బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను తీరం దాటి వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాలతో పాటు, రాయలసీమ, కోస్తాంధ్ర లోని పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాలతో పాటు కర్నూల్, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలు, చిత్తూరు, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక భారీ వర్షాల ధాటికి తిరుమల కొండపై ఓ భారీ వృక్షం కూలిపోయి భక్తురాలికి గాయాలయ్యాయి. శ్రీవారి మెట్టుమార్గంలో భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో.. ఆ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో, టీటీడీ అప్రమత్తం అయింది. కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో భక్తుల రాకపోకలను నిలిపివేసింది. పాపనాశనం, శిలాతోరణం మార్గాలను సైతం మూసివేసింది. తిరుమలలోని అన్ని జలాశయాల్లో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరింది.
కృష్ణ, బాపట్ల, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కుండపోత వర్షాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రేపటి వరకూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీవర్షాల ధాటికి.. ఇప్పటికే చేతికి అందివచ్చిన పంట నీటమునిగిందంటూ రైతులు వాపోతున్నారు. పలు ప్రాంతాల్లో కోత కోసి ఉంచిన పంట నీటమునగడంతో.. రైతన్న కంటతడి పెట్టుకుంటున్నాడు.