Mandous Cyclone: మాండస్ తుఫాన్ తీరం దాటినా దాని ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే దీని ప్రభావంతో దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ఎఫెక్ట్ ఇప్పటికే ఏపీపై భారీగా పడగా అటు తమిళనాడుపై అంతకు మించి తుఫాన్ ప్రభావం చూపించింది. ఇక, తెలంగాణ కేపిటల్ హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మేఘవృతం అయ్యి చిరు జల్లులు కురిశాయి.
కాగా, తుఫాన్ ప్రభావంతో.. వచ్చే 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో ఆందోళన మొదలైంది. ఏపీలో ఇప్పటికే చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. సత్యవేడు, నగరి, శ్రీకాళహస్తిలో ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, హోర్డింగులు నేలకూలాయి. నెల్లూరు, కడప, ప్రకాశంతో పాటు బాపట్ల జిల్లాలోనూ తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపించింది..
కడప, అన్నమయ్య జిల్లాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఇక ప్రకాశం జిల్లాలోనూ వానముసురు పట్టింది. జిల్లా వ్యాప్తంగా జోరు వానలు కురిశాయి. కాకినాడ జిల్లాపై కూడా మాండస్ ఎఫెక్ట్ పడింది. కాగా.. రానున్న మూడు రోజులు ఏపీతో పాటు ఇటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో అధికంగా ఉండొచ్చని పేర్కొంది.