Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Sahithi Vanam: కథన రంగంలో ఘనాపాఠి మల్లాది

Sahithi Vanam: కథన రంగంలో ఘనాపాఠి మల్లాది

సాహిత్యంలోనే కాదు, చలన చిత్ర రంగంలో కూడా ఒకప్పుడు ఆయన పేరు మార్మోగిింది

సాహిత్య రంగంలో మల్లాది రామకృష్ణ శాస్త్రి పేరు వినని వారుండరు. సాహిత్యంలోనే కాదు, చలన చిత్ర రంగంలో కూడా ఒకప్పుడు ఆయన పేరు మార్మోగిపోయింది. 1905 జూన్‌ 17న కృష్ణా జిల్లా చిట్టి గూడూరు గ్రామంలో జన్మించిన రామకృష్ణ శాస్త్రిని ఆయన సాహితీ అభిమానులు విశ్వమానవుడుగా అభివర్ణించే వారు. వసుధైక కుటుంబం అనే భావనను మనసు నిండా బలంగా నింపుకున్న మహనీయులని కూడా చెప్పేవారు. మచిలీపట్నంలో బి.ఏ వరకు చదివిన తర్వాత మద్రాసులో సంస్కృతాంధ్ర భాషలలో ఎం.ఏ పట్టా తీసుకున్నారు. యడవల్లి సుబ్బావధాన్లు వద్ద వేద విద్యను, నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి దగ్గర మహా భాష్యా న్ని, శిష్ట్లా నరసింహ శాస్త్రి దగ్గర బ్రహ్మసూత్రాలను అభ్యసించారు. నాట్యకళ, చిత్రలేఖనం, సంగీతంలో కూడా వీరికి ప్రవేశం ఉంది. ఆ తర్వాత ఆయన గుంటూరులో పాములపాటి వెంకట కృష్ణయ్య చౌదరి నడిపిన ‘దేశాభిమాని’ పత్రికలో ఉప సంపాదకుడుగా పనిచేశారు. చిన్న తనం నుంచే వీరు రాస్తూ వచ్చిన వ్యాసాలు, కథలు పత్రికల్లో అచ్చయ్యాయి. ఆయన రాసిన అనేక నాట కాలు, నవలలు ఆయనను సాహితీ రంగంలో చిరస్థాయిని చేశాయి.
ఇందులో ‘కృష్ణాతీరం’ అనే నవల అచ్చ తెలుగు నుడికారానికి పట్టం కట్టిన రచనగా తెలుగు సాహిత్య చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. తెలుగు చలన చిత్ర రంగంలో అప్పటికే ప్రసిద్ధ దర్శకుడిగా పేరున్న గూడవల్లి రామబ్రహ్మం ‘పల్నాటి యుద్ధం’ సినిమా రచనకు సంబంధించి సలహాల కోసం, సహాయం కోసం రామకృష్ణ శాస్త్రిని మద్రాసుకు తీసుకు వెళ్లారు. ఆ విధం గా 1945 మార్చి 24న మద్రాసులో అడుగుపె ట్టిన రామకృష్ణ శాస్త్రి తర్వాతి కాలంలో తెలుగు చలన చిత్ర సీమకు సరికొత్త భాషాపరమైన సొబగుల్ని మాటలు, పాటల ద్వారా పరిచయం చేసి, ఒక కొత్త ఒరవడికి నాంది పలికారు. ఆయన చాలా ఏళ్లపాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ‘ఘోస్ట్‌ రైటర్‌’గా కూడా వ్యవహరించారు. ‘చిన్న కోడలు’ చిత్రంతో ఆయన తన అజ్ఞాత వాసానికి స్వస్తి చెప్పి, తెర మీదకు వచ్చారు. ఆయన తన సొంత పేరుతో 39 చిత్రాలలో 200కు పైగా పాటలు రాశారు, మద్రాసులోని పానగల్లు పార్కులో ఓ చెట్టు కింద ఉన్న రాతి బల్ల మీద కూర్చుని, సాయంత్రం వేళల్లో విద్వత్సభలను నడిపేవారు. అక్కడ ఎన్నో విధాలైన సాహితీ చర్చలు జరిగేవి. ఆయన ఈ సభలకు హాజరైన వారికి, పార్కులో ఉన్నవారికి ఆకలైనప్పుడు, తన బ్యాగులోని హెూటల్‌ భోజనం టికెట్ల కట్టలోంచి ఒక టికెట్టును చింపి ఇచ్చేవారు. కేవలం ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టించడం కోసమే ఆయన తన చేతికి డబ్బు రాగానే ముందుగా భోజనం టికెట్లను కొనేవారు. అవసరమైన వారికి వాటిని ఇచ్చేసేవారు.
రామకృష్ణ శాస్త్రి అనేక భాషల్లో పండితుడు. ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, సాహితీవేత్త, సినీ రచయిత ఆరుద్ర ఆయనకు బాగా సన్నిహితుడు. ఆరుద్ర ఒకసారి మల్లాది వారిని ‘గురువుగారూ, మీకసలు ఎన్ని భాషలు తెలుసు?’ అని అడిగారట. ‘మీకు ఎన్ని భాషల్లో కవిత్వం చెప్పగల సాధికారత ఉందో అన్ని భాష ల్లోనూ ఈ విసనకర్రలోని ఒక్కో ఆకు మీద ఒక్కో సంతకం చేసివ్వండి’అని కూడా అడిగారట. అప్పుడు రామకృష్ణ శాస్త్రి ఒక్కో ఆకు మీద ఒక్కో భాషలో సంతకం చేస్తూపోతే, ఆ తాటాకు విసనకర్రకు రెండు వైపులా ఉన్న ఆకులన్నీ నిండిపోయాయి. ఆయన ‘కృష్ణాపత్రిక’లో చందోబద్ధమైన కవిత్వం రాసేవారు. ఆ పత్రికలోనే ‘చలువ మిరియాలు’ పేరుతో ఆయన రాసిన వ్యంగ్య వ్యాసాలకు అశేషమైన పాఠకాదరణ లభిం చింది. తన 19వ ఏటనే కథా రచన ప్రారంభించి 125 కు పైగా కథలు రాశారు. ఆయన రాసిన ‘డుమువులు’ అనే కథ 14 భారతీయ భాషల్లోకి అనువాదం అయింది. ‘అహల్యా సంక్రందనం’, ‘హంస వింశతి’య గ్రంథాలకు అమూల్యమైన పీఠికలు రాశారు. కృష్ణాతీరం కాకుండా ఆయన రాసిన తేజోమూర్తులు, క్షేత్రయ్య, గోపిదేవి, కేళీ గోపాలం, బాల, సేఫ్టీ రేజర్‌ తదితర రచ నలు సాహిత్యంలో చిరకీర్తిని సంపాదించుకున్నాయి. ఆయన రచనా రంగ పండితుడు, రచయిత, కవి, గేయ, నాటక రచయిత, తెలుగు సినీ పాటల కు సొబగులు సమకూర్చిన మహనీయుడు. కథ, కవిత, నవల, నాటకం, అనువాదం ఇలా ఏ రంగమైనా తనదైన ముద్ర వేసుకున్న మహామనీషి.

  • జి. రాజశుక
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News