Friday, September 20, 2024
HomeతెలంగాణKarimnagar: రాజకీయాలపై అదనపు పి.పి. సంజీవ రెడ్డి ఆసక్తి

Karimnagar: రాజకీయాలపై అదనపు పి.పి. సంజీవ రెడ్డి ఆసక్తి

పాడి కౌశిక్ రెడ్డి స్థానంలో తెరపైకి సంజీవ రెడ్డి పేరు.. జిల్లా రాజకీయవర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్

కరీంనగర్ జిల్లా రాజకీయాలు ఎవ్వరు ఊహించని విధంగా మలుపులు తిరుగుతోంది. ఎన్నికల ఏడాది కావడంతో అన్ని పార్టీల్లో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి ఒక్కరు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అధిష్టానం ఆశీస్సుల కోసం తమ తమ ప్రయత్నాల్లో నిమగ్నం అవుతున్నారు. తమ పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తే ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగి తమ సత్తా చాటుకోవడానికి పలువురు ఇప్పటి నుండే అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా సీనియర్ అడ్వకేట్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కనుకుల సంజీవ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుండి బి.ఆర్.ఎస్. అభ్యర్థిగా బరిలో దిగాలని ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుండి బి.ఆర్.ఎస్. పార్టీ తరుఫున  ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బరిలో దిగుతారని ప్రచారం కొనసాగుతున్న సమయంలో సంజీవ రెడ్డి పేరు తెరమీదకు రావడం కరీంనగర్ జిల్లా రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

తెలంగాణ ఉద్యమంలో సంజీవ రెడ్డి చురుకైన పాత్ర :

హుజురాబాద్ నియాజకవర్గం, ఇల్లందకుంట మండలం, మల్లన్నపల్లి గ్రామానికి చెందిన సంజీవ రెడ్డి వృత్తి రీత్యా న్యాయవాది. ఎం.ఏ., ఎల్.ఎల్.బి. చదువుకున్న ఆయన    తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టి.ఆర్.ఎస్. పార్టీ ఆవిర్భావం జరిగిన సంవత్సరమే పార్టీలో చేరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ నాయకుడు, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్. ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొని  విజయవంతం చేశారు. 2006 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం టి.ఆర్.ఎస్. అధ్యక్షులు, అప్పటి కరీంనగర్ ఎం.పి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికలో కె.సి.ఆర్. గెలుపు కోసం కృషి చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గోపికృష్ణ ఫంక్షన్ హాల్లో తెలంగాణ న్యాయవాదుల సదస్సును నిర్వహించడమే కాకుండా కె.సి.ఆర్. గెలుపు కోసం ప్రత్యక్షంగా ప్రచారాన్ని సైతం నిర్వహించారు. 2007 సంవత్సరంలో టి.ఆర్.ఎస్. జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2009లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ప్రతి కార్యక్రమంలో ఆయన పాలుపంచుకున్నారు. కె.సి.ఆర్. పిలుపులో భాగంగా ధర్నాలు, రాస్తారోకోలు, రిలే  దీక్షలు, వంటావార్పు  తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన రిలే దీక్షతో పాటు పార్లమెంట్ ముట్టడి కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించారు.

వృత్తిలో అంకితభావం.. పలువురికి ఆదర్శం :
వృత్తి రీత్యా న్యాయవాది అయిన సంజీవ రెడ్డి తనవద్దకు వచ్చే నిరుపేద కక్షిదారులకు ఉచిత న్యాయ సేవలు అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 2000 సంవత్సరం నుండి 2001 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీగా, 2006 నుండి 2007 వరకు జనరల్ సెక్రెటరీగా, 2017-18 వరకు బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా సంజీవ రెడ్డి కొనసాగారు. జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఇంఛార్జి పి.పి.గా కొనసాగిన ఆయన 2018 సంవత్సరం నుండి కరీంనగర్ సెకండ్ అడిషనల్ సెషన్ కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా, 2022 సంవత్సరం నుండి ఫోక్సో కోర్టులో ఇంఛార్జి  పి.పి.గా ప్రస్తుతం కొనసాగుతున్నారు. 2016 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం సంజీవ రెడ్డికి ఉత్తమ న్యాయవాది అవార్డును ప్రకటించగా 2016లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 న అప్పటి మంత్రి ఈటెల రాజేందర్ చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. ప్రాసిక్యూషన్ తరుఫున ఆయన అందించిన సేవలను గుర్తించిన కరీంనగర్ పోలీస్ డిపార్ట్మెంట్ సంజీవ రెడ్డికి పలు అవార్డులు, ప్రశంసా పత్రాలను అందజేయడంతో పాటు ఘనంగా సన్మానాలు సైతం నిర్వహించింది.

సి.ఎం. కె.సి.ఆర్. ఆదేశిస్తే హుజురాబాద్ బరిలో..

ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తిగా ఉన్న విషయం తెలిసి సంజీవ రెడ్డిని సంప్రదించి వివరణ కోరగా ఆయన తెలుగుప్రభతో పలు విషయాలను పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం టి.ఆర్.ఎస్. పార్టీ ఆవిర్భవించిన సంవత్సరంలోనే పార్టీలో చేరి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నానని తెలిపారు. ముఖ్యమంత్రి కె.సి.ఆర్. ఆదేశిస్తే హుజురాబాద్ నియోజక వర్గం నుండి బరిలో దిగడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సంజీవ రెడ్డి స్పష్టం చేశారు. 2006 సంవత్సరంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో టి.ఆర్.ఎస్. అధ్యక్షులు కె.సి.ఆర్. గెలుపు కోసం కృషి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కొనసాగుతున్న తనకు అవకాశం ఇస్తే ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తానని పేర్కొన్నారు. ఏదేమైనా తనకు సి.ఎం. కె.సి.ఆర్. నిర్ణయమే శిరోధార్యం  అని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News