Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Pothi a Telugu novel: మలిదశ తెలంగాణ ఉద్యమ నవల 'పొత్తి'

Pothi a Telugu novel: మలిదశ తెలంగాణ ఉద్యమ నవల ‘పొత్తి’

Novella అనే ఇటాలియన్‌ పదం నుండి వచ్చిన novel అనే ఆంగ్ల పదం, నవల అనే తెలుగు పదంగా స్థిరపడింది. Novel -‘mens a fictional prose work with a relatively long and often Complex plot, usually divided into chapters in which the story traditionally develops through the thoughts and actions of its characters’. భావం బొమ్మగా మారాలంటే అది మస్తిష్కం అనే కొలిమిలో కాగి, సాగి బయటకు రావాలని సందులు, గొం దులు తిరిగి ప్రధాన దారికి చేరుకోవాలి, అనేది రాచపాలెం వారి అభిప్రాయం. తెలుగు నవల అనేక పార్శ్వాలను ప్రతి ఫలిస్తూ కొనసాగుతూ వస్తుంది కల్పిత పాత్రలు, జీవిత చరిత్రలు, సంఘటనల ఆధారంగా పాఠకులను ఆకట్టు కున్న నవలలే అధికం. నిజానికి నవల సామాన్యుని వలె నిరాడంబరమైనది, జీవితం వలే సత్యమైంది. ప్రకృతివలె సుందరమైనది. ఆకాశం వలె విశాలమైంది. సూర్యునివలె తేజోవంతమైనది. వాయువు వలే సర్వస్వమైనది. ‘ అని దాశరధి రంగాచార్య గారి అభిప్రాయం..
నవలా ప్రక్రియ అనేది చాలా విస్తృతమైనది అది కథ లను కవిత్వాలను సన్నివేశాలను సంఘటనలను అనుభవా లను జీవన విధానాలను అక్షరీకరించిన ఒక చారిత్రక విష యాలను నిక్షిప్తం చేస్తుంది. అందుకే పాశ్చాత్య నవలా రచయిత సోమర్‌ సెట్‌ మామ్‌ ‘నవలలో వ్యక్తమయ్యే జీవిత సత్యాలు, వాస్తవ జీవితంలోని వాస్తవాల కంటే ఉన్నతమై నవి.’ అని అంటాడు. నవల సమాజ గమనాన్ని చిత్రి స్తుంది. ఎందుకంటే అది కల్పితమైనప్పటికీ, నిజ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. తెలంగాణలో నవలా రచనలో వస్తు వు ఎన్నికకు కొదవలేదు. అదే ప్రాంతం లోని ఉద్యమాల ఖిల్లా నల్లగొండ చెందిన రచయిత నర్రా ప్రవీణ్‌ రెడ్డి కూడా ప్రస్తుత నవల ‘పొత్తి’ తెలంగాణ సమాజ జీవనాన్ని ప్రతి బింబించే విధంగా రాశాడని చెప్పడం సమంజసం. మాండలికంతో కూడిన సంభాషలు,వృత్తి జీవనం, ఉద్యమ నేపథ్యం, పల్లెల జీవన చిత్రణ, జీవకారుణ్యం కల గలిసిన జంతు ప్రేమ, మానవ సంబంధాలు, ప్రేమికుల మనసులు, అన్నీ మిళితమై మొత్తంగా సృజనాత్మకతతో కూడిన ఒక అద్భుతమైన నవలను మనం మలిదశ తెలం గాణ ఉద్యమం నేపథ్యంలో, ఉస్మానియా యూనివర్సిటీ పోరాటపటిమను గుర్తుచేసుకుంటూ చదవచ్చు. రజాకార్ల అనంతరం తెలంగాణ ప్రాంత తొలినాళ్ళలో ఉన్న ప్రజల జీవన విధానం, ఇప్పుడే ఎదుగుతున్న దళిత బహుజన రెండవ తరం ఆలోచనలను మనం దగ్గరగా చూడవచ్చు.
జీవకారుణ్యం -జంతు ప్రేమ
నవల మొదలవగానే యాదమ్మ బోరు నేడ్చుకుంట గట్ల పొంటి పరిగెత్తుకుంటూ పోతుంది. పాఠకుడు పరిపరి విధాలుగా ఆలోచించే సందర్భం అది. ఆలోచనలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టి, రచయిత వెంటనే తనతోపాటు పుట్టింటి నుండి వచ్చిన బర్రె ముద్దుపేరు బంగారంఅని పాఠకుణ్ణి నిమ్మలం చేస్తాడు. బంగారమును ఎవరైనా కొట్టినా తిట్టినా ప్రాణం పోయినంత పని అవుతుంది, యాదమ్మకు. అందుకే అవ తలి వాళ్ళు ఎంత పెద్దవారైనా కడిగేయాల్సిందే. ప్రస్తుతం మనం సినిమాలలో ప్రేయసిని, ప్రియుడు బంగారం ఏం చేస్తున్నావ్‌ ? అని ఫోన్‌ లో పలకరించడం చూస్తున్నాము. కానీ తనతోపాటు పుట్టింటి నుంచి వచ్చిన ఒక బర్రెకు బం గారం అనే ముద్దు పేరు పెట్టి పాఠకున్ని ఆశ్చర్యానికి లోను చేశాడు రచయిత.
బంగారంకు స్నానం చేయించడం, కుడితి తాపడం, మేత వెయ్యడం దగ్గర్నుండి చివరకు అది ఈనే సమయం వరకు యాదమ్మ తీసుకున్న శ్రద్ధ, జంతు ప్రేమ ఎంత గొప్పదో మనకి తెలియ జేస్తుంది . దీనిలో రచయిత హృద యం పాఠకునికి కనిపిస్తుంది. చిన్నపిల్లలను పిలిచినట్టుగా, ఒక బర్రెను, బంగారం అని పిలవడం రచయిత జీవకారు ణ్యానికి అద్దం పడుతుంది. బర్రె హుషారు ఉండకపోవడం తో సూదిమందు వేయించడానికి పోయినప్పుడు నిమ్మలం సారు నిమ్మలంగా వేయండి అని సూది వేస్తుంటే తన ప్రా ణం జివ్వుమని, మస్తు భయపడ్డది యాదమ్మ.
తెల్ల తీగలను ఇడుస్తుంది బంగారం. నడుము మీద చేతులు పెట్టుకుని ఊపిరి బిగపట్టుకొని చూస్తుంది యాద మ్మ. ఆ తర్వాత మాయి పడలేదని యాదమ్మ ఒకటే బాధ పడుతుంది . ఆ బాధ కాసేపటికి దుఃఖం అయింది ఇంకా సేపటికి పెద్ద ఏడుపు అయింది. బంగారంకు ఏమన్నా అవుతుందేమో అనే భయంతో.. పెనిమిటిని అల్లుకొని పెద్దగా ఏడుస్తుంది యాదమ్మ.
నిజంగా ఇది కంటతడి పెట్టించే సన్నివేశం. ఒక బర్రె ఈనడం అనేది సహజం, అన్న విషయాన్ని పాఠకుడు మరి చిపోయి, యాదమ్మ పాత్రలోకి వెళ్ళిపోయి, నిజమే బంగా రంకు ఏం కావద్దని ప్రార్థించడం మొదలుపెడతాడు. అది నిజంగా రచయిత పాఠకుడి మనసును జయించిన తరుణం. ప్రవీణ్‌ రెడ్డి గ్రామంలో గల్లి, గల్లి తిరిగి ఉండటం, వ్యవసాయ కుటుంబం నుండి రావడం అనేది, జంతువు లను, గ్రామీణులు ఎంత ప్రేమగా చూసుకుంటారో, తెలిసి ఉండటం వలన మనుషులకు, జంతువులకు మధ్య ప్రేమ బంధాన్ని గుండెలోతుల వరకు తీసుకెళ్ళాడు. ఈ సన్ని వేశంను చదివినప్పుడు ప్రముఖ మలయాళ అభ్యుదయ రచయిత పొన్‌ కున్నం వర్కెయ్‌ సృష్టించిన ఎద్దు కన్నన్‌ గుర్తురాక మానదు.
భూమాయ -ఫైనాన్స్‌ మోసాలు
ప్రతి మనిషికి భూమి తమ తాత ముత్తాతల నుండి వచ్చిందో, తాము సంపాదించిందో ఉంటుంది. ఇక్కడ కూడా సోమిరెడ్డి, మల్లారెడ్డిలకు వారసత్వంగా వచ్చిన భూమి చెరో ఐదెకరాలు ఉన్నది. దీనిని కలిసి వ్యవసాయం చేసుకుంటారు. నవలలో సోమిరెడ్డి ప్రస్తావన వచ్చిన ప్రతి సారీ భూమి అమ్మకం గురించి ఉంటుంది. నువ్వు గెట్లు పాతుదా మంటే ఇనవ్‌. భూములు అమ్ముకోనియ్యవ్‌ ఊ రు ఊరు అని సస్తవ్‌. అయినా నీ పసులు నాదాంట్లో కెట్లా వస్తయ్‌ అంటూ మల్లారెడ్డి నీ తన్నుడు, గుద్దుడు, ఇయ్యర మయ్యర చేసిండు తమ్ముడు సోమిరెడ్డి.
గ్రామాలలో అన్నదమ్ముల అనుబంధాలు పాలోల్ల పంతాలు గా ఎట్లా మారుతాయి, దాని వల్ల గొడవలు వచ్చి కొట్టుకోవడం, నేటికీ తెలంగాణ పల్లెల్లో జరుగుతూనే ఉన్నాయి. దానిని చూపడంలో రచయిత సఫలీకృతం అయ్యాడని చెప్పవచ్చు. నూటికి రెండు లెక్కన కమిషన్‌ తీసుకుని పుల్లారెడ్డి ఊర్లో పెద్దరికం, చేస్తూ ఎవరి మాట వాళ్లకు చెప్పి, అమాయకులను మోసం చేసే బ్యాచ్‌ అన్న మాట…. భూమిని అమ్మే సమయంలో శంకర్‌ తన బాబా య్‌కి ఒద్దని చెప్తే అమ్మకేం చేస్తాం అప్పులోల్లు పీకుతు న్నారు. ఎన్ని బోర్లేస్తే ఏం లాభం? గంటెడు నీళ్లు రావాయే. అని సోమిరెడ్డి చెప్పే మాటలు తెలంగాణ పల్లెల్లో బోర్లు వేసి, నీళ్లు పడక, భూములు అమ్ముకున్న పరిస్థితిని తెలియ జేస్తుంది. దీనికి తోడు రచయిత చెప్పిన మాటలు, ప్రతీకలు మనసుకు బాధను కలిగిస్తాయి. కండువా భుజంపై సరి చేసుకుంటూ ఒంగి వేలిముద్ర లేస్తున్న రైతులను చూస్తుం టే, పొట్ట కొచ్చిన వరికంకులు ఒంచి నేలపై సంతకాలను చేస్తున్నట్టు ఉంది.
‘భూముల ఆత్మలన్నీ రిజిస్టార్‌ భవనంలో బందీ అయి నవి’. తట్రాయి కాలికి తగిలి బాధించిన సందర్భం అనం తరం యాదికి వస్తుంది. సోమిరెడ్డికి మాయమాటలు చెప్పి తను అమ్ముకున్న భూమి పైసలు ఫైనాన్స్‌ లో పెట్టించిన పుల్లారెడ్డి. అది కాస్త మోసమని, ఫైనాన్స్‌ వాళ్ళు జెండా ఎత్తేస్తరనీ తెలియని సోమిరెడ్డి భూమిని, డబ్బులను పోగొ ట్టుకొని పట్నం బాట పట్టిండు. ఈ సన్నివేశం నిజంగానే కడుపులో చేయిపెట్టి దేవినట్టు, మనసులో విరిగిన ముళ్ళు ను తీస్తుంటే కలుక్కు కలుక్కు మని పాఠకుని మనసుని గాయం చేస్తుంది. అది నిజమే అని అంగీకరించక తప్పదు.
చాలా రోజులనుంచి ఇంటికి వెళ్లని శంకర్‌ ఊరికని బయలుదేరి, బస్టాండలో రెండు కాళ్ళపై కూర్చుని కూలి కని ఎదురు చూస్తున్న తన కక్కయ్య సోమిరెడ్డిని చూసిం డు. కళ్ళల్లో నీళ్ళు తీసుకొని, దగ్గరికి వెళ్లి ఈడ కూసున్న వేంది కక్కయ్యా అని అడిగిండు.. ఊళ్ళో మీ నాయన ను వ్వు ఎంత చెప్పినా విన నైతిని. అడ్డికి పావుశేరు లెక్కన కొన్నడు రంగారావు గాడు. వచ్చిన పైసలు అన్ని పుల్లారెడ్డి గాడు ఫైనాన్స్‌లో పెట్టిచ్చిండు, ఫైనాన్స్‌ వోడు జెండా ఎత్తిం డు రా…మోసపోయిన బిడ్డా అని శంకర్‌ ని పట్టుకుని ఏడు స్తనే ఉన్నడు. సోమిరెడ్డి శంకర్‌ నాన్న మల్లారెడ్డి కొట్టిండు భూమి అనే విషయంలో అయినా పట్నంలో కూలి అడ్డ మీద కనపడిన శంకర్‌ ను పట్టుకుని తనివితీరా ఏడ్సిండు సోమిరెడ్డి…. రక్తసంబంధం, ప్రేమానురాగాలు, మొదలై నవి మనస్పర్థల వల్ల, వ్యక్తిగత కష్టాల వల్ల, పోగొట్టుకో వొద్దని రచయిత చెప్పాడు. అందుకే ఊరి పొలిమేర దాటిన బతుకులు, మనుషుల విలువలు నేర్చుకున్నాయి. వెనుకకు తిరిగి చూస్తే మళ్ళీ ఊరే శరణం టు దీవిస్తుంది. కన్న పేగు కదా మరి అని రచయిత సందర్భాను సారంగా చెప్పడం భూమి, గ్రామంపై పాఠకునికి ప్రేమను పెంచుతుంది.
ప్రేమ కథ – పాత్ర చిత్రణ
ఆమె ముఖము చంద్రబింబం వలె అందంగా ఉన్నది‘ అని మాత్రమే మనం ఇన్నిరోజులు చదువుకున్నాం . దొండపండులాంటి పెదాలను గుడ్లప్పగించి చూసి మరీ చదివినం. రచయిత గంగ పాత్ర చిత్రణలో ‘నిండు బతు కమ్మ’ లాంటి ముఖము, అనే ఉపమానం తో పరిచయం చేసాడు. ఇక్కడ ఇసుమంత హద్దులు దాటని తనంతో ప్రకృ తి ప్రేమికుడిగా మనకు కనిపిస్తాడు నర్రా. తాము సృష్టించే పాత్రలో తన ఆత్మ గౌరవ ప్రతీకలు ఉంటాయని చెప్పకనే చెప్పాడు రచయిత. గడ్డి చేమంతుల మీద తుమ్మిశ్కలు తిరు గుతున్నాయి’. గంగ, శంకర్‌ను కలిసేందుకు వెళ్లిన సమ యంలో రచయిత చేసిన సహజ వర్ణన. పూల చుట్టూ తేనె టీగలు, తుమ్మిష్కలు తిరిగి దానిలోని మకరందాన్ని ఆస్వా దిస్తయని, వీరు కూడా తమ ప్రేమను పండిస్తారు అని రచయిత పాఠకుని మదిని తట్టాడు అనిపిస్తుంది.
శంకర్‌ కళ్లను కాపీష్కలతో పోల్చడం అనేది ఒక అద్భు త వర్ణన. ఎప్పుడో అమ్మ గోలెంల పట్టిన పాకురు ను కాపి శ్కతో శుభ్రం చేసి బిందెలతో నీళ్ళు పోసిన జ్ఞాపకం లోకి వెళ్లి పోవడం ఖాయం అనిపిస్తుంది. రేగ్గంపను తొలగించే గంగను చూస్తే పల్లెపల్లెనా తొలగిస్తున్నట్టు అనిపిస్తుంది. అనే వాక్యం ఇక్కడ రచయిత మనకు ఒక సంస్కరణ వాది గా సమాజమును కోరుకునే వ్యక్తిగా కనిపిస్తాడు.
తాటి పండు కాల్చి శంకర్‌కు ఇగో అని ఇస్తుంది గంగ. తెలంగాణలో ఇగో అంటే తీసుకో, ఇగబటు అని అర్థం. ఆంగ్లంలో ఇగో ను బ్రాకెట్‌ లో పెట్టిన రచయిత నా, నేను, అహం, ను కూడ లేకుండా వదిలేసే తత్వాన్ని కలిగి ఉండాలని చెప్పినట్టు భావించి ఉండొచ్చు అని పిస్తోంది. (Ego=an exaggerated sense of one’s own importance and feeling of superiority to other people).
బాయికి ఏలాడవడ్డ పచ్చటి గూట్ల నుండి మంగలి గిజిగాడు మొఖం బయటకు పెట్టి ఇచిత్రం గా చూస్తుండు. వారి శేను యవ్వన్నాన్నంత ఒలికిస్తుంది. చల్లని గాలులను తోల్తుంది. బాయి గడ్డ మీద ఉన్న అల్లనేరేడు చెట్టు మీద రెండు గోరింకలు కువకువ లాడుతున్నయ్‌. మడి కట్టుకు సేనానినప్పుడల్లా మడి ఒళ్ళు ఝల్లుమంది. గా మొన్ననే ఈన్నే మేకపిల్లలు కొట్టంల శింగడ, బింగడ ఎగురు తున్నాయి. కుంకుమ అసొంటి మట్టిల పాతిన తాటి గింజలు రేపటి గేగుల్ల కు సిద్ధమవుతున్నయ్‌.. పై వర్ణన అంతాకూడ ప్రేమ విత్తనాలు మొలకెత్తుతున్నవని మనస్సు ఆహ్లాదంగా ఆనందంగా ఒక కొత్త అనుభూతిని పొందు తుందని ప్రేమ చిహ్నాలుగా ఉన్న ప్రకృతి వర్ణన జరిగింది. ఇది రచయితకున్న అదనపు అర్హతగా పాఠకుడు లోతుగా ఆలోచించే తత్వాన్ని నేర్చుకుంటాడు. ఇలాంటి వర్ణనలు మనకు ఈ నవలలో ఎన్నో దొరుకుతాయి.
బెంజ్‌ కార్‌ స్పీడ తో కొట్టుకుంటున్న రెండు గుండెలు ఒక చోటికి చేరినయ్‌. గంగ శంకర్‌ కాళ్ళ మీదే తలవంచు కుని పడుకుంది హాస్పిటల్లో …‘నువ్వు వెలిగే సూర్యుడు ఈ వెలిగే సూర్యుడి కోసం కరిగే వెన్నెల అవ్వడానికి నేను ఎప్పుడూ సిద్దమే’ ఇలాంటి ప్రతీకలు నవల ఆసాంతం మనకు ప్రతి పుట లో కనిపిస్తూనే ఉంటాయి పాఠకుడు తనకు నచ్చిన రీతిలో ఆపాదించుకోవడం తరువాయి.
శంకర్‌ తల్లిదండ్రులు ప్రేమను అంగీకరించనప్పుడు ఉట్టిలున్న పాలటికెను ఎగిరి తన్న నీకి పిల్లోకటే తనుకులా డుతుంది. వాక్యాన్వయం సరిగ్గా సరిపోయింది. గంగ ప్రేమ విషయం చెప్పినప్పుడు యాదమ్మ లంజముండ అనే పదం ఉపయోగించడం జరిగింది. ఇది కోపం వచ్చిన ప్పుడు వాడే పదమే తప్ప గంగ వ్యక్తిత్వానికి రచయిత ఆపా దించలేదనే విషయం ప్రతి పాఠకుడు గమనించాల్సిన విషయం..
మల్లారెడ్డి కి పొలంలో దెబ్బ తగిలి, రక్తం కారిపోయి స్పృహ తప్పినప్పుడు, తన రక్తం ఇచ్చి బ్రతికించిన వీరయ్య ను చూసి, కులం కన్నా గుణం గొప్పది అనే విషయమును గమనించి ‘ఈ నాటి నుంచే ఈ ఇసపు కంచెల్ని తొలగి ద్దాం. శంకర్‌ … గంగమ్మ ఇక నుంచి మా ఇంటి కోడలు ఏమంటావు వీరయ్య’ అనడంతో, శంకర్‌- గంగల ప్రేమ కుల కంపల్ని నరికేసి వేసినట్లయింది.
పొత్తి నవలలోని మలిదశ తెలంగాణ ఉద్యమ సన్నివేశాలు
పట్నంలో ఉస్మానియా యూనివర్సిటీ లో పీజీ రెండో ఏడాది నడుస్తున్నది శంకర్‌ది, అని చెప్పిన రచయిత ఆ వెంటనే పొయ్యిమీద బువ్వ ఉమ్మగిల్లుతుంది అన్నడు. ఈ చదువు అయిపోవడానికి వచ్చింది, అనే విషయాన్ని బువ్వ కూడా ఉడి కింది, దించడానికి రెడీగా ఉందని ప్రతీకగా ఆలోచనగా ఉంది. ఇలాంటి సన్నివేశాల వాక్యాల గొప్పత నంతోనే నవల పాఠకుని మదిని గెలిచిందని చెప్పవచ్చు.
యూనివర్సిటీ ని పరిచయం చేసినప్పుడే రచయిత తెల్ల పావురాలు శాంతిని ఆ ప్రాంతానికి ఎప్పటికప్పుడు చేరవేస్తూనే ఉన్నాయి అన్నాడు. ఆ విశ్వవిద్యాలయం శాంతిని కోరుకునే విద్యార్థులందరూ తమ ఆశయాల సాధన కోసం శాంతియుతం గా పోరాటం చేస్తారని చెప్పాడు . శ్రీకాంత్‌కు జోహార్లు అర్పించడం ఇంకెవరు ఆత్మ హత్యలకు పాల్పడవద్దని చెప్పినప్పుడు, శాంతియుత వాతావర ణంలో తెలంగాణ ఉద్యమం నడుస్తోందనే భావన కలుగు తుంది. విద్యార్థులు నిద్ర లేచినప్పటినుంచి ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు, మానవహారాలు, నినాదాలు పాట లు,…. జీవితమే ఒక ఉద్యమమై బ్రతుకుతున్నారు.
రచయిత ‘ముల్కీ గోబ్యాక్‌’ ఉద్యమాన్ని, ‘పెద్దమను షుల ఒప్పందాన్ని’, ‘ఫజల్‌ అలీ కమిషన్‌’, ‘1969లో పోలీస్‌ కాల్పుల్లో చనిపోయిన సంఘటన’లను సందర్భా నుసారంగా, నాయకుల చేత చెప్పించడం వలన తొలిదశ తెలం గాణ ఉద్యమాన్ని కూడా పాఠకుని మెదడులోకి ఎక్కించే ప్రయత్నం చేశాడనీ తెలుస్తోంది.. ఇది కూడా ‘ఉద్యమ నవల అని చెప్పడానికి మనకు సరిపడా సన్నివేశాలు కనిపిస్తాయి.
తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామంలో తిరుగుబాటు మూలాలు ఉంటాయని, అవి విప్లవ వాసనలు వెదజల్లుతా యని ఎవరో ఒకరు వీటిని పుణికిపుచ్చుకొని తిరు గుబాటుకు సిద్ధమై అడవి బాట పట్టి సమసమాజాన్ని ఆయుధంతో సాధించాలని ఆలోచనలతో ఇంకా యువకులు బ్రతుకుతు న్నారు అని చెప్పడానికి రచయిత సూరి పాత్ర ను తీర్చిది ద్దాడు. మావోయిస్టు సూరి ఎన్‌కౌంటర్‌… జోగిని వ్యవస్థ పై ఎన్నో సంవత్సరాలు తిరుగుబాటు చేసి ప్రత్యేక తెలం గాణ ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రం గా ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ నేత రాత్రి పోలీసుల చేతిలో హతమయ్యాడు. అహింసతో సమాజాన్నీ మార్చలేమని సూరి తీసుకున్న నిర్ణయంతో అదే ఆయుధాలకు బలైపోయాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యా ర్థులు ఆయుధాలను ఎంచుకున్నారనే విషయాన్ని తెలం గాణ ప్రాంతంలో ఇంకా ఆలోచనలు ఉన్నాయి అని రచయిత చెప్పాడు.
ఆదర్శ భావాలున్న ‘సూరి’ ఈ సమాజానికి ఏం సందేశం ఇచ్చిండు. అన్నివే ళల్లో యుద్ధం పనికిరాదు. జీవిత మంటే గెలుపోటముల ఆట. ఈ వ్యవస్థ మనం ఎప్పుడు ఓడిపోతామా అని ఎదురు చూస్తున్నది. ఆ వ్యవస్థలో మనం ఎప్పుడూ ఓడిపోకూడదు, అనే మాటలు రచయిత సమాజంలో ఉండే ప్రతి వ్యక్తికి ఆపాదించి చెప్పినట్లు అనిపిస్తుంది. హింస అన్నింటికీ పరిష్కారం కాదని సందేశమును ఇచ్చిన ట్లయింది. శంకర్‌ విద్యార్థులందరిలో ధైర్యాన్ని నింపడం, ఆత్మన్యూనతనులోను కాకుండా ఉండడం, ఉద్య మంలో ముందు వరుసలో నడిచి, గాయాల పాలై ఆస్పత్రి లో పడడం, అనే విషయాలు ఉద్యమ నాయకుడి లక్షణాల ను వివరించినవి. తెలంగాణ ఉద్యమం ఇలాంటి నాయకు లను ఎంతోమందిని అందించినది అని చెప్పవచ్చు.
పచ్చని నవ్వు గాలిలో కనిపించకుండానే కలిసిపో యింది. మోదుగ పువ్వు నేలను ముద్దాడింది. బిక్కుబిక్కు మంటూ బరువెక్కిన గుండెతో సూర్యుడు మెల్ల మెల్ల గా పొద్దెక్కిండు… ఈ వర్ణన అంతా రవి, శంకర్‌, హరి, శేఖర్‌ అందరూ రాత్రి చర్చిం చుకుని తెల్లారేసరికి చెట్టుకు ఉరి తాడుకు వేలాడుతూ కనిపించిన రవి ని చూసి బోరున ఏడ్చిన శంకర్‌కు ….ముందు సన్నివేశాన్ని రచయిత వివ రించిన, వర్ణించిన ప్రతీకలుగా, సంఘటనలు మనసును ఆందోళనకు గురి చేసి కొద్దిసేపుఅచేతనం అయిపోయే స్థితిని కల్పిస్తాడు..
ఎంతగాలోచ్చినా చెట్టు ఉషారుగా లేదు. వైరాన్ని గెలిపించే తందుకు ఒక పావురం ఓడిపోయిందని, శాంతి కపోతాలు చావును ఆహ్వానించడం మిగతా సమాజానికీ మంచిది కాదని నిగూడార్థం… .
తెలంగాణ ఉద్యమం సఫలీకృతమై రాష్ట్రం ఏర్పడిన తరుణంలో, రచయిత మబ్బు తెరలు చీల్చుకుంటూ భానుడి భగభగలు, కోట్ల గొంతుల నినాదం ఫలిం చింది .. 29 వ రాష్ట్రంగా గెజిట్‌, .. జూన్‌ 2, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఇవ న్నీ విషయాలు ఉద్యమ ఫలితాలు గా చెప్పి సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఉద్యమాలు చేయడం ఒక ఎత్త యితే వాటిని వర్ణించడం మరొక ఎత్తు‘ తెలంగాణ లో వచ్చి న ప్రజల మనిషి, చిల్లర దేవుళ్ళు, నవల కూడా రజాకార్లు, నిజాం అకృత్యాలను కళ్ళకు కట్టినట్లుగా వర్ణించడం సత్యదూరం కాదు.
పొత్తి అనగా రచయిత చుట్టూరా గీసే గీత అని చెప్పాడు. మల్లారెడ్డితో వడ్ల రాసి చుట్టూ ఒడ్లతో చుట్టూ గీత గీయించాడు. దేశ గురువుతో ఊరు పొలిమేర చుట్టూ ఒడ్లతో పొత్తి గీయించాడు. అలా పొత్తి ని పరిపూర్ణం చేశాడని చెప్పవచ్చు.
తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. చివరకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించ బడింది. శంకర్‌ , గంగల ప్రేమ కుల కట్టుబాట్లను, అంతరాల కంచెను తొలగించి గెలిచింది. మల్లారెడ్డి మనసులో పేరుకు పోయిన కులం, పరువు అనేవి ఆసుపత్రి లో జయించబడి, శంకర్‌, గంగ ల ప్రేమ అంగీకరించబడింది. యాదమ్మ బంగారం (బర్రె) సూడిది అయ్యింది. పాఠకుణ్ణి ఒకింత టెన్షన్‌కు గురిచేసి, యాదమ్మను ఏడిపించి, ఆడదూడకు జన్మనిచ్చి ఈ కథ కూడ ప్రశాంతమయ్యింది.
పొత్తి నవలకు రచయిత (Boundary) అనే ఆంగ్ల పదంను కూడా అచ్చు వేశాడు.
‘The boundary it means The officialline that devides one area of land from another limit, the point at which something ends’
నవలా రచయిత నర్రా ప్రవీణ్‌ రెడ్డి ఆడంబర జీవి అసలే కాదు. నవల రాసిన విధానం, వస్తు ప్రదర్శనలు, చూస్తే మనం 40 నుండి 50 సంవత్సరాల వయస్సు ఉన్న చాలా అనుభవశాలి అయిన నవల రచయిత అనుకుంటాం. కానీ నూనూగు మీసాల నూతన యవ్వనమున పొత్తి నవల రచించాడని, ఉస్మానియా యూని వర్సిటీలో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో గా పరిశోధన చేస్తున్నాడని, తెలిసి ఆశ్చర్య పోవడం పాఠకుని వంతు అవుతుంది.
ఇది ఒక ఉద్యమ నవల మాత్రమే కాదు. పల్లె తనాన్ని తనువెల్లా నింపుకొని, మనసులో ఉన్న భావాలు, కథగా మారే క్రమంలో, రచయిత హృదయాంతరాల, దొంతరుల్లో, ఆలోచనా యుద్ధాన్ని ముగించుకుని, గెలిచి, నిలిచిన అక్షరసుమాల, ఆనందమయ అల్లికల కలబోత కు మరో రూపమే ఈ పొత్తి నవల.
తెలుగు నవలా చరిత్ర, తెలంగాణ, నల్లగొండ, వట్టిమర్తి, వరుసగా రచయిత మా వాడు అని ప్రతి ఒక్కరినీ కాలర్‌ ఎగరేసి సగర్వంగా తలెత్తుకుని నిలబడేలా చేస్తుందీ పొత్తి. అనడం లో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు.
కథను అక్షరాల్లోకి ఒడుపుగా అనువదించడం తెలిసిన వాడునర్రా ప్రవీణ్‌. నల్లగొండ జిల్లా నవలా సాహిత్యంలో ఒక గీటురాయి. పొత్తి పూర్తి స్థాయి ప్రేమ కథ రాయగల దిల్‌ వాలా ఇతడు. పాత్రోచిత భాష నిర్వహించడంలో విజేయుడు‘. అని అంపశయ్య నవీన్‌ డా. కూరెళ్ళ విఠలాచార్య, డా. ఎస్‌.రఘు, డా. ఏనుగు నరసింహా రెడ్డి. మొదలగు పెద్దలు రాసిన ముందు మాటలో చెప్పారు. ఇవి రచయిత సాహితీ తృష్ణను తెలియ జేస్తున్నాయి. పిడికెడు మట్టి, దోసిలి వడ్ల లో, పల్లెల కనుగుడ్లను, ఆత్మలను చూసే తనం. చలనశీల జీవనం, విప్పారిన చైతన్యం ప్రవీణ్‌ రెడ్డి సొంత మని మనం అంగీకరించి తీరాల్సిందే. అతడు చేసేదే చెప్తడు. లేదంటే ఇంకేంచెప్పడు. సున్నిత మనస్కుడు, తనతో పాటు ఉన్న వాళ్ళు అంతా గొప్పవాళ్ళు కావాలని, ఒక గొప్ప అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలనే ఆలోచనలు ఉన్న రచయిత నర్రా ప్రవీణ్‌ రెడ్డి సాహిత్యం ద్వారా ఆపని తప్పకుండా చేయాలనీ, ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణా మలి దశ ఉద్యమాన్ని, సమాజాన్ని ప్రతిబింబించిన పొత్తి‘ ఉద్యమ నవల పై సమగ్ర పరిశోధన జరగాలని కోరుకుందాం.

  • డాక్టర్‌ మెంతబోయిన సైదులు
    901910956
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News