‘ఉద్యమ నేత..సంక్షేమ ప్రదాత’ పుస్తకావిష్కరణ హైదరాబాద్ లో ఘనంగా సాగింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సాంస్కృతిక సలహాదారు రమణాచారి ఉద్యమ నేత..సంక్షేమ ప్రదాత పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలుగుప్రభ దినపత్రిక ఈ పుస్తకాన్ని ప్రచురించింది. తెలంగాణ సర్కార్ సంక్షేమ పథకాలపై గ్రౌండ్ రిపోర్ట్ తో కూడిన ఉద్యమ నేత..సంక్షేమ ప్రదాత పుస్తకాన్ని ప్రముఖ సంపాదకులు జి. రాజశుక రచించారు. ‘తెలంగాణే కేసీఆర్..కేసీఆరే తెలంగాణ’ అంటూ కేసీఆర్ సంక్షేమ పథకాలపై లోతైన సమాచారాన్ని సమగ్రంగా అందించే ప్రయత్నం చేశారు రచయిత రాజశుక.
బతుకమ్మ చీరల పంపిణీ, అమరవీరుల స్థూపం-అంబేద్కర్ విగ్రహ నిర్మాణం, చేప పిల్లల పంపిణీ, హరిత హారం, కేసీఆర్ కిట్, ఒంటరి మహిళలకు పెన్షన్లు, చేనేత కార్మికులకు చేయూత, షాదీముబారక్-కళ్యాణ లక్ష్మి, ఆపన్న హస్తం, రైతుబంధు ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యులుగా సీఎం కేసీఆర్ అరుదైన చరిత్రను సొంతంచేసుకున్న తీరును పుస్తకంలో చక్కగా ఉదాహరణలతో సహా వివరించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమబాటతో సబ్బండ వర్గాలు సంతోషంగా సొంత రాష్ట్రంలో సంతృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇదే విషయాన్ని కేసీఆర్ సంక్షేమ పథకాల లబ్దిదారులంతా ముక్తకంఠంతో వివరిస్తుండటాన్ని కళ్లకు కట్టినట్టు ఈ పుస్తకంలో వివరించినట్టు రమణాచారి అభిప్రాయపడ్డారు.