బీజేపీకి ప్రత్యామ్నాయం ఎవరు ? కొంతకాలంగా ఢిల్లీ రాజకీయవర్గాల్లో ఈ ప్రశ్న వినిపిస్తూనే ఉంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఇదే ప్రశ్న మరింత బలంగా వినిపిస్తోంది. ఈ సందర్భంగా అనేక పేర్లు తెరమీదకు వస్తున్నాయి. వీరిలో నితీశ్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ పేర్లతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీకి ప్రత్యామ్నాయం తానేనంటూ మందుకు వస్తోంది.
కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఓటమితో ఎన్డీయేతర ప్రతిపక్షాల్లో జోష్ పెరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ జనాకర్షణకు తగ్గి కొంతకాలంగా మౌనంగా ఉంటున్న ప్రతిపక్షాలు కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత స్వరం పెంచాయి. చీలికలు పేలికలుగా ఉన్న తాము ఒక తాటిపైకి వస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గద్దె దించడం పెద్ద కష్టమేమీ కాదని డిసైడ్ అయ్యాయి. అంతేకాదు తరచుగా సమావేశాలు కావాలని కూడా నిర్ణయించుకున్నాయి. ఈనేపథ్యంలో జూన్ 23న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు సమావేశం కాబోతున్నాయి. పాట్నాలో జరగబోయే ప్రతిపక్షాల సమావేశానికి జేడీ యు అగ్రనేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చొరవ తీసుకున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా భావసారూప్యతగల పార్టీలతో ఒక వేదికను ఏర్పాటు చేయడానికి బీహార్ ముఖ్యమంత్రి, జేడీ – యూ అగ్రనేత నితీశ్ కుమార్ ముందుకొచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించేయడానికి కాంగ్రెస్ ఒక్కటే సరిపోదని నితీశ్ కుమార్ తెగేసి చెప్పారు. కాంగ్రెస్, మిగతా ప్రతిపక్ష పార్టీలు ఒక తాటిపైకి వస్తేనే, బీజేపీ ముక్త్ భారత్ సాధ్యమవుతుందని స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధిపై ఎంపీగా అనర్హత వేటు వేసిన దగ్గర్నుంచి ఎన్డీయేతర ప్రతిపక్ష పార్టీలను ఒకతాటిపైకి తీసుకురావడానికి నితీశ్ కుమార్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో ఆయన పర్యటిస్తున్నారు. అక్కడి నేతలతో మంతనాలు జరుపుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ప్రతిపక్షాలను ఒక వేదిక మీదకు తీసుకువచ్చే పనిలో పడ్డారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షాలను ఏకం చేసే బాధ్యతను నితీశ్ నెత్తికెత్తుకున్నారు.
ఆధునిక పోకడలున్న నేతగా నితీశ్ కుమార్‌కు గుర్తింపు
వర్తమాన భారత రాజకీయాల్లో నితీశ్ కుమార్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. బీహార్ రాజకీయాల్లో నితీశ్ కుమార్‌ను ఆధునిక పోకడలున్న నాయకుడిగా పేర్కొంటారు రాజకీయ పరిశీలకులు. వ్యూహాలు, ఎత్తుగడల్లో కూడా నితీశ్ కుమార్ గట్టి పిండమే. కొన్ని నెలల కిందట వెనుకబడిన తరగతుల జనాభాను లెక్కించాలన్న సంచలన నిర్ణయం తీసుకుంది నితీశ్ కుమార్ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా బీసీ జనాభాను లెక్కించే విషయంలో బీజేపీలోని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిన నేపథ్యంలో బీసీ జనగణనకు సై అన్నాడు నితీశ్ కుమార్. నితీశ్ కుమార్‌కు ముఖ్యమంత్రిగా మంచి పేరుంది. రాష్ట్రీయ జనతా దళ్ జంగిల్ రాజ్ తో విసిగి పోయిన బీహార్ ప్రజలు ఆయనను వికాస్ పురుష్ అంటూ ఒక దశలో నెత్తిన పెట్టుకున్నారు. ఆర్జేడీ , బీజేపీతో పొత్తుల విషయం ఎలా ఉన్నా, పరిపాలనలో నితీశ్ కు మంచి మార్కులే పడ్డాయి. దేశ రాజకీయాల్లో ఒక దశలో ప్రధాని నరేంద్ర మోడీకి దీటైన ప్రత్యర్థి నితీశ్ కుమారే అనే ప్రచారం కూడా నడిచింది.
భిన్నమైన రాజకీయాలు కేజ్రీవాల్ స్వంతం
ఆధునిక భారత రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్‌ది ఒక ప్రత్యేక స్థానం. 2012లో అవినీతిరహిత రాజకీయాలే సిద్ధాంతాలుగా కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు. కేజ్రీవాల్ పార్టీ పెట్టినప్పుడు చాలా మంది పెదవి విరిచారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కువ కాలం మనుగడ సాగించదని జోస్యాలు చెప్పారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జాతీయ రాజకీయాల్లో ఆప్ నిలదొక్కుకుంది. ఢిల్లీతో పాటు పంజాబ్‌లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఈ ఘనత నిస్సందేహంగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌దే. బీజేపీ ఎత్తుగడలను, వ్యూహాలను తట్టుకుంటూ రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు కేజ్రీవాల్. ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మాను తట్టుకుని ఢిల్లీకి మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు… ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్య విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదళ్ చతికిలపడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండో రాష్ట్రంగా పంజాబ్ చరిత్రలో నిలిచింది. ఆమ్ ఆద్మీపార్టీకి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జాతీయ పార్టీగా గుర్తింపు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. పార్టీని స్థాపించిన 10 ఏళ్లలోనే ఈ ఘనత సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీ. తక్కువ సమయంలో జాతీయ గుర్తింపు పొందిన పార్టీల్లో ఒకటిగా కూడా ఆప్ ఘనత సాధించింది. తాజాగా ఢిల్లీ ఆర్డినెన్స్‌తో కేజ్రీవాల్ మరోసారి తెరమీదకు వచ్చారు. ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడానికి దేశవ్యాప్తంగా కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల మద్దతు కూడగడుతున్న కేజ్రీవాల్ కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు. ఎక్కడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేదా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌తో సమావేశమై ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు అడిగిన దాఖలాలు లేవంటున్నారు రాజకీయ పండితులు. దీంతో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని కేజ్రీవాల్ ఆమోదించడం లేదన్న విషయం స్పష్టమవుతోందన్నారు రాజకీయ విశ్లేషకులు.
మమతా బెనర్జీ రాజకీయాల్లో ఓ ఫైర్‌బ్రాండ్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ఒక భిన్నమైన రాజకీయవేత్త. సింపుల్ చెప్పాలంటే మమత ఒక ఫైర్ బ్రాండ్. బీజేపీ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ మూడోసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నాయకురాలు ఆమె. అయితే చాలాకాలంగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు మమతా బెనర్జీ. ఈమమతా బెనర్జీ మొదట్నుంచీ బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పుతూనే ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాల కిందట కూటమి కట్టడానికి మమతా బెనర్జీ తీవ్ర ప్రయత్నాలు చేశారు.
2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే బీజేపీయేతర పార్టీల కూటమిలో కీలక పాత్ర పోషించడానికి మమతా బెనర్జీ ప్రయత్నించారు. కోల్‌కతాలో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించారు. .అయితే రకరకాల కారణాల వల్ల మమత ప్లాన్ వర్క్ అవుట్ కాలేదు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో ప్రాంతీయ పార్టీల అధినేతలందరూ కొత్త రాజకీయ కూటమి ఏర్పాటు సంగతిని పక్కన పెట్టారు. అయితే బీజేపీకి ఎంత దూరమో కాంగ్రెస్‌తోనూ అంతే దూరం మెయింటైన్ చేశారు మమతా బెనర్జీ. ఒక దశలో అసలు యూపీఏ కూటమి మనుగడలో ఉందా అంటూ కాంగ్రెస్‌ను కించపరిచే వ్యాఖ్యలు కూడా చేశారు మమతా బెనర్జీ.
బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేనా ?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధిపై కొన్ని నెలల కిందట వేసిన అనర్హత వేటు దేశంలో దుమారం రేపింది. అనర్హత రగడలో రాహుల్‌కు దాదాపుగా ప్రతిపక్షాలన్నీ అండగా నిలబడ్డాయి. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ జాతీయస్థాయిలో ప్రతిపక్షంగా ఉంది.ఇక్కడో విషయం గమనించాలి. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో ఈ ప్రాంతీయ పార్టీలు ఢీ కొంటున్నాయి. తెలంగాణ రాష్ట్రమే ఇందుకు ఉదాహరణ. తెలంగాణలో అటు బీజేపీతోనూ ఇటు కాంగ్రెస్‌తోనూ భారత్ రాష్ట్ర సమితి రాజకీయ సమరం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ అనర్హత వేటు అంశం ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తీసుకువస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనర్హత రగడ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఈ ఏడాది మార్చి 27న నల్లదుస్తులు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించింది.ఈ నిరసన ప్రదర్శనలో 17 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి.అయితే ఎన్ని లోటుపాట్లు ఉన్నా దేశవ్యాప్తంగా దాదాపు 200 లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైన ఓట్‌బ్యాంక్ ఉంది. ఇప్పటికీ ఇందిరను అభిమానించే ప్రజలు కాంగ్రెస్ వెంట ఉన్నారు. బ్యాంకుల జాతీయకరణ లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్న ఇందిర పాలనను అభిమానించే జనం కాంగ్రెస్ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు.
మొత్తంమ్మీద భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం ఎవరన్న సంక్లిష్ట ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.
- ఎస్. అబ్దుల్ ఖాలిక్ 63001 74320 సీనియర్ జర్నలిస్ట్