Ishan Kishan: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. భారత యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ ఘన విజయం సాధించింది. మరోవైపు భారత బౌలర్లు కూడా బంగ్లాపై సత్తా చాటారు. బంగ్లాను 34 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇషాన్ కిషన్ సాధించిన డబుల్ సెంచరీ ఈ మ్యాచ్ ప్రత్యేకతగా నిలిచింది. విరాట్ కోహ్లీ సాధించిన సెంచరీ అభిమానులకు ఉత్సాహానిచ్చింది.
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇషాన్ కిషన్, శిఖర్ ధావన్ ఓపెనర్లుగా వచ్చారు. మొదట ఇద్దరూ నెమ్మదిగా ఆడేందుకు ప్రయత్నించారు. అయితే, శిఖర్ ధావన్ త్వరగానే ఔటయ్యాడు. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ సహకారంతో ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు. హాఫ్ సెంచరీ తర్వాత ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇషాన్ డబుల్ సెంచరీ సాధించాడు. 131 బంతుల్లోనే 210 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడు 125 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. ఇషాన్ ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, 10 సిక్సర్లు ఉండటం విశేషం.
మరోవైపు విరాట్ కోహ్లీ కూడా సెంచరీ సాధించాడు. ఇషాన్ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ (3), కేఎల్ రాహుల్ (8)తొందరగానే ఔటయ్యారు. విరాట్ కోహ్లీ 113 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. మొత్తంగా 8 వికెట్లు కోల్పోయిన ఇండియా 50 ఓవర్లలో 409 పరుగులు చేసింది. తర్వాత 410 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు.
ఓపెనర్లు అనాముల్ హక్ 8 పరుగులు, లిటన్ దాస్ 29 పరుగులు చేసి ఔటవ్వగా, తర్వాత షకీబ్ అల్ హసన్ 43 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా పరుగులు చేయకుండానే ఔటయ్యారు. దీంతో బంగ్లాదేశ్ 34 ఓవర్లలో 182 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు, ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తీయగా మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. దీంతో ఇండియా 227 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇషాన్ కిషన్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. మూడు వన్డేల సిరీస్‌లో ఇండియా 2–1తో సిరీస్ కోల్పోయింది.