Sunday, November 10, 2024
HomeతెలంగాణThalasani: నగరంలోని నాలాలన్నీ పూర్తిస్థాయిలో అభివృద్ధి

Thalasani: నగరంలోని నాలాలన్నీ పూర్తిస్థాయిలో అభివృద్ధి

ప్రజల ఇబ్బందులన్నీ గుర్తించి, పరిష్కరిస్తున్నాం

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరంలో ఉన్న అన్ని నాలాల అభివృద్ధి పూర్తిస్థాయిలో జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి వరద ముంపుకు గురవుతున్న ప్రజల కష్టాలు సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమంతో తొలగిపోతున్నాయని అన్నారు. మినిస్టర్ రోడ్డులోని పికెట్ నాలాపై ఎస్.ఎన్.డి.పి కార్యక్రమంలో భాగంగా రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పాలకులు నాలాల అభివృద్ధిని పట్టించుకోకపోవడం వలన ఎన్నో సంవత్సరాల నుండి నాలాల పరిసర కాలనీల ప్రజలు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వరదముంపుకు గురవుతూ అనేక ఇబ్బందులకు గురయ్యేవారని చెప్పారు. బాధిత ప్రజల సమస్య పరిష్కారం గురించి కనీసం ఆలోచన కూడా చేయలేదని విమర్శించారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి వాటిని పరిష్కరించాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అన్నారు. నాలాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం ద్వారా వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆలోచనతో మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టారన్నారు.

- Advertisement -

నాలాల వెంట ఉన్న అక్రమ నిర్మాణాల తొలగింపు, పూర్తిస్థాయిలో పూడిక తొలగించడం, శిథిలావస్థలో ఉన్న, ఇరుకుగా ఉన్న బ్రిడ్జిల స్థానంలో నూతనంగా విశాలమైన బ్రిడ్జిలను నిర్మించడం వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. అందులో భాగంగా పికెట్ నాలాపై కరాచీ బేకరీ వద్ద రూ.10 కోట్ల వ్యయంతో ఒక బ్రిడ్జిని నిర్మించి ప్రారంభించామన్నారు. అదేవిధంగా మినిస్టర్ రోడ్డులోని పికెట్ నాలాపై నిర్మించిన బ్రిడ్జిని శుక్రవారం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇవే కాకుండా బేగంపేటలోని నాలా అభివృద్ధి పనులు కూడా 45 వ్యయంతో చేపట్టినట్లు చెప్పారు. ముషీరాబాద్, అంబర్ పేట నియోజకవర్గాల మీదుగా మూసీ వరకు ఉన్న హుస్సేన్ సాగర్ నాలా అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయని అన్నారు. ఎస్.ఎన్.డి.పి కార్యక్రమం క్రింద అభివృద్ధి పనులు జరిగిన ప్రాంతాలలో వరదముంపు సమస్య నుండి ప్రజలకు విముక్తి లభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, ఎస్.ఎన్.డి.పి సిఇ కిషన్, ఎస్ఇ భాస్కర్ రెడ్డి, ఈఇ శ్రీధర్, జోనల్ కమిషనర్ శ్రీధర్, ఈఇ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News