Friday, November 22, 2024
HomeతెలంగాణJivan Reddy: రాష్ట్రంలో 3146 గిరిజనులే సర్పంచులు

Jivan Reddy: రాష్ట్రంలో 3146 గిరిజనులే సర్పంచులు

గిరిజనుల నిజమైన దేవుడు కేసీఆర్

“మా తండాలో మా రాజ్యం” అన్న నినాదంతో ఏండ్ల తరబడి పోరాడిన అడవిబిడ్డల కలను సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేనని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మాక్లూర్ మండలం అమ్రాద్ తండా గ్రామంలో జరిగిన “గిరిజన దినోత్సవ” వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గిరిజన సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటి వరకు 53 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో గిరిజనుల అభివృద్ధి కోసం నిధులు కేటాయించిన దాఖలాలు లేవన్నారు. గిరిజనుల ఆత్మ గౌరవం ప్రతీకలుగా బంజారాహిల్స్ లో రూ.24.68 కోట్లతో ఆదివాసీ భవన్, రూ.24.43 కోట్లతో బంజారా భవన్ ను నిర్మించినట్టు ఆయన అన్నారు.

- Advertisement -


రూ.121.86 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 58 గిరిజన భవనాల నిర్మాణం చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 12 ఎస్ టీ నియోజకవర్గాల్లో కోటి రూపాయల చొప్పున ఖర్చు చేసి గిరిజన భవనాల నిర్మాణం జరిగిందన్నారు. 3467 గిరిజన ప్రాంతాలకు రూ.221 కోట్లతో వ్యవసాయ విద్యుత్ సరఫరా జరుగుతోంది.
గిరిజన విద్యార్థుల కోసం 92 ప్రత్యేక గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ ఉద్యమ కార్యాచరణ లో భాగంగా ఒక గిరిజన తండాలో బస చేసిన కేసీఆర్ బిడ్డ పెళ్లి చేయడానికి ఒక కుటుంబం పడుతున్న బాధల వేదనలోనుంచి పుట్టిందే కల్యాణ లక్ష్మీ స్కీమ్ అని జీవన్ రెడ్డి చెప్పారు.

స్వరాష్ట్రంలోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యపడిందన్నారు. గిరిజన తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చడం వల్ల రాష్ట్రంలో 3146 గ్రామ పంచాయితీలకు గిరిజనులే సర్పంచులుగా ఉండటం గొప్ప విషయమన్నారు. గిరిజన గ్రామాల్లో రూ. 243.20 కోట్లతో గ్రామపంచాయతీ భవనాలు నిర్మించారని,
ఇప్పటివరకు రూ.1275 .87 కోట్లతో 1682 గిరిజన ఆవాసాలకు బీటీ రోడ్లు నిర్మించారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. జనాభా దామాషా ప్రకారం ఎస్టీ రిజర్వేషన్లు 10శాతానికి పెంచడం ద్వారా గిరిజన విద్యార్థులకు లబ్ధి చేకూరింది. విద్య, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి.


మద్యం షాపుల లైసెన్సుల్లో 5 శాతం గిరిజనులకు రిజర్వేషన్ కల్పించారు. కల్యాణ లక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు 1.55 లక్షల మందికి రూ.1306 .25 కోట్ల ఆర్థిక సహాయం అందింది. 8.2 లక్షల మంది గిరిజన రైతులు రైతుబంధు ద్వారా రూ.8305 .40 కోట్ల రూపాయలు అందుకున్నారు. పోడు భూములకు పట్టాలు అందజేయడం ద్వారా ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు సీఎం కేసీఆర్. జూన్ 24 నుండి పోడు భూముల పట్టాల పంపిణి మొదలవుతుంది. గిరిజనుల విద్య, వైద్యం, వారి సంస్కృతి పరిరక్షణ కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం కృషి చేసింది. మేడారం జాతరతో పాటుగా సంత్ సేవాలాల్, నాగోబా, కొమురం భీం, భౌరాపూర్, పెరాల్, అంగుబాయి, పూలాజి బాబా జయంతి, గాంధారి మైనమ్ము, ఎరుకల నాంచారమ్మ లాంటి గిరిజనుల పండుగలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రూ.356 కోట్ల రూపాయలను ఖర్చు చేసి మేడారంలో మౌలిక సదుపాయాలు కల్పించారు.


సీఎం ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ షిప్” పథకం ద్వారా ఇప్పటి వరకు 109 మంది ఔత్సాహిక గిరిజన పారిశ్రామికవేత్తలకు రూ 44.51 కోట్ల ఆర్థిక సాయం అందించింది తెలంగాణ ప్రభుత్వం. “సీఎం గిరి వికాసం”, డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకం ద్వారా గిరిజన యువతకు లబ్ధి చేకూర్చింది. ఇక గిరిజన గ్రామాలు, ఆదివాసీ గూడేలు, తాండాలకు రవాణా మౌలిక సౌకర్యాలక కల్పనను కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలోని అన్ని గిరిజన ఆవాసాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారు అని జీవన్ రెడ్డి అన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం ఇన్ని కార్యక్రమాలు చేశాం కాబట్టే గిరిజనోత్సవాలను ఇంత ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులకు తీరని అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. గిరిజనుల నిజమైన దేవుడు కేసీఆర్ అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాస్త ప్రభాకర్, గ్రామ సర్పంచు కిషన్ నాయక్, ఎంపిటీసి లతశ్రీనివాస్, పీఏసీఎస్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపిటీసిలు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బడుగు సత్యనారాయణ, సీనియర్ నాయకులు రజనీష్,అశోక్, కృష్ణ, శేఖర్, కాశీనాథ్ రావు, నగేష్, విడిసి సభ్యులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News