Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్New political Equations in Telangana: తెలంగాణలో సరికొత్త రాజకీయ వ్యూహాలు

New political Equations in Telangana: తెలంగాణలో సరికొత్త రాజకీయ వ్యూహాలు

వ్యూహాలు, ప్రతివ్యూహాలలో గణనీయంగా మార్పు

కర్ణాటక ఎన్నికల తర్వాత నుంచి తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజకీయ సమీకరణాలు క్రమంగా మారుతున్నాయి. ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించి అధికారానికి వచ్చిన దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం, ఉత్తేజం పొంగిపొరలుతుండడంతో వివిధ పార్టీల రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలలో గణనీయంగా మార్పు వస్తోంది. వరుసగా మూడవసారి అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్న భారత రాష్ట్ర సమితి (బి.ఆర్‌.ఎస్‌) అతి వేగంగా పావులు కదుపుతోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అయిన కె. చంద్రశేఖర్‌ రావు తనదైన శైలిలో ముందుగా పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించారు. పార్టీకి, ప్రజలకు ఆశించిన స్థాయిలో సేవ చేయని శాసనసభ్యులను శాసనసభ నియోజకవర్గాల వారీగా గుర్తించి వారిని పార్టీ నుంచి బయటకు పంపే కార్యక్రమం ఇప్పటికే ప్రారంభం అయింది. ఏయే శాసనసభ్యులను ఈసారి పోటీ నుంచి తప్పించాలా అన్న ఆలోచన సాగుతోంది. పార్టీలో శాసనసభ్యుల తీరుతెన్నులపై మదింపు జరుగుతోంది. దీనితో పాటు ఆయన, ఆయన మంత్రులు 2014లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి చేపడుతున్న ప్రజాహిత, సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షిస్తూ, వాటి ఫలితాలను ప్రజల ముందుంచడం జరుగుతోంది.
విచిత్రమేమిటంటే, కేసీఆర్‌ ఏది చేసినా మూడవ కంటికి తెలియకుండా చేస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆయన శైలిలో కొద్దిగా నిగూఢత్వం కనిపిస్తుంది. ఒకపక్క పార్టీ ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటూ, మరొక ప్రభుత్వ పథకాలు ఏ విధంగా, ఎంత వరకూ అమలు జరుగుతున్నదీ ప్రజలకు వివరిస్తూ, మరొకపక్క ప్రతిపక్షాల వ్యూహాలకు ప్రతివ్యూహాలను రూపొందిస్తూ ముందుకు దూసుకు వెడుతున్న కేసీఆర్‌ ప్రభుత్వం జాతీయ స్థాయి రాజకీయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కూటమిఏర్పాటుకు ప్రయత్నాలు సాగిస్తుండడాన్ని కేసీఆర్‌ గమనిస్తూనే ఉన్నారు. నిజానికి జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు ఆయన ఆశించినంతగా మద్దతునివ్వడం లేదని తెలిసి పోతూనే ఉంది. ఒకప్పుడు మన్మోహన్‌ సింగ్‌ హయాంలో కాంగ్రెస్‌కు గట్టి మద్దతునిచ్చిన కేసీఆర్‌ ప్రస్తుతం ఈ పార్టీపై సంధించడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్‌ నుంచి తనకు ప్రమాదం పొంచి ఉన్న విషయం అపర రాజకీయ చాణక్యుడైన ఆయనకు తెలియనిది కాదు. కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం చోటుచేసుకుందని, గట్టిగా ప్రయత్నిస్తే తాము గెలిచే అవకాశం ఉందని కూడా ఆ పార్టీ నాయకత్వం గట్టి నమ్మకంతో ఉందని ఆయనకు అర్థమైంది. అంతేకాక, గతంలో పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులందరికీ తిరిగి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించడం గమనించాల్సిన విషయం. బీఆర్‌ఎస్‌లో అసంతృప్తి చెందిన నాయకులు, టికెట్‌ రాదనుకుంటున్న నాయకులు, అసమ్మతి నాయకులు ఇప్పటికే కాంగ్రెస్‌ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించడం, సంకేతాలు పంపిస్తుండడాన్ని కేసీఆర్‌ నిశితంగా గమనిస్తున్నారు. ఏది ఏమైనా కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన దగ్గర నుంచి కాంగ్రెస్‌ జవజీవాలు పుంజుకోవడం ప్రారంభమైంది. ఇదివరకు తెలంగాణలో కొద్దిగా బలం పుంజుకున్న బీజేపీ కంటే ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీయే ప్రచారంలో, బీఆర్‌ఎస్‌ వ్యతిరేక పోరాటంలో ఒక అడుగు ముందుకు వేసిన సూచనలు కనిపిస్తున్నాయి.
బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఈ విధంగా అయిదారు నెలలో జరగబోయే ఎన్నికల్లో విజయానికిరకరకాల ఎత్తులు పైఎత్తుల్లో మునిగి ఉండగా, బీజేపీ మాత్రం అంతర్గత కలహాలలో పూర్తిగా మునిగి తేలుతోంది. ఈ పార్టీ కాస్తంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ, ఈ పార్టీలో ఏదో సమస్య ఉందనే విషయం అందరికీ అర్థమవుతూనే ఉంది. బీఆర్‌ఎస్‌లోని తిరుగుబాటుదార్లకు కాంగ్రెస్‌ గాలం వేస్తుండగా, బీజేపీకి ఇంతవరకూ తమ వ్యూహం ఏమిటన్నది అంతుబట్టడం లేదు. పార్టీలో అంతర్గత కలహాలు, అసమ్మతి ఇక అదుపు చేయలేని స్థాయికి చేరుకుంటున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. పార్టీని చక్కదిద్దడానికి పార్టీ అధిష్ఠాన అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్‌ శర్మను నియోగించాల్సి వచ్చింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ కూడా కాంగ్రెస్‌ పార్టీ మాదిరిగానే తన ఇంటిని ఎంత వీలైతే అంత త్వరగా చక్కదిద్దుకోవడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News