Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Unemployment: నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఏదీ?

Unemployment: నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఏదీ?

భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసుకోవడంతో ఆర్థికంగా దెబ్బతిన్నామంటున్న కంపెనీలు

దేశంలో నిరుద్యోగ సమస్య మళ్లీ కొత్త పుంతలు తొక్కుతోంది. అనేక వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, కర్మాగారాలు ఉద్యోగుల నియామకాన్ని బాగా తగ్గించడం, ఉద్యోగుల సంఖ్యను తొలగించడం, కొత్త ఉద్యోగాలను సృష్టించలేకపోవడం వంటి కారణాల వల్ల నిరుద్యోగ సమస్య మళ్లీ విజృంభిస్తోందన్న ఆందోళన కలుగుతోంది. ఏతావతా, కొత్తగా డిగ్రీలు తీసుకుని వస్తున్న విద్యావంతులు అత్యధిక భాగం నిరుద్యోగంతో బాధపడడం జరుగుతోంది. విచిత్రమేమిటంటే, ఐ.టి, ఐ.టి.ఇ.ఎస్‌లు, స్టార్టప్‌ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించడంలో ముందున్నాయి. దేశంలోని ఇతర అనేకానేక కంపెనీలు ఉద్యోగుల నియామకాలను చాలావరకు తగ్గించివేశాయి. ముఖ్యంగా చదువుకున్నవారికి మాత్రమే ఉద్యోగాలు లభించడంలేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఉద్యోగాలు పోవడమన్నది లేదా తొలగించడం అన్నది ఒక నిత్యకృత్యంగా, ఆనవాయితీగా మారిపోయింది. ఐ.టి కంపెనీల్లోనూ, స్టార్టప్‌లలోనూ ఉద్వాసన పత్రాల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది.
ఇప్పుడు ఉద్యోగ భద్రత అనేది కాలం చెల్లిన మాట. కొద్ది నెలలుగా దేశంలో గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, ఐ.బి.ఎం, మేటా, కాగ్నిజెంట్‌ వంటి అంతర్జాతీయ కంపెనీలు, బైజూ, ఓలా వంటి స్టార్టప్‌ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడం, కఠినమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, ఆదాయం తగ్గడం, నియామకాలను తగ్గించడం వంటి కారణాలను ఈ కంపెనీలు కూడా తెలియజేస్తున్నాయి. మొదట్లో భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసుకోవడంతో తాము ఆర్థికంగా దెబ్బతినడం జరిగిందని కూడా ఈ కంపెనీలు వివరిస్తున్నాయి. తమ ఉద్యోగులు ఆశించిన స్థాయిలో పని చేయడం లేదని, అసలు సామర్థ్యం కంటే తక్కువ స్థాయిలో పనిచేయడం జరుగుతోందని కంపెనీలు చెబుతున్నాయి. ఇక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా ఎనలిటిక్స్‌ వంటి కారణాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కారణంగా తమ కంపెనీలో త్వరలో 7,800 మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఐ.బి.ఎం సంస్థ సీఈఓ అరవింద్‌ కృష్ణ ఈ మధ్య స్వయంగా తెలియజేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా కొన్ని కంపెనీ, కార్యాలయ వ్యవహారాలను, మానవ వనరులకు సంబంధించిన కార్యకలాపాలను ఇప్పటికే విజయవంతంగా నిర్వర్తించడం జరుగుతోందని కూడా ఆయన వివరించారు.

- Advertisement -


అంతేకాదు, అనేక బడా వాణిజ్య సంస్థలు తమ దగ్గర పనిచేస్తున్న నైపుణ్యరహిత ఉద్యోగులను తొలగించి, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, టెక్‌ మెషీన్‌ నిర్వాహకులను ఎంపిక చేసుకునే ఉద్దేశంలో ఉన్నాయి. అటువంటి వారి కోసం అవి పెద్ద ఎత్తున అన్వేషణ సాగిస్తున్నాయి. భావి టెక్‌ సర్వీసులను, టెక్‌ పరికరాలను నేర్చుకుంటున్న విద్యావంతుల మీద అవి ప్రస్తుతం దృష్టి సారిస్తున్నాయి.వాస్తవానికి, నియామకాలకు సంబంధించి 2022లో కనిపించిన హడావిడి, ఊపు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. కొన్ని నియామక సంస్థలు అందజేసిన వివరాల ప్రకారం, బడా సంస్థల్లో 2.5 లక్షల ఉద్యోగాలకు అవకాశం ఉంది.అంతకు ముందు ఏడాది కన్నా ఇది లక్ష తక్కువ. మొత్తం మీద ఉద్యోగుల నియామకాల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ప్రస్తుతం కోవిడ్‌ సమయంలో ఎంత తక్కువగా నియామకాలు జరిగాయో ఇప్పుడు అదే స్థాయిలో నియామకాలు జరుగుతున్నాయి.
ఇంతవరకూ టెక్నాలజీ విజ్ఞానాన్ని అనుసరించని కంపెనీలు సైతం డిజిలిటీకరణకు, టెక్నాలజీకి మారుతుండడంతో ఐ.టి ఉద్యోగులకు డిమాండ్‌ ఏర్పడుతోంది. బ్యాంకింగ్‌, నాన్‌ బ్యాంకింగ్‌, ఆతిథ్య, ఆటోమొబైల్స్‌, ఉత్పత్తి, ఫార్మస్యూటికల్స్‌, విద్య తదితర రంగాలలో టెక్నాలజీ, డిజిటలీకరణ పెరుగుతుండడంతో, ఇందుకు సంబంధించిన ఉద్యోగాలను సృష్టించడం జరుగుతోంది. అత్యధికంగా ఐ.టి నైపుణ్యం కోసం వెతకడం ప్రారంభమైంది. అంటే, ఐ.టి నిపుణులకు, ఐ.టి.ఇ.ఎస్‌ నిపుణులకు ఇంకా డిమాండ్‌ ఉందని అర్థం చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరుగుతున్న ప్రభావం భారత్‌ మీద కూడా పడుతున్న నేపథ్యంలో ఉద్యోగాల సృష్టి అన్నది కత్తి మీద సాము కాబోతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News