బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో పాట్నాలో జరిగిన బృహత్ సమావేశం ప్రతిపక్షాల ఐక్యతకు సంబంధించినంత వరకూ ఒక పెద్ద శుభ పరిణామమేనని చెప్పవచ్చు. భిన్న సిద్ధాంతాలు, పరస్పర వైరాలు, విభిన్న దృక్పథాలు కలిగిన పార్టీల్లో సుమారు 15 పార్టీలు ఒక్క తాటి మీదకు రావడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. 2024 ఎన్నికల దిశగా మొత్తానికి మొదటి పడిందనే అనుకోవాలి. పంచాయతీ ఎన్నికల్లో సైతం అటు వామపక్షాలతోనూ, ఇటు బీజేపీ, కాంగ్రెస్‌లతోనూ అలుపెరుగని పోరాటం సాగిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ పార్టీ కూడా ప్రతిపక్షాల కూటమికి మద్దతునివ్వడానికి సిద్ధంగా ఉందని ప్రకటించడం విశేషం. బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. కాగా, వివిధ పార్టీల మధ్య విభేదాలున్న మాట నిజమేనని,అయితే, ఈ చిన్నా చితకా సమస్యలను అధిగమించడానికి, పరిష్కరించడానికి తాము కూడా కృషిచేస్తామని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ ప్రతిపక్ష సమావేశంలో పాల్గొన్న ప్రతిపక్ష నాయకులంతా దాదాపు ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత తామంతా సిమ్లాలో మరోసారి సమావేశం కావాలని ప్రతిపక్షాల నాయకులంతా తీర్మానించారు.
తమకు తటస్థ నగరమైన పాట్నా నుంచి కాంగ్రెస్‌కు అత్యంత అనుకూలమైన సిమ్లాకు సమావేశ స్థలాన్ని మార్చడం సహజంగానే అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాల ఐక్యతకు కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద అడ్డంకిగా తయారైందని అంతా భావిస్తున్న నేపథ్యంలో ఈ రకమైన నిర్ణయం అభినందనీయమైన పరిణామమే. కాగా, ఆదిలోనే హంసపాదు మాదిరిగా అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశంలో పాల్గొన్న తర్వాత పత్రికా విలేఖరుల సమావేశంలో పాల్గొనకపోవడం అనుమానాలకు దారితీసింది. ఈ విలేఖరుల సమావేశంలో ప్రతిపక్ష నాయకులంతా పాల్గొనడం జరిగింది. విలేఖరులను కలుసుకునే ముందు ప్రతిపక్ష నాయకుల మధ్య జరిగిన సమావేశంలోఅరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ అభిప్రాయమేమిటని నిలదీశారు. దీనిపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి కాంగ్రెస్ అంగీకరించకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ విలేఖరుల సమావేశాన్ని బహిష్కరించింది.
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల అభిప్రాయభేదాల విషయం ఎలా ఉన్నప్పటికీ, 2024 ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రతిపక్షాలు దాదాపు ఒకే తాటి మీదకు వస్తూండడం అభినందించాల్సిన విషయంగానే కనిపిస్తోంది.పాట్నా సమావేశం ఇందుకు చాలావరకు మార్గం సుగమం చేసింది కానీ, ‘ముందున్నది ముసర్ల పండుగ’ అని ఎవరికైనా అనిపిస్తుంది. ప్రతిపక్షాల ఐక్యతకు పెనుసవాళ్లు ఎదురు రావడం ఖాయమనిపిస్తోంది. సమన్వయ సంఘాన్ని ఏర్పాటు చేయడం, ఒక ఉమ్మడి కనీస కార్యక్రమాన్ని రూపొందించడం తేలికగా జరిగిపోవచ్చు కానీ, ఎన్నికల వరకూ ఈ కూటమి కొనసాగడం, సైద్ధాంతిక, రాజకీయ విభేదాలను పరిష్కరించుకోవడం అంత తేలికైన వ్యవహారం కాకపోవచ్చు. ముఖ్యంగా బీజేపీతో ముఖాముఖీ పోరాటానికి అభ్యర్థులను ఎంపిక చేసుకునే విషయంలో పార్టీలు ఒక్క తాటి మీద నడుస్తాయా అన్నది సందేహమే. సుమారు 300 లోక్‌సభ స్థానాలలో బీజేపీకి ఎదురుగా ఉమ్మడిఅభ్యర్థులను నిలబెట్టడానికి పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. అయితే, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీపై వామపక్ష లేదా కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టడానికి మమతా బెనర్జీ అంగీకరిస్తారా అన్నది వేచి చూడాల్సిన విషయమే. అంతేకాక, ఢిల్లీ, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలలో బీజేపీ అభ్యర్థులపై కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టడానికి, ఆ అభ్యర్థులకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతునివ్వడానికి కేజ్రీవాల్ అంగీకరిస్తారా లేదా అన్నది కూడా అనుమానించాల్సిన అంశమే.
ఈకూటమిలో మరికొన్ని ప్రతిపక్షాలు చేరాల్సి ఉంది. అవి చేరతాయా లేదా అన్నది అర్థం కావడం లేదు. ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని పాలక పక్షాలు ఈ పాట్నా సమావేశంలో పాల్గొనలేదు. బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఈ సమావేశానికి దూరంగానే ఉంది. ప్రతిపక్షాల ఐక్యత పటిష్ఠం అవుతున్న కొద్దీ ఇందులో చేరే పార్టీల సంఖ్య పెరుగుతుందని ప్రధాన ప్రతిపక్షాలు ఆశాభావంతో ఉన్నాయి. అది ఎంత వరకూ సఫలీకృతం అవుతుందన్నది కూడా అనుమానమే. పార్టీలకు వాటి నమ్మకం వాటికి ఉండవచ్చు. కానీ, జనతా పార్టీ అనుభవం చూసిన ప్రజలు ఈ కూటమిని ఎంత వరకూ ఆదరిస్తారన్నది, ఎంత వరకూ నమ్ముతారన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే.
Alliances politics: సంకీర్ణం ముందు పెను సవాళ్లు
15 పార్టీలు ఒక్క తాటి మీదకు రావడమంటే ఆషామాషీ కాదు