YS Sharmila : వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. లోబీపీ, బలహీనత వల్ల ఆమెను ఆస్పత్రిలో చేర్పించినట్లు చెప్పారు. షర్మిలకు డీహైడ్రేషన్, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్, తీవ్రమైన ఒలిగురియా, అధిక అయాన్ గ్యాప్ మెటబాలిక్ అసిడోసిస్, ప్రీ-రీనల్ అజోటెమియా కూడా ఉన్నాయన్నారు. ఆమెను ఈరోజు లేదా రేపు ఉదయం డిశ్చార్జి చేసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. రెండు నుంచి మూడు వారాలు ఆమె పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్టీపీ కార్యాలయంలో షర్మిల రెండు రోజుల నుంచి ఆమరణ దీక్ష చేపట్టారు. పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆరోపించారు. పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు తన దీక్షను విరమించబోనని చెప్పారు.
రెండు రోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. మంచినీరు కూడా తాగకపోవడంతో కిడ్నీలకు ప్రమాదం ఏర్పడవచ్చునని వైద్యులు తెలిపారు. దీంతో శనివారం అర్థరాత్రి ఒంటి గంట తరువాత పోలీసులు లోటస్‌పాండ్ కు చేరుకున్నారు. బలవంతంగా షర్మిలను అదుపులోకి తీసుకుని అపోలో ఆస్పత్రికి తరలించారు.