మహావికాస్‌ అఖాడీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
అజిత్‌ పవార్‌ పాలనాదక్షుడే కానీ, ఒక్కొక్కసారి దూకుడుతనం ప్రదర్శిస్తుంటారు. తొందరపాటు నిర్ణయాలతో తన సమస్యలను తానే కొని తెచ్చుకుంటుంటారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా చాలా కాలం పని చేశారు. అందువల్ల ఆయనకు పాలనా వ్యవహారాలలో అపారమైన అనుభవం ఉంది. ఓ పదేళ్ల క్రితం పృథ్వీరాజ్‌ చౌహాన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అజిత్‌ మీద అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అవినీతి గురించి విస్తృతంగా ప్రచారం జరిగింది. కాగా, ఆయన ఇప్పుడు గనుక బీజేపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. రెండు దశాబ్దాల క్రితం సుప్రియా సూలే రాజకీయాల్లో అడుగుపెట్టే వరకూ, అజిత్‌ పవార్‌నే శరద్‌ పవార్‌ వారసుడుగా భావిస్తూ వచ్చారు. గత జూన్‌ 10న తనకంటే జూనియర్‌ను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా శరద్‌ పవార్‌ నియమించడాన్ని ఆయన జీర్ణించుకోవడం కష్టం. అజిత్‌ పవార్‌ పట్ల మొదటి నుంచీ ఎంతో అభిమానంతో ఉన్న సుప్రియా సూలే ఇప్పుడు దూరం కావడం మొదలైంది. అజిత్‌ పవార్‌ బీజేపీకి దగ్గరవుతున్నారంటూ రెండు నెలల క్రితం బాగా ప్రచారం జరిగింది. అయితే, ఆయన, ఆయనతో పాటు శరద్‌ పవార్‌ కూడా ఈ ప్రచారాన్ని ఖండించడం జరిగింది.
ఇక అజిత్‌ పవార్‌ తమ శాసనసభ్యులను కూడగట్టుకుంటున్నారని, విడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిసి, శరద్‌ పవార్‌ తాను అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించడం జరిగింది. పార్టీకి తానే అధినాయకుడినని నిర్ధారించడం ఆయన ఉద్దేశం. దాంతో అజిత్‌ కొద్దిగా వెనక్కు తగ్గారు. పార్టీకి తానే అధినాయకుడినని తెలియజెప్పడానికి శరద్‌ పవార్‌ ఇప్పుడు సుప్రియ నియామకాన్ని ప్రకటించినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో సుప్రియకు అజిత్‌కు ఉన్నంత అనుభవం గానీ, అవగాహన గానీ లేకపోవడం వల్ల, రాబోయే ఎన్నికల్లో శరద్‌ పవార్‌ తప్పనిసరిగా మరింత పెద్ద పాత్ర పోషించాల్సి ఉంటుంది. అజిత్‌ పవార్‌ను పక్కనపెట్టి ప్రచారం సాగించాల్సి ఉంటుంది. అజిత్‌ పవార్‌ ఎన్‌.సి.పిలో అణగిమణగి ఉండడమో, వేరు కుంపటి పెట్టడమో తేల్చుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News