ప్రధానమంత్రి అమెరికా పర్యటనలో సెమీకండక్టర్ పరిశ్రమపై ప్రత్యేక దృష్టిసారించి. దీంతో గత 40 ఏళ్లుగా మన దేశానికి తీరని కల నెరవేరే క్షణాలు ఎట్టకేలకు ఆవిష్కృతం అయ్యేందుకు మార్గం సుగమం అయింది. భారతదేశంలో సెమీకండక్టర్ పరిశ్రమను నిర్మించేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించినప్పటికీ అవేవీ ఫలితాలను ఇవ్వలేకపోయాయి. అయితే ప్రధాని మోడీ దూరదృష్టి, నాయకత్వం ఫలితంగా, భారతదేశం కల నెరవేరబోతోందని ఐటీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. భారతదేశంలో సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ పురోభివృద్ధి బాటలో పడనుంది.
ప్రధాని మోడీ అమెరికాలో చేసిన సెమీకండక్టర్లకు సంబంధించిన 3 ప్రకటనలు సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమైన మైలురాళ్లను దాటేందుకు రోడ్ మ్యాప్ ఏర్పడింది. ఇందులో భాగంగా భారతదేశంలో కొత్త సెమీకండక్టర్ యూనిట్‌ను నిర్మించడానికి మైక్రోన్ టెక్నాలజీ ఇంక్ రాబోయే 5 సంవత్సరాలలో 2.75 బిలియన్ డాలర్లు (రూ. 22,000 కోట్ల కంటే ఎక్కువ) పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద సెమీకండక్టర్ కంపెనీలలో మైక్రోన్ ఒకటి కావటం విశేషం.
మైక్రోన్ ఇండియా యూనిట్ పిసిలు, నెట్‌వర్క్ పరికరాలు, డేటా సెంటర్లలో ఉపయోగించే మెమరీ, స్టోరేజ్ ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 15,000 మందికి ఉపాధి లభిస్తుంది. బెంగళూరులో ఇంజినీరింగ్ కేంద్రాన్ని నెలకొల్పేందుకు అప్లైడ్ మెటీరియల్స్, రాబోయే 4 సంవత్సరాలలో 400 మిలియన్ యుఎస్ డాలర్లు (రూ. 3,000 కోట్ల కంటే ఎక్కువ) పెట్టుబడులను మోడీ తెప్పించగలగటం మరో హైలైట్. సెమీకండక్టర్ పరికరాలు, సేవలు, సాఫ్ట్‌వేర్‌ల ప్రముఖ సరఫరాదారుగా అప్లైడ్ మెటీరియల్స్ మార్కెట్లో రాజ్యమేలుతోంది. అటువంటి సంస్థ మనదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టనుండటం ఐటీ రంగం సిగలో ఓ కలికుతురాయనే చెప్పాలి.
సెమీకండక్టర్ పరిశ్రమ కోసం మెరుగైన శిక్షణ ఇవ్వడానికి లామ్ రీసెర్చ్ ఇండియా సెమీకండక్టర్ మిషన్‌తో కలిసి పనిచేస్తుంది. లామ్ “సెమివర్స్” వర్చువల్ సొల్యూషన్ భారతదేశంలోని 60,000 మంది ఇంజనీర్లకు వచ్చే 10 సంవత్సరాలలో శిక్షణ ఇవ్వడానికి అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తుంది. భారతదేశం పూర్తి సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసే లక్ష్యాన్ని సాధించడంలో ప్రధాన పురోగతి సాధించేందుకు ఇది సహకరిస్తుంది. గత 40 సంవత్సరాలుగా భారతదేశంలో సెమీకండక్టర్ పరిశ్రమను నిర్మించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించాయి. సెమీకండక్టర్ సరఫరా విభాగంలో మనదేశాన్ని విశ్వసనీయ భాగస్వామిగా యావత్ ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెమీ కండక్టర్ రంగంలో వెనుకబడ్డ మనం ఇలా ముందుగు సాగేలా మార్గం సుగమం అవ్వటం శుభసూచకమని ఐటీ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఐటీ రంగంలో సెమీకండక్టర్స్ అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. మన దైనందిన జీవితంలో ఉపయోగించే మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీ, కార్లు లాంటి అనేక వస్తువులలో సెమీకండక్టర్ చిప్‌లు ప్రధానమైనవి.