రాష్ట్రంలో రెండవ దశ భూములు రీసర్వే చేపట్టిన 2వేల గ్రామాల్లో సెప్టెంబరు 30 నాటికి రీసర్వేను పూర్తి చేసి సరిహద్దు రాళ్ళు పాతడంతో పాటు భూహక్కు పత్రాలు పంపిణీని పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. జగనన్న భూహక్కు,రీసర్వే, ప్రయారిటీ భవనాలు, జగనన్నకు చెబుదాం అంశాలపై శనివారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు,జాయింట్ కలెక్టర్లతో సియం ముఖ్య సలహాదారు అజయ్ కల్లాంతో కలిసి సిఎస్ వీడియో సమావేశం నిర్వహించారు. అజెండాలో తొలుత భూహక్కు భూముల రీసర్వే పై కలెక్టర్లతో సమీక్షిస్తూ జిల్లాల వారీ ప్రగతిని కలెక్టర్లను అడిగి తెలుసు కున్నారు.ఈ రెండవ దశ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఒక టైం లైన్ ను పెట్టామని తెలిపారు.అదేమంటే వచ్చే జూలై 31నాటికి విలేజ్ సర్వేయర్ లాగిన్ డేటా ఎంట్రీని ప్రక్రియను పూర్తిచేయాలని చెప్పారు.అలాగే ఆగస్టు 31 నాటికి ఫైనల్ ఆర్ఓఆర్ ను పూర్తిచేసి పబ్లికేషన్ ను కూడా పూర్తి చేయాలని తెలిపారు. అదే విధంగా సెప్టెంబర్ 30 నాటికి రాళ్ళు పాతడంతో పాటు భూహక్కు పత్రాల పంపిణీని కూడా పూర్తి చేయాలని చెప్పారు.అక్టోబరు 15 నుండి రిజిస్ట్రేషన్లను ప్రారంభించాలని సిఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.ఈవిషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ద కనపర్చి నిర్దేశించిన గడవు ప్రకారం ఈప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా నిర్దిష్ట గడువు లోగా ఈప్రక్రియను పూర్తి చేసేందుకు కలెక్టర్,జెసి స్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.
ఈసమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు సిసిఎల్ఏ జి.సాయి ప్రసాద్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లాల వారీ భూహక్కు,రెండవ దశ భూరీ సర్వే జరుగుతున్న విధానాన్ని వివరించారు.ప్రతి రోజు దీనిపై కలెక్టర్లతో మానిటర్ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 2లక్షల మ్యుటేషన్లు 4లక్షల సబ్ డివిజన్లు జరిగాయని పేర్కొన్నారు.అంతేగాక ఐదారు లక్షల సరిహద్దు వివాదాలు పరిష్కారం అయ్యాయని చెప్పారు.
ముఖ్యమంత్రి వర్యుల ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం మాట్లాడుతూ ఎన్ఆర్ఐలకు సంబంధించిన భూమి పత్రాలను డిజిటల్ రూపంలో పంపాలని సూచించారు.దానిపై స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్ స్పందించి భూ యజమానులైన ఎన్ఆర్ఐలకు పీడీఎఫ్ రూపంలో పంపుతామని చెప్పారు.
రాష్ట్ర సర్వే మరియు సెటిల్మెంట్ శాఖ కమీషనర్ సిద్దార్థ జైన్ మాట్లాడుతూ
గతంలో సర్వే రాళ్ళను 13వ నోటిఫికేషన్ అయ్యాక పాతేవారని కాని ఇప్పుడు ఆర్ఓఆర్ పూర్తయ్యే వరకు వేచి చూడక ఏక కాలంలోనే పాతాలని చెప్పామని ఆవిధంగానే పనులు జరుగుతున్నాయని తెలిపారు.ఇప్పటికే 700 లకు పైగా గ్రామాల్లో ఆర్ఓఆర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.
ఈసమావేశంలో సియంఓ అదనపు కార్యదర్శి ఆర్.ముత్యాల రాజు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్లకు సూచించారు.అదనపు సిసిఎల్ఏ ఇంతియాజ్ భూహక్కు,రీసర్వే జరుగుతున్న తీరును పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
గ్రామ సచివాలయాల భవనాలు,రైతు భరోసా కేంద్రాల భవనాలను సెప్టెంబరు 15 నాటికి పూర్తి చేయాలి: సిఎస్.
రాష్ట్రంలో చేపట్టిన గ్రామ సచివాలయాల,రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలను సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లు ఆదేశించారు.కలక్టర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ ఈ గడువును దృష్టిలో ఉంచుకుని త్వరిత గతిన ఆనిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని స్పష్టం చేశారు.
వీడియో లింక్ ద్వారా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ ఇప్పటికే 6వేల 84 గ్రామ సచివాలయాల భవనాలు పూర్తి కాగా 1861 ఫినిషింగ్ స్థాయిలోను,825 రెండవ శ్లాబు స్థాయిలోను,523 రూప్ స్థాయిలోను,681 రూప్ లెయిడ్ స్థాయిలో ఉన్నాయని తెలిపారు.
వీడియో లింక్ ద్వారా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే 3వేల 609 భవనాలు పూర్తి కాగా 1100 బేస్మెంట్ స్థాయిలోను,966 రూప్ స్థాయిలోను ఉన్నట్టు వివరించారు.
వీడియో లింక్ ద్వారా పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యంటి. కృష్ణబాబు మాట్లాడుతూ 8321 వైయస్సార్ హెల్తు క్లినిక్ల భవనాల్లో 2246 ఈనెలాఖరు లోగా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. కాగా 632 బిలో బేస్మెంట్ లెవెల్,1571 బేస్మెంట్ స్థాయిలోను ఉన్నట్టు చెప్పారు.
జగనన్నకు చెబుదాం కింద వచ్చే ఫిర్యాదులను త్వరిత గతిన పరిష్కరించండి: సిఎస్.
జగనన్నకు చెబుదాం కింద వచ్చే ఫిర్యాదులను త్వరిత గతిన పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లును ఆదేశించారు.కలక్టర్ల తో నిర్వహించిన వీడియో సమావేశంలో ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ ముఖ్యం గా ఆర్థికేతర అవసరాలకు సంబంధించిన అంశాలను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు.
ఈసమావేశంలో సియంఓ పియంయు డిప్యూటీ కలెక్టర్ భవాని శంకర్ మాట్లాడుతూ గత మేనెలలో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటి వరకూ 74వేల 168 ఫిర్యాదులు రాగా వాటిలో 53 వేల వరకూ పరిష్కారం అయ్యాయని చెప్పారు.70 శాతం వరకు ఫిర్యాదులు రెవెన్యూ,పిఆర్ అండ్ ఆర్డి, ఇంధన,ఎంఏయుడి,హోం శాఖలకు సంబంధించినవే ఉన్నాయని పేర్కొన్నారు.అంతే గాక ఫిర్యాదుల్లో అధికశాతం ఆర్థికేతర అవసరాలకు సంబంధించినవే ఉంటున్నా యని తెలిపారు.
ఈవీడియో సమావేశంలో వివిధ జిల్లాల కలెక్టర్లు,జెసిలు తదితరులు పాల్గొనగా సిసిఎల్ఏ జాయింట్ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.