Saturday, November 23, 2024
HomeతెలంగాణJammikunta: నాయిని చెరువు అద్భుతంగా తీర్చిదిద్దుతా

Jammikunta: నాయిని చెరువు అద్భుతంగా తీర్చిదిద్దుతా

ఒకప్పుడు దుమ్ముకుంటగా పేరున్న జమ్మికుంట నేడు అన్ని హంగులు సంతరించుకుంది

పట్టణ ప్రగతిలో పట్టణాలు సరికొత్త రూపురేఖలను సంతరించుకొని దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, జమ్మికుంట నాయిని చెరువును అద్భుతంగా తీర్చిదిద్దుతానంటూ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కృషితో పాటు పట్టణ ప్రగతిలో కల్పిస్తున్న మౌలిక వసతులతో తెలంగాణలోని పట్టణాలు సరికొత్తగా మారాయన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జమ్మికుంట పట్టణంలో నిర్వహించిన పట్టణ ప్రగతి దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ముందుగా గాంధీ చౌక్ వద్ద జెండా పతాక ఆవిష్కరణలో పాల్గొన్నారు. అనంతరం గాంధీ చౌక్ నుంచి పాత మున్సిపల్ కార్యాలయం వరకు డప్పు చప్పులు, మహిళల నృత్యాలు, బతుకమ్మ ఆటపాటలతో ర్యాలీగా తరలివచ్చారు.

- Advertisement -

పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు నగర పంచాయతీగా ఉన్న జమ్మికుంట నేడు మున్సిపాలిటీగా మారి ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జమ్మికుంట మున్సిపల్ పరిధిలో రూ,123 కోట్లు కేటాయించి చేపట్టిన పలు అభివృద్ధి పనులతో పట్టణ రూపు రేఖలే మారాయి అన్నారు. ఒకప్పుడు దుమ్ముకుంటగా పేరు ఉన్న జమ్మికుంట నేడు అన్ని హంగులు సంతరించుకొని ఆదర్శ పట్టణంగా తయారైందన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదన్నారు. బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో సమానం అని చెప్పుకున్న ఈటల సిద్దిపేటలో జరిగిన అభివృద్ధిని జమ్మికుంటలో ఎందుకు చేయలేకపోయాడని సూటిగా ప్రశ్నించారు. ఈటలకు వ్యక్తిగత స్వలాభమే తప్ప పట్టణ అభివృద్ధిపై ఏనాడు దృష్టి సారించలేదని విమర్శించారు. ఈటల రాజేందర్ పార్టీ మారడంతో హుజురాబాద్ కు పట్టిన శని విరగడైందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు హుజురాబాద్ నియోజకవర్గం అంటే ప్రత్యేక అభిమానం ఉందని అన్నారు. అందులో భాగంగానే రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతుబంధు పథకాన్ని, దళితుల జీవితాల్లో వెలుగులు నింపే దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలోనే ప్రారంభించడం జరిగిందన్నారు. జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీల పరిధిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను సకల సౌకర్యాలతో నిర్మాణం చేపట్టామన్నారు. రైతుబంధు పథకం కింద హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో ఇప్పటి వరకు రూ,523 కోట్ల 75 లక్షలను పెట్టుబడి సాయం కింద అందించడం జరిగిందన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ రైతులకు విద్యుత్ కష్టాలు తీర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

నియోజకవర్గ పరిధిలో 34 వేల వ్యవసాయ విద్యుత్ మీటర్లు ఉండగా ఇప్పటి వరకు రూ,840 కోట్ల సబ్సిడీ చెల్లించడం జరిగింది అన్నారు. రూ,540 కోట్లతో విద్యుత్తు లైన్లకు మరమ్మతులు చేపట్టడం ఒక విప్లవాత్మకమైన నిర్ణయం అన్నారు. రూ,70 వేల కోట్లతో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఒక లక్ష 15 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. వివిధ కారణాలతో 840 మంది రైతులు చనిపోగా వారికి రైతు బీమా పథకంలో రూ,42 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. హుజురాబాద్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో పదివేల మందికి రూ,88 కోట్ల ఇవ్వడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో 44 వేల మందికి పలు రకాల ఆసరా పింఛన్లు నెలకు రూ,10 కోట్లు చెల్లిస్తున్నట్లు చెప్పారు. సుమారు 150 కోట్లతో మిషన్ కాకతీయలో నియోజకవర్గ పరిధిలోని చెరువులు, కుంటలలో పునరుద్ధరణ పనులను చేపట్టడం జరిగిందన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీలను సిద్దిపేట తరహాలో అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం మున్సిపల్ పరిధిలో ఉత్తమ సేవలందిస్తున్న ఉద్యోగులకు, పారిశుద్ధ్య సిబ్బందికి, మహిళా సంఘాల సభ్యులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. 59 జీవోలో 13 మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను క్రమబద్ధీకరణ చేసి భూ యజమాని హక్కు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చెర్మైన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న కోటి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, ఆర్డిఓ హరి సింగ్, కమిషనర్ శ్రీనివాస్, ఎమ్మార్వో రాజేశ్వరి, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News