Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Ayesha Meera: సత్య శోధన

Ayesha Meera: సత్య శోధన

భారత రాజ్యాంగ స్పూర్తి ఎంత ఉన్నతమైనదో ఈ కేసుపై తీర్పుతో మనకు స్పష్టమౌతుంది

అయేషా మీరా కేసులో జస్టిస్‌ సి.వి. నాగార్జున రెడ్డి, ఎం. ఎస్‌. కే జైస్వాల్‌తో కూడిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పును పరిశీలిస్తే వందల సంవత్సరాల నాడు బ్రిటిష్‌ పాలకులు రూపొందించిన పోలీసింగ్‌ చట్టాలను సంస్కరించాల్సిన సమయం ఆసన్నమైనదనే విషయం సుస్పష్టం అవుతున్నది. అదే సమయంలో అంతర్లీనంగా ఆ తీర్పు ఇంకో కోణాన్ని కూడా స్ప్రుశించింది. న్యాయస్థానాలు కేసుల పరిశీలనలో, తీర్పులలో కేసువేనుక ఉన్న సంచలనాన్ని, కేవలం శాస్త్రీయ అదారాలనులను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా కోర్టులు వారి ముందు ఉంచబడిన వాస్తవ సాక్షాలను, భారతీయ సాక్షాదారముల చట్టం (ఇండియన్‌ ఎవిడెన్స్‌ ఆక్ట్‌ ) పరిధిలో ఆయా సాక్షాల విశ్వసనీయతను పరిగణలోకి తీసికొవాలనే సూచన అంతర్లీనంగా మనకు అగుపిస్తున్నది. పోలీసు విచారణ, న్యాయస్థానాల తీర్పులు విజ్ఞత కలిగిన మామూలు వ్యక్తుల అంచనాలకు అందనంత సంక్లిష్టంగా ఉండరాదన్నది ఉన్నత న్యాయస్థానం వారి తీర్పులో స్పష్టంగా చూడవచ్చు.
హైకోర్టు వారి తీర్పు కేవలం పోలీసు వ్యవస్తలో మాత్రమే సంచలనాన్ని సృష్టించింది అనుకొంటే పొరపాటే అవుతుంది. నేటి ఈ తీర్పు భవిష్యత్తులో భారతదేశ వ్యాప్తంగా వివిధ చట్టాల రూపకల్పనలో, నేరవిచారణ ప్రక్రియలో, దిగువ న్యాయస్తానాల కేసుల విచారణ, పరిశీలనా కోణంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది. వందమంది దోషులు తప్పించుకున్నా పరవాలేదు కాని ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడరాదు అన్న భారత రాజ్యాంగ స్పూర్తి ఎంత ఉన్నతమైనదో ఒక్క సత్యంబాబు కేసు ఉదంతంతో మనకు స్పష్టమౌతున్నది. కేవలం పోలీసులదే తప్పు, కేసును ముసేయడానికి అమాయకుణ్ణి బలిచ్చి చేతులు దులుపుకున్నారు అనుకుంటే అంతకు మించిన పొరపాటు మరోటుండదు. కళ్ళముందే సాక్షాలు కదలాడుతున్న ఏమీ చేయలేని నిస్సహాయ స్తితిలోకి వారిని నెట్టిన అధికార, రాజకీయ పెత్తనం వారి చేతులను కట్టేసిందనే చెప్పవచ్చు. అధికారుల బదిలీల్లో రాజకీయ జోక్యం, డీ.ఎన్‌.ఏ., ఫోరె న్సిక్‌ సైన్స్‌ లాంటి సంస్తల నిర్వహనల్లో పోలీసు పెత్తనం ఎన్ని అనర్తాలకు దారితీయగలదో అయేషా కేసుతో స్పష్ట మౌతున్నది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే సయ్యద్‌ అయేషా మీరా ఒక నిరుపేద కుటుంబానికి చెందిన బీ. ఫార్మసీ మొదటి సంవత్సరం విద్యార్తిని. విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలోని దుర్గా లేడీస్‌ హాస్టల్‌ లో ఉంటూ కాలేజీకి వెల్లివస్తుండేది. ఆ హాస్టల్‌ గురించి చెప్పాలంటే అదొక నాలుగంతస్తుల భవనం. భవనం గ్రౌండ్‌ ప్లోర్లోలో ఇతరు లు ( కోనేరు చిట్టబ్బాయ్‌, బొడ్డు హనిరాజ్‌) కిరాయికి ఉండేవారు, మొదటి అంతస్తులో భవన యజమాని, హాస్టల్‌ నిర్వాహకులు ఉంటారు, భవనంలోని మిగతా అంతస్తులలో లేడీస్‌ హాస్టల్‌ నిర్వహిస్తుంటారు. భవనం చుట్టూ ఆరున్నర (61/2) అడుగుల ఎత్తులో ప్రహారీగోడ ఉన్నది. భవనానికి ఇనుప గ్రిల్స్‌ తో కూడిన రక్షణ వ్యవస్థ ఉన్నది. మొదటి అంతస్తు పారాఫీట్‌ వాల్‌ ఎత్తు గ్రౌండ్‌ నుండి 141/2 అడుగులు. భవనాన్ని అనుకుని 8 అడుగుల బాత్రుం ఉన్నది. కేవలం తల్లులకు మాత్రమె హాస్టల్‌ గదులలోకి అనుమతి, తండ్రి కూడా గ్రౌండ్‌ ప్లోర్‌ కే పరిమితం. భయటికి వెళ్ళిన అమ్మాయిలు మళ్ళీ తిరిగొచ్చి కాలింగ్‌ బెల్‌ కొడితేనే గాని తలుపులు తెరుచుకోవు. అంతటి రక్షణ వ్యవస్థ ఉన్న హాస్టల్‌ లో తేది: 27-12-2007 నాడు తెల్లవారుజాము 2 గంటల ప్రాంతంలో రెండవ అంతస్తులో, 6వ బ్లాక్‌లో ఉన్న అయేషా మీరా హత్యకు గురైనదని హాస్ట ల్‌ వార్డెన్‌ గుర్తించి ఉదయం 5:30 ప్రాంతంలో స్తానిక పోలీసులకు సమాచారం ఇవ్వటం పోలీసులు రావటం చకచకా జరిగిపోయాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందేమిటంటే ఒకరికన్నా ఎక్కువ మంది నేరంలో పాల్గొన్నారని, తలను గోడ కార్నర్‌ ఎడ్జేస్‌కు, లేదా ఆల్మారా కొనలకు పలుమార్లు బాదటం వలన లేదా ఉపిరాడకుండా చేయటం వలన మరణం సంభవించిందని, అత్యాచారం జరిగిన ఆనవాల్లున్నాయని తెలిసింది. హత్య, అత్యాచారం కింద కేసు నమోదుచేసిన పోలీసులు ఎందరో అనుమానితులను విచారించిండ్రు. ఆ క్రమంలో మొట్టమొదట హాస్టల్‌ వంట మనిషిని నిందితునిగా గుర్తించి తరువాత కాదని తేలడంతో రౌడీ షీటర్‌ గురువిందర్‌ సింగ్‌ @ లడ్డును నిందితునిగా అరెస్ట్‌ చేయటం జరిగింది. డీ.ఎన్‌.ఏ, ఫో రెన్సిక్‌ రిపోర్టుల అనంతరం అతన్ని కూడా నిర్దోషిగా ప్రకటించారు. తిరిగి ప్రారంభమైన విచారణ ప్రజాసంఘాలు, తల్లిదండ్రుల నిరసనల నడుమ, ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు, జాతీయ మహిళా సంఘం, మైనారిటీ సంఘం, మానవహక్కుల సంఘాల నివేదికల నడుమ సుమారు 8 నెలలకు పైన కొనసాగింది, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ క్రమంలో పోలీసులు విచారించిన 120 మంది అనుమానితుల్లో గాని, ఫోరెన్సిక్‌, డీ.ఎన్‌.ఏ పరీక్షలకు పం పిన 55 మంది అనుమానితుల్లో గాని ఆయేషా తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు ఆరోపించిన నిందితులు లేకపోవడం జవాబు దొరకని ప్రశ్న. కోర్టువారి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ హాస్టల్‌ వార్డెన్‌, ఆయేషా సహా విధ్యార్థినులను నిజనిర్ధారణ నిమిత్తం నార్కో ఎనాలిసిస్‌ టెస్ట్‌ కు పంపక పోవటం కొసమెరుపు.
ఇలా విచారణ నడుస్తున్న క్రమంలో ఇబ్రహింపట్నం పోలీసులకు నందిగామ పోలీసులు పోన్‌ చేసి, పిడతల సత్యంబాబు అనే నిందితున్ని తాము ఒక దొంగతనం కేసులో అదుపులోకి తీసికొని విచారిస్తున్న క్రమంలో తాను మొత్తం 9 నేరాలు చేసినట్లు ఒప్పుకొన్నాడని అందులో 8 దొంగతనాలు కాగా మరొకటి విజయవాడ, ఇబ్రహిం పట్నంలో దుర్గా లేడీస్‌ హాస్టల్‌ లో యువతిని హత్యచేసి మానభంగం చేసినట్లు అంగీకరించినట్లు చెప్పటం జరిగింది. ( సత్యంబాబు అంగీకరించినాడు అని చెప్పబడ్డ 8 దొంగతనం కేసులలో 5 కేసులు తప్పుడు ఆరోపణలని హై కోర్టు వారు తదుపరి కాలంలో కొట్టివేసినారు). విషయం తెలుసుకున్న ఇబ్రహింపట్నం పోలీసులు వెంటనే సదరు సత్యంబాబును ప్రిజనర్‌ ప్రొడక్షన్‌ వారెంట్‌ ద్వారా స్థానిక కోర్టులో హాజరుపరచటం, పాలీగ్రాఫి, డీ.ఎన్‌.ఏ, ఫోరెన్సిక్‌ తదితర పరీక్షలకు పంపించటం చకచకా జరిగిపోయాయి. పోలీసుల అదుపులో సత్యంబాబు ఇచ్చిన వాగ్ములం, సైంటిఫిక్‌ నివేదికల ఆదారంగా పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. పోలీసుల చార్జిషీట్‌ కథనం ఏంటంటే, కృష్ణా జిల్లా అన్నాసాగరానికి చెందినా పిడతల సత్యంబాబు 7 వ తరగతి వరకు చదువుకున్న ఒక లారీ క్లీనర్‌. భార్య అతన్ని వదిలేసింది. ప్రవ్రుత్తి రీత్యా అతనొక అలవాటుపడిన దొంగ తన శారీరక వాంచను తీర్చుకోవటానికి నందిగామ ప్రాంతంలో ఎందరో ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేరస్తుడు. తేదీ: 24-01-2008 రోజు నందిగామ ప్రాంతంలో జరిగిన దొంగతనం కేసులో 6 నెలల శిక్షకు గురై తేదీ: 25-07-2008 నాడు జైలు నుండి విడుదల అయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం సత్యంబాబు అయేషా హత్యకు ముందు రోజు రాత్రి నందిగామ నుండి విజయవాడకు సినిమా చూడాలని లారీ ఎక్కి వెళ్లి సెకండ్ షో సినిమా చూసి, హాస్టల్‌ ప్రాంతంలో తచ్చాడుతుంటే , హాస్టల్‌ దగ్గరలోని బిల్డింగ్‌ బాల్కానిలో ఒక యువతి తన కాబోయే భర్తతో సెల్‌ ఫోన్‌ లో మాట్లాడుతూ అగుపించేసరికి అతనిలో కామవాంచ పెరిగింది, ఎదురుగా అగుపించిన దుర్గా లేడీస్‌ హాస్టల్‌ 61/2 అడుగుల ప్రహరీ గోడ దూకి లోపలికి వెళ్ళి, హాస్టల్‌ ను ఆనుకొని ఉన్న 8 అడుగుల ఎత్తున్న బాత్రుం పైకి ఎక్కి, అక్కడనుండి 61/2 అడుగుల ఎత్తున్న మొదటి అంతస్తు పిట్టగోడను ఎక్కి మొదటి అంతస్తులోకి ప్రవేశించాడు. (సత్యంబాబు ఎత్తు 5.5 అడుగులు, బరువు 50 కిలోలు) తదుపరి మెట్ల ద్వారా రెండవ అంతస్తులోకి వెళ్ళిన సత్యంబాబుకు అక్కడ 6వ బ్లాక్‌ గదిలో లోపలినుండి ఎటువంటి గడియ పెట్టుకోకుండా నిద్రిస్తున్న అయేషా మీరా అగుపించింది. ఆ సమయంలో తనపైన అత్యాచారం చేస్తే ఆమె అరుపులకు మిగతా విద్యార్థినులు (55 మంది) మేల్కొంటారేమో అనే అనుమానంతో ముందుగా తనను చంపాలని నిర్ణయించుకొని ఆయుధం కొరకు వెతకగా అది దొరక్కపోవటంతో తిరిగి మెట్లద్వారా మొదటి అంతస్తులోకి, అటునుండి బాత్రుంపైకి, అక్కడ నుండి కిందకు దూకి సమీపంలోని ఇంటి ముందు పొదల్లో పడివున్న రోకలిబండను తీసికొని తిరిగి ప్రహారీగోడ, బాత్రుం గోడ, పిట్టగోడ ఎక్కి(1.13 కిలోల బరువు, 63 సెం.మీ పొడవు ఉన్న రోకలిబండతో ఎలాంటి అలజడి లేకుండా, సహా యం లేకుండా ఒంటరిగా ఇదంతా ఎలా చేయగలిగాడని అడక్కండి) ఆయేషా ఉన్న గదిలోకి వెళ్లి మంచంమీద ఎడమవైపు తిరిగి పడుకున్న అయేషాను రోకలిబండతో ఒక్క వేటు వేయగా ఆ బిడ్డ కుయ్‌ అనే శబ్దం మాత్రం చేస్తూ చనిపోయింది. అయేషా విగత శరీరాన్ని మంచం వద్ద నుండి గది తలుపువరకు మోసుకొచ్చి అక్కడనుండి రెండు గదుల ఆవల 60 ఫీట్ల దూరంలో ఉన్న బాత్రుం వద్దకు లాగుతూ తీసికొని వెళ్లి అక్కడ అత్యాచారం చేసి, తిరిగి తన గదికి వచ్చి ఆమె సూట్కేస్‌ నుండి 500 రూపాయలు, పెన్ను, పెన్సిల్‌ తీసికొని బెడ్డు పక్కనున్న నాన్‌ జుడిషియల్‌ స్టాంపు పేపర్‌ మీద ప్రేమ గుర్తు వేసి, ప్రేమ చిరుత, ఇంకా ఏవేవో వ్రాసి, బాత్రుంకు వెళ్లి ఆయేషా శరీరంపై హెచ్‌ అని అక్షరం వ్రాసి మళ్ళీ అత్యాచారం చేసి ఆ తరువాత తీరికగా రోకలిబండను తీసికొని వచ్చిన దారిలోనే కిందకు దిగి, తెచ్చిన చోటనే రోకలిబండను ఉంచి సమీపంలో ఉన్న టీ కొట్టులోకి వెళ్లి ఉదయం 5:30 నుండి 11 గంటల వరకు అక్కడే ఉండి ఆ తరువాత నందిగామ వెళ్ళిపోయాడు. మూడు నెలల్లో విచారణ పూర్తిచేయాలని హైకోర్టు వారు ఇచ్చిన ఆదేశాలతో విజయవాడ జిల్లా మహిళా కోర్టు వారు సాక్షులను విచారించి ఆయేషా తల్లి నిందితుడు సత్యంబాబు నేరస్తుడని ఆరోపించక పోయినా, ఫోరెన్సిక్‌ నివేదిక, డీ.ఎన్‌.ఏ నివేదిక, పంచుల సాక్షం ఆదారంగా సత్యంబాబుకు యావజ్జీవ కారాగార శిక్ష విదించటం జరిగింది. హైకోర్టు వారి ముందు సుదీర్ఘంగా కొనసాగిన వాద నల అనంతరం ఎన్నో ప్రశ్నలు జవాబు దొరక్కుండా మిగి లిపోయాయి. హాస్టల్‌ కారిడార్‌ లో ఆయేషా శవాన్ని రక్తం కారుతుండగా 60 ఫీట్లకు పైగా లాగుతూ పోయినా కూడా నిందితుని కాలిముద్రలు పడలేదా? పలుమార్లు తలను మోదటం వలన చనిపోయినట్లు కొనసాగిన విచారణ అకస్మాత్తుగా ఒక్క వేటుతో చనిపోయిందనే తుది నివేదికకు విరుద్దం కాదా? హంతకుడు హత్య, అత్యాచారం చేసిన తరువాత రక్త హస్తాలతో ఉత్తరం వ్రాసినా కూడా పేపర్‌ మీద, పెన్ను, పెన్సిల్‌ మీద, శరీరం మీద గదిలో ఏ ఒక్క ప్రాంతంలో కూడా వేలిముద్రలు పడలేదా!? గోడలమీద, ఆల్మారా మీదకు రక్తం మరకలు ఎలా వచ్చాయి? 5.5 అడుగుల మనిషి ఎటువంటి ఆదారం లేకుండా 8 ఫీట్ల ఎత్తున్న బాత్రుం ఎలా ఎక్కగలిగాడు? హాస్టల్‌ రక్షణ వ్యవస్థను ఎలా చేదించాడు? సుమారు మూడు గంటలపాటు హత్య, అత్యాచారం జరిపినా అలజడి కాలేదా? 55 మంది విద్యార్థులలో ఏ ఒక్కరికి అలికిడి వినబడలేదా? హైకోర్టు వారి అనుమతి ఉన్నా కూడా హాస్టల్‌ వార్డెన్‌, ఆమె భర్త, ఇతర విద్యార్థినులను నార్కో అనాలిసిస్‌ పరీక్షకు ఎందుకు పంపలేదు? జాతీయ మహిళా సంఘం, మానవ హక్కుల సంఘం, మైనారిటీ కమీషన్‌ నివేదికలను విచారణలో భాగంగా ఎందుకు పరిగణించలేదు ? హత్య చేసిన హంతకుడు రక్తం మరకలతో ఉదయం 5: 30 నుండి 11 గంటల వరకు టీ హోటల్‌ లో ఎలా ఉండగలిగాడు? మర కలు లేకుండా ఎలా వెళ్ళిండు? నిందితుని సగం కాలి ముద్ర సరిపోయిందనే నివేదిక ఇచ్చారు సరే, ఇదేవిధంగా గతంలో గురువిందర్‌ సింగ్‌ కాలి ముద్ర కూడా సరిపో యిందని నివేదిక ఇచ్చారు కదా మరి దాని విషయమే మిటి? ఫోరెన్సిక్‌ లాబ్‌, డీ.ఎన్‌.ఏ సంస్థలు పోలీసు పర్య వేక్షణలో కొనసాగుతున్నవి కాదా? నిందితుడు వ్రాసినట్లు చెబుతున్న 15 వరుసల ఉత్తరం సంగతేమిటి? ఆ చేతిరాత నిందితునిదేనా? అయేషాను చంపడానికి రాలేదు, ఐ లవ్‌ యు అని చెప్పడానికి వచ్చాను, కాని నా ప్రేమను తిరస్క రించింది, కోపంతో తనను చంపాను. దీనర్తం ఏమిటి, హంతకునికి అయేషాతో పాత పరిచయం ఉన్నట్లా? లేన ట్లా? ఏ పరిచయం లేని వ్యక్తీ ఇలా వ్రాయగాలడా? 55 మంది అనుమానితులను ఫోరెన్సిక్‌, డీ.ఎన్‌.ఏ పరీక్షలకు పంపినామన్న పోలీసులు సంబందిత దస్తావేజులు కోర్టు ముందరికి ఎందుకు తేలేదు? అయేషా తల్లిదండ్రులు నిం దితులుగా పేర్కొన్న వారిని ఎందుకు విచారించలేదు, వారి ని ఫోరెన్సిక్‌, డీ.ఎన్‌.ఏ, ఫింగర్‌ ప్రింట్‌, ఫుట్‌ ప్రింట్‌ పరీక్ష లకు, నార్కో అనాలిసిస్‌ పరీక్షలకు పంపలేదేందుకు? 13-2-08 నాడు చేసినట్లు చెబుతున్న అయేషా డీ.ఎన్‌.ఏ ప్రొఫైల్‌ ను సత్యంబాబును అరెస్టు చేసి, పరీక్షించే వరకు కోర్టుకు ఎందుకు పంపలేదు? డాక్టర్‌ రిపోర్ట్‌ ప్రకారం అయేషా మర్మాంగాల మీద ఎటువంటి గాయాలు లే, నిజంగా సత్యంబాబు చనిపోయిన / చనిపోవటానికి సిద్దం గా ఉన్న అయేషా మీద అత్యాచారం జరిపి ఉంటే ఖచ్చితం గా తన జననాంగం మీద తీవ్ర గాయాలు ఉండితీరాలి, ఎందుకంటే స్పృహలో లేని, జీవించి లేని స్రీలో సహజ సిద్ధంగా సంబోగానికి కావలసిన లుబ్రికేంట్స్‌ ఉత్పత్తి కావు, కనుక గాయపరచకుండా అంగప్రవేశం అసాధ్యం. సత్యం బాబు అయేషాపై అత్యాచారం చేయలేదని కోర్టు విశ్వసిం చడానికి ప్రధాన ప్రాతిపాదిక ఇదే. చాలామంది అపోహ పడుతున్నట్లు హైకోర్టు వారు ప్రకటించిన రూ.లక్ష సత్యం బాబు, అతని కుటుంబం అనుభవిం చిన మానసిక, శారీరక క్షోభకు, నష్టపోయిన విలువైన కాలానికి నష్టపరిహారం ఎంతమాత్రం కాదు, ఈ విషయం కోర్టువారు చాలా స్పష్టం గా ప్రకటించారు. అప్పీల్‌ కేసులలో నిందితునికి నష్టపరి హారం ప్రకటించే అవకాశం లేకపోవటంచేత తాము నష్ట పరిహారం నిర్ణయించలేదని, నిందితుడు తన మీద దురు ద్దేశ పూర్వక అభియోగాలు మోపినందుకుగాను ప్రభుత్వా న్ని బాధ్యున్ని చేస్తూ నష్టపరిహారం కోరవచ్చని స్పష్టం చేసింది. ప్రకటించిన రూ.లక్ష కేవలం వాజ్య ఖర్చులు మాత్రమే. అదే సమయంలో కింది కోర్టులనుద్దేశించి దిగువ కోర్టు పోలీసువారు ప్రవేశపెట్టిన వైద్య, శాస్త్రీయ సాక్ష్యాల ముఖ విలువ ప్రభావానికిలోనై పోలీసువారి కేసులో స్పష్టంగా అగుపిస్తున్న బలహీనతలను గుర్తించలేక పోయింది అని వ్యాఖ్యానించడం జరిగింది. చివరగా కోర్టుల ప్రధాన బాధ్యత బాధితులకు న్యాయం చేయటం మాత్రమే కాదు, నిర్దోషులను రక్షించడం కూడా అని ప్రకటించటం ద్వారా ఉన్నత న్యాయస్తానం ఎన్నో విప్లవాత్మకమైన ఆలోచనలకు తెరలేపింది.

  • చందుపట్ల రమణ కుమార్‌ రెడ్డి
    న్యాయవాది
    9440449392
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News