వీకెండ్ వచ్చిందంటే ఫుల్లుగా తాగి పడిపోవాలి. కానీ, తాగితే కాలేయం పాడైపోతుంది. కిడ్నీలూ పోతాయి. పైపెచ్చు పొద్దున్నే హ్యాంగోవర్ ఒకటి.. తల మొత్తం పట్టేస్తుంది. వీటన్నింటి బదులు తాగకుండా ఉంటేనే నయం అనిపిస్తోందా? మరి మీలాంటి మందుబాబుల కోసమే వచ్చేసింది.. సరికొత్త మద్యం. ఇది తాగినా కూడా కాలేయం, కిడ్నీలకు ఎలాంటి ప్రమాదం ఉండదు. హ్యాంగోవర్ అన్న మాటే వినిపించదు. పైపెచ్చు, దీనికి వార్ధక్య లక్షణాలను నివారించే గుణం కూడా ఉండటం మరింత అదనపు ప్రయోజనం. మరి ఇలాంటి మందు ఎక్కడ దొరుకుతుందా అని చూస్తున్నారా? ఆలస్యం ఎందుకు, వెంటనే ఒడిశా వెళ్లిపొండి. అవును.. జూనియర్ అభిషేక్ హెర్బల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఓ సంస్థ ఒడిశా రాష్ట్రంలో తన మొట్టమొదటి లిక్కర్ బ్రాండ్లను ఇటీవల విడుదల చేసింది. కార్డియల్ ప్రైడ్ విస్కీ, కార్డియల్ వైట్ రమ్ అనే బ్రాండ్లతో ఆరోగ్యానికి ప్రయోజనం కూడా ఉంటుందని నాగపూర్‌కు చెందిన ఈ సంస్థ చెబుతోంది. ఇవి కాలేయం, కిడ్నీలపై ఎలాంటి దుష్ప్రభావం చూపవట. పైపెచ్చు వీటికి వార్ధక్య లక్షణాలను నివారించే గుణాలూ ఉంటాయని, హ్యాంగోవర్ అన్నది అస్సలు ఉండదని ఈ కంపెనీ గ్యారంటీ ఇస్తోంది.
ప్రీమియం విస్కీ
కార్డియల్ ప్రైడ్ అనేది ఐదు సంవత్సరాల మాల్ట్, రెండు వేర్వేరు మాల్ట్ లతో కలిపిన ప్రీమియం విస్కీ. ఇందులో కాస్త మట్టివాసన, పొగ, కుంకుమపువ్వు, ఇతర సహజ సువాసనల రుచిని అందించే ప్రత్యేకమైన మూలికలు ఉంటాయి. ఇందులో ఆల్కహాల్ 42.8% ఉన్నా.. తాగడానికి చాలా సరళంగా ఉంటుంది, ఉదరంపై ఎలాంటి ప్రభావం చూపదు.
ఈ రమ్‌తో ఎంతో మేలు
కార్డియల్ వైట్ రమ్ ప్రత్యేకంగా, భిన్నంగా ఉంటుంది. వివిధ సీజన్ల ప్రభావాలకు అనుగుణంగా రుచి సున్నితంగా ఉంటుంది. శీతాకాలంలో ఈ రమ్ 7 నుంచి 8 గంటల పాటు శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతుంది. అదే వేసవిలో అయితే, లోపల అంతా చల్లగా ఉంటుంది. ఇది తాగేవారికి వేసవిలో వడదెబ్బ గానీ, శీతాకాలంలో హైపో థర్మియా గానీ వచ్చే అవకాశం లేనే లేదని కంపెనీ చెబుతోంది.
కాలేయానికి రక్షణ
ఇందులోని పదార్థాలన్నింటినీ చాలా తెలివిగా రూపొందించారు. ఇది ఆల్డిహైడ్లను నియంత్రిస్తుంది. సాధారణంగా రోజూ మద్యం తాగేవారికి అప్పటికప్పుడు లేదా దీర్ఘకాలంలో సంభవించే కాలేయ వ్యాధులు రాకుండా ఇది ఆపుతుంది.
కిడ్నీలకూ అభయం
ఈ ఉత్పత్తులు మూత్రపిండాలపై ఎలాంటి ప్రభావం చూపవని కంపెనీ తెలిపింది. సాధారణంగా మనం మద్యం తాగినప్పుడు మూత్రపిండాలపై ఒత్తిడి పడుతుంది. మద్యపానం వల్ల మూత్రపిండాల లోపలి భాగాలపై ఒత్తిడి పెరిగి, కొన్ని రక్త కణాలను శోషించుకుంటుంది. ఫలితంగా మూత్రం పసుపు రంగులో వస్తుంది. కానీ ఈ మద్యం తాగిన తర్వాత మీరు చూసుకుంటే.. మూత్రం ఎలాంటి రంగు లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది. అంటే, మీ కిడ్నీలు సురక్షితంగా ఉన్నాయని అర్థం.
యాంటీ ఆక్సిడెంట్లు
మామూలుగా అయితే మద్యం తాగినవాళ్లు బాగా రెచ్చిపోతారు. కానీ ఈ మద్యం మాత్రం అలాంటి లక్షణాలను కూడా నియంత్రిస్తుంది. ఇందులో ఉండే యాంటీ-యాంగ్జైటీ ఆక్సిడెంట్ వల్ల.. తాగినవాళ్లు దూకుడుగా ఉండరు. ఇది వాళ్లను ఎప్పటికీ తాజాగానే ఉంచుతుంది. ఈ మద్యాన్ని తాగినవాళ్లు అతిగా తినరు కూడా. దానివల్ల ఉదరంలో ఆమ్లం ఎక్కువగా విడుదలై ఎసిడిటీ రావడం లాంటివి కూడా ఉండవు.
హ్యాంగోవర్ ఉండనే ఉండదు
ఈ మద్యం లేబుల్ మీదే స్పష్టంగా ‘హ్యాంగోవర్ ఉండదు’ అనే హామీ ముద్రిస్తారు. సాధారణంగా అయితే మద్యంలో ఉండే కొన్నిరకాల పదార్థాల వల్లే హ్యాంగోవర్ వస్తుంది. కానీ, తమ మద్యంలో అలాంటి పనికిమాలిన పదార్థాలు ఉండవని కంపెనీ స్పష్టం చేసింది. తాము దాదాపు 20 ఏళ్ల పరిశోధన తర్వాత అన్ని పదార్థాలను ఎంపిక చేశామని, తాగే వ్యక్తికి ఆ మత్తు కేవలం 7 నుంచి 8 గంటలు మాత్రమే ఉంటుందని పేర్కొంది. అంటే, రాత్రి తాగితే పొద్దున్న ఫ్రెష్‌గా నిద్ర లేవచ్చన్న మాట.
వార్ధక్యానికి చెక్
వయసు మీద పడే కొద్దీ ముఖం మీద ముడతలు వస్తాయి, అలాగే చర్మం కాంతిని కోల్పోతుంది. కానీ, మూడు నెలల పాటు క్రమం తప్పకుండా కొద్ది మోతాదులో తమ మద్యం తాగితే.. ఇందులో ఉండే మూలికా గుణాల వల్ల చర్మం మరింత ప్రకాశవంతంగా మారుతుందని చెబుతున్నారు. అంటే, ముఖంలో కాంతి పెరుగుతుందన్న మాట. తద్వారా వార్ధక్యానికి చెక్ పెట్టొచ్చు. పైపెచ్చు, ఇలా తాగడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కూడా ఉండవని హామీ ఇస్తున్నారు.
ధర కూడా మరీ ఎక్కువ కాదు
కార్డియల్ ప్రైడ్ విస్కీ 750 మిల్లీలీటర్ల ధర రూ.1250 ఉంటుంది, అలాగే కార్డియల్ వైట్ రమ్ అయితే రూ.900 ఉంటుంది. 180, 375 మిల్లీలీటర్ల బాటిళ్లు కూడా విడుదల చేశారు. త్వరలోనే మరికొన్ని ఉత్పత్తులు కూడా దాదాపు ఇలాగే అందుబాటు ధరల్లో విడుదల చేస్తామని జూనియర్ అభిషేక్ హెర్బల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ అనిరుద్ధ కపాలే చెప్పారు.