Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Uniform civil code: యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌పై చర్చ

Uniform civil code: యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌పై చర్చ

అభిప్రాయ సేకరణ జరిపి చాలా కాలం అయినందున కొత్తగా అభిప్రాయ సేకరణ జరపాల్సిన అగత్యం ఏర్పడిందన్న లా కమిషన్‌

ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌)పై ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని లా కమిషన్‌ నిర్ణయం తీసుకోవడంతో ఈ కీలక అంశం మరొకసారి చర్చనీయాంశం అయింది. ఇది మతపరంగా, రాజకీయ పరంగా వివాదాస్పద అంశమే అయినప్పటికీ, మొదటి నుంచీ దీనిపై తరచూ ప్రజాభిప్రాయాన్ని సేకరించడం జరుగుతూనే ఉంది. ఈ అంశంపై మళ్లీ అభిప్రాయ సేకరణ అవసరమవుతోందంటూ లా కమిషన్‌ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని కొన్ని వర్గాలు ఇది ఒక విచ్ఛిన్నకర అంశమనీ, ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రభుత్వం దీనిని తిరగదోడుతోందంటూ విమర్శించడం ప్రారంభించాయి. నిజానికి ఈ అంశంపై ఈవిధంగా అభిప్రాయాలు సేకరించడం ఇది 22వ పర్యాయం. చివరిసారిగా దీనిపై అభిప్రాయ సేకరణ జరిపి చాలా కాలం అయినందువల్ల కొత్తగా అభిప్రాయ సేకరణ జరపాల్సిన అగత్యం ఏర్పడిందని లా కమిషన్‌ వివరించింది. ఈ సారి అభిప్రాయ సేకరణను అనేక కొత్త వర్గాలకు విస్తరించడం కూడా జరిగిందని తెలిపింది.
కాగా, 2018లో 21వ సారి అభిప్రాయ సేకరణ జరిపినప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌పై అభిప్రాయాలను సేకరించడం అవసరమూ కాదు, వాంఛనీయమూ కాదనే అభిప్రాయం వ్యక్తమయింది.వివిధ వ్యక్తిగత చట్టాలను సంస్కరించి, అన్ని రకాల వివక్షలనూ తొలగించడానికి ఈ అభిప్రాయ సేకరణ జరుగుతోందనే అభిప్రాయాన్ని అప్పట్లో పక్కన పెట్టడం జరిగింది. వివిధ మతాలను ఒకే గొడుగు కిందకు తీసుకు వస్తూ ఒక ఉమ్మడి పౌర స్మృతిని తీసుకు రావాలనే ఉద్దేశానికి అప్పట్లో అంత ప్రాధాన్యమివ్వడం జరగలేదు. అంతేకాక, అప్పట్లో ఆ లా కమిషన్‌ నివేదికను ప్రగతిశీల నివేదికగా కూడా కొందరు అభివర్ణించడం జరిగింది. వివాహం, దత్తత, వారసత్వం, విడాకులు వంటి అంశాలలో మతపరమైన, వ్యక్తిగత చట్టాలకు ఆస్కారం లేకుండా మతాలన్నిటికీ కలిపి ఒకే విధమైన చట్టం ఉండాలని భావించినప్పటికీ, ఏకరూపత వల్ల వివక్ష పెరగడమే తప్ప, ఉపయోగమేమీ లేదని 21వ నివేదిక భావించడం జరిగింది.ముఖ్యంగా సమానత్వానికి ప్రధాన విఘాతంగా ఉన్న వివక్షా సహిత అంశాలను తొలగించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం కూడా కొన్ని వర్గాల నుంచి వ్యక్తమయింది. మహిళలకు సంబంధించిన అంశాలు, దత్తత వంటి విషయాల్లో ఇవి వివక్షాపూరితంగా ఉన్నాయని కొన్ని వర్గాలు ఇప్పటికీ భావిస్తున్నాయి.
ఈ 21వ నివేదిక తర్వాత తాజాగా 22వ నివేదిక తయారు కావాల్సిన అవసరం గానీ, మార్పులు గానీ జరగలేదని కొన్ని మత వర్గాలు, కొందరు మేధావులు, పత్రికలు అభిప్రాయపడడం జరుగుతోంది.దీన్ని ఎన్నికల అంశంగా మార్చాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ అంశాన్ని మళ్లీ చర్చనీయాంశం చేసిందని కొన్ని వర్గాలు విశ్లేషించడం జరుగుతోంది. వాస్తవానికి దేశంలో ఒక ఉమ్మడి పౌర స్మృతి అమలు కావడమనేది ఎంతో ఆదర్శనీయమైన అంశం. అయితే, దీనివల్ల రాజ్యాంగం హామీ ఇచ్చిన మతపరమైన స్వేచ్ఛ, హక్కు దెబ్బతింటాయా అన్నది పరిశీలించాల్సి ఉంటుంది. ఇటువంటి యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ దేశానికి అవసరం అని బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ కూడా భావించారు. అయితే, ఇది స్వచ్ఛందంగా జరగాలని ఆయన కోరుకున్నారు. ఏ మతానికీ మనస్తాపం కలిగించకుండా ఇటువంటి చట్టాన్ని తీసుకు రావడం మంచిది. కానీ, దీని వల్ల తమ వ్యక్తిగత చట్టాలు దెబ్బతిని, తమ మతానికే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని కొన్ని మతాలు ఆందోళన చెందుతున్నాయి.
ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో ఎటువంటి చట్టాన్ని లేదా కోడ్‌ని తీసుకు వచ్చినా అది బెడిసికొట్టే, తప్పు అర్థం ఇచ్చే అవకాశం ఉంది. మెజారిటీ వర్గం తనకున్న సంఖ్యాబలంతో తమపై బలవంతంగా యూనిఫామ్‌ కోడ్‌ను రుద్దిందనే అభిప్రాయం ఏర్పడడానికి అవకాశం ఉంది. వ్యక్తిగత చట్టాల్లో సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసరం మాత్రం తప్పకుండా ఉంది. ఇందులో సందేహం లేదు. ఉదాహరణకు, ఏ మతానికి చెందిన వారైనప్పటికీ 18 ఏళ్ల తర్వాతే వివాహానికి యోగ్యులు అవుతారనే నిబంధన అవసరం.తేలికగా విడాకులు మంజూరు చేయడం, ఇష్టానుసారంగా వివాహ బంధాన్ని తెంచేయడం, విడాకుల తర్వాత భరణం ఇవ్వడానికి సంబంధించిన అంశం వగైరాలన్నిటినీ ఒకే విధంగా ఉండాలని గత నివేదికలో కూడా పొందుపరచడం జరిగింది. గతంలో జరిగిన అభిప్రాయ సేకరణలో కూడా ఇటువంటి కీలకాంశాలపై చర్చ జరిగింది. ఏ మతానికి సంబంధించిన వ్యక్తిగత చట్టాలలో అయినా, సమానత్వానికి సంబంధించిన విశ్వజనీన సూత్రాలను పొందుపరచాల్సి ఉంటుంది. దురాచారాలను, దుస్సంప్రదాయాలను తొలగించాల్సి ఉంటుంది. ఏ ప్రభుత్వమైనా, ఏ సమాజమైనా కోరుకునేది అదే. దురభిప్రాయాలను, దురాలోచనలను అంటగట్టడం సబబు కాదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News