Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Water pollution: ఎవరికీ పట్టని జల కాలుష్యం

Water pollution: ఎవరికీ పట్టని జల కాలుష్యం

నీటి కాలుష్యం కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయారు

దేశంలో ఏ ప్రభుత్వమూ ఏనాడూ పట్టించుకోని, ప్రాధాన్యంఇవ్వని ప్రాణాంతక సమస్య ఇది. జీవితానికి అత్యంత ప్రాథమిక అవసరమైన నీటిని తాగినంత మాత్రాన ప్రాణాలు కోల్పోవడమన్నది నిజంగా దిగ్భ్రాంతికరమైన విషయం. దేశంలో నీటి కాలుష్యం కారణంగా ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం దాదాపు ఆనవాయితీ అయిపోయింది. గత వారంలో కర్ణాటకలోని కొప్పల్‌ , రాయచూర్‌, బెలగావి ప్రాంతాల్లో ముగ్గురు పిల్లలతో సహా ఆరుగురు కలుషిత నీరు తాగిన కారణంగా చనిపోయారు. వందలాది మంది జ్వరాలు, వాంతులు, విరేచనాలతో అవస్థలు పడుతున్నారు. ఇందులో చాలామంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఆస్పత్రులలో కూడా చేర్చారు. ఇటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ చోటు చేసుకుంటున్నప్పటికీ, పాలకులు పాఠాలు నేర్చుకోకపోగా, ఇది సాధారణ వ్యవహారమైనట్టు తేల్చి పారేయడం జరుగుతోంది. నీరు కలుషితం కావడం ఎక్కడా ఏమాత్రం తగ్గడం లేదు. లాన్‌సెట్‌ సర్వే ప్రకారం, 2019లో కేవలం నీటి కాలుష్యం కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోయారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశం అనేక రంగాలలో విజయాలు, సాఫల్యాలు సాధించిన మాట నిజమే. కానీ, అత్యంత ప్రాథమిక అవసరమైన తాగు నీరు కలుషితం కాకుండా నిరోధించడంలో మాత్రం పూర్తిగా విఫలమైంది. కాలుష్యాన్ని నివారించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమన్నది మాత్రం ఎక్కడా జరగడం లేదు. నిజానికి ఏ దేశంలో అయినా ఇది క్షమించరాని నేరం. రాయచూర్‌ జిల్లాలోని రేకలమర్ది గ్రామం నుంచి నీటి నమూనాలను సేకరించి, లేబొరేటరీలో పరీక్షించినప్పుడు, ఈ నీరు తాగడానికి ఏమాత్రం యోగ్యంగా లేదని తేల్చి చెప్పడం జరిగింది. ఇక్కడ కలుషిత నీటిని తాగిన కారణంగా ఒక పసిపిల్ల మరణించగా, వందలాది మంది ఆస్పత్రుల పాలయ్యారు. ఏమాత్రం పనికిరాని నీటిని, దాదాపు విషపూరితంగా మారిన కలుషిత నీటిని ఎలా సరఫరా చేశారన్నది అంతుబట్టని విషయం.
జరగాల్సిన నష్టం జరిగి పోయిన తర్వాత పాలకులు స్పందించడమన్నది ఎప్పుడూ జరిగే తంతే. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ కలుషిత నీటి సంఘటనలపై వెంటనే దర్యాప్తునకు ఆదేశించి, పది రోజుల్లో నివేదికలు అందాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంఘటనలకు దారితీసిన నిర్దిష్ట కారణాలను గుర్తించడానికి ఈ దర్యాప్తులు ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. కానీ, ప్రజలకు పరిశుద్ధమైన, స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయడానికి, నీటి కాలుష్యాన్ని నివారించడానికి ఒక యంత్రాంగాన్ని లేదా ఒక వ్యవస్థను సృష్టించడానికి మాత్రం ప్రయత్నం జరగదనివెనుకటిఅనుభవాలను బట్టి అర్థం చేసుకోవాల్సివస్తోంది. నిజానికి మరికొన్ని అంశాలపై కూడా దర్యాప్తు జరపాల్సి ఉంటుంది. ప్రతి ఇంటికీ కొళాయి నీళ్లు సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం చాలా కాలం క్రితం జల్‌ జీవన్‌ మిషన్‌ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే, కర్ణాటక రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకోకుండా ఈ పథకం కింద నీటి కనెక్షన్లను ఇవ్వడం జరుగుతోంది. ఈ అక్రమాల మీద కూడా ప్రభుత్వం దర్యాప్తు జరపడం మంచిది.
నీరు కలుషితం కావడమన్నది అనేక కారణాల వల్ల జరుగుతుంటుంది. ప్రజలు కుండలతో లేక బిందెలతో నీరు తీసుకు వచ్చే ప్రదేశానికి ఆనుకునే మురికి నీరు కూడా ప్రవహిస్తూ ఉండడం ఇందుకు ఒక కారణం. భూగర్భ జలాలలోకి రసాయనాలు, పారిశ్రామిక వ్యర్థాలు, క్రిమి సంహారక మందులు కూడా ఇంకడం మరొక కారణం. సముద్రాలు, నదులు, ప్రవాహాల్లో వ్యర్థ పదార్థాలను, చెత్తా చెదారాన్ని కుమ్మరించడం, ఇక నీటి నిల్వ కేంద్రాలను శుభ్రంచేయకపోవడం కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి. భూగర్భ జలాలను తరచూ తనిఖీచేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. నీటి గొట్టాలను కూడా శుభ్రం చేస్తూ ఉండాలి. మురికినీరు, తాగునీరు ఎక్కడా కలసిపోకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. భూగర్భ జలాలనే కాకుండా, నీటి టాంకులను, నీటి నిల్వ కేంద్రాలను తరచూ తనిఖీ చేసి, అవి శుభ్రమయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. భూగర్భంలోకి రసాయనాలు, పురుగులమందులు, పారిశ్రామిక వ్యర్థాలు ఇంకకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి చర్యలన్నీ చేపట్టడానికి తప్పనిసరిగా ఒక నీటి శుభ్రత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఇటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం అసాధ్యమైన విషయమేమీ కాదు. వర్షాకాలం ప్రారంభంకావడానికిముందు ఇటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రారంభించడం మంచిది.
విచిత్రమేమింటే, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడల్లా ఈ విధమైన వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ వ్యవహారం మూలన పడుతుంది. ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతున్న వ్యవహారం. ఏ ప్రభుత్వమూ దీన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. అనేక అధ్యయనాలు తమ నివేదికల ద్వారా ముందస్తు హెచ్చరికలు చేస్తున్నా అవి ప్రభుత్వాలకు పట్టడం లేదు. ప్రభుత్వాలు ఏటా కొన్ని కోట్ల రూపాయలు తమ బడ్జెట్‌లో వీటిని నిధులు కేటాయించడం జరుగుతోంది కానీ, ఆచరణలో మాత్రం ఎక్కడా నీటి కాలుష్యం మాత్రం తగ్గడం లేదు. లాన్‌సెట్‌ అధ్యయనం ప్రకారం, ఇప్పటికి 22 పర్యాయాలు దేశవ్యాప్తంగా అధ్యయనాలు జరిగాయి. రాష్ట్ర స్థాయిలో కూడా జల నిపుణులు ఆరుసార్లు అధ్యయనాలు జరిపి, ప్రభుత్వానికి నివేదికలు అందజేయడం జరిగింది. ఈ సమస్యా పరిష్కారానికి అనేక సిఫార్సులు చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ ఏ ప్రభుత్వమూ ఈ సమస్యకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కర్ణాటకలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైనా ఈ సమస్యను పరిష్కరించి, దేశానికి ఆదర్శం కావడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News