Friday, November 22, 2024
Homeహెల్త్Tanning: ట్యాన్ పోవాలంటే?

Tanning: ట్యాన్ పోవాలంటే?

సూర్యరశ్మితో ట్యాన్ అవుతుంది, చర్మాన్ని బాగా దెబ్బతీస్తుంది

ట్యాన్ స్కిన్ ఉందా? ఆందోళన చెందొద్దు. వాటిని పోగొట్టడానికి ఇంటి వద్దే చేసుకునే టిప్స్ కొన్ని ఉన్నాయి. సూర్యరశ్మి వల్ల చర్మం నల్లబడుతుంది. ముఖ్యంగా ముఖంపై ఈ ప్రభావం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. కొందరి చర్మం తొందరగా ట్యానింగ్ కు గురవుతుంది. సూర్యరశ్మి వల్ల ఏర్పడ్డ ట్యాన్ శాశ్వతంగా ఉండదు కానీ అతినీలలోహికత కిరణాలు చర్మాన్ని బాగా దెబ్బతినేలా చేస్తాయి.

- Advertisement -

సూర్యరశ్మి వల్ల చర్మం దెబ్బతిని హైపర్ పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది. సూర్యరశ్మి ముఖంపై, చర్మంపై పడకుండా టోపి, స్కార్ఫ్ ధరించడం, సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం, పొడుగు స్లీవ్స్ ఉన్న దుస్తులు ధరించడం వంటి సురక్షిత మార్గాలు ఎన్నో ఉన్నాయి. బయటకు వెళ్లే ముందు సన్ స్కీన్ రాసుకోవడం మరువకూడదు.

అలాగే ట్యాన్ నివారణకు ట్రీట్మెంట్లు కూడా ఉన్నాయి. వాటిల్లో ఎక్స్ ఫొయిలేషన్ ఒకటి. ఇది చర్మంపై పేరుకున్న మ్రుతకణాలను పోగొడుతుంది. దీంతో చర్మం, స్కిన్ టోన్ శుభ్రంగా ఉంటుంది. కెమికల్ పీల్స్ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. చర్మంలోని అనవసరమైన మెలనిన్ ను ఇవి తొలగిస్తాయి. మెలస్మా వంటి కండిషన్లకు కూడా ఇవి చికిత్సనందిస్తాయి. వీటివల్ల చర్మం ఎంతో శుభ్రంగా ఉండడంతో పాటు సహజసిద్ధమైన కాంప్లెక్షన్ ను చర్మం పొందుతుంది. కెమికల్ ట్రీట్మెంట్ తర్వాత చర్మానికి తప్పనిసరిగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.  ఎందుకంటే సరిపడినంత మాయిశ్చరైజర్ చర్మానికి అందకపోతే చర్మంపై నల్లమచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. లేజర్ ట్రీట్మెంట్లు వల్ల కూడా సన్ ట్యాన్ పోతుంది. ట్యానింగ్ వల్ల తలెత్తిన స్కిన్ టోన్ అసమానత కూడా పరిష్కరమవుతుంది. చర్మం పైపొర పొడిబారడాన్ని, అలాగే చర్మంపై ఉండే మ్రుతకణాల సమస్యను కూడా ఇది పోగొడుతుంది. చర్మాన్ని కాంతివంతం చేయడంతోపాటు స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది కూడా.

ముఖ్యంగా క్లిష్టతరమైన ప్రదేశాల్లోని స్కిన్ టోన్ ని పక్కాగా కాంతివంతం చేయడంలో లేజర్ థెరపీ ఎంతో శక్తివతంతంగా పనిచేస్తుంది. యాక్నే మచ్చలను ఇది పోగొడుతుంది. మచ్చలను నివారిస్తుంది. ట్యానింగ్ ను పోగొట్టే వాటిల్లో బ్లీచింగ్ ట్రీట్మెంట్ మరొకటి. ఇది ముఖాన్ని వేగంగా కాంతివంతం చేయడంతో పాటు స్కిన్ టోన్ ను బాగుచేస్తుంది. అయితే రెగ్యులర్ గా బ్లీచింగ్

చేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే బ్లీచింగ్ లోని రసాయనాలు చర్మానికి హాని కలిగించే ప్రమాదం ఉంది. చర్మానికి తేమ అందడం వల్ల కూడా చర్మం మ్రుదువుగా, పట్టులా మెత్తగా ఉంటుంది. హైడ్రేషన్ చర్మకణాలను ఉత్తేజితం చేస్తుంది. దీంతో ఎక్స్ ఫొయలేషన్ ప్రక్రియ సులభమై చర్మంపై ఉండే మ్రుతకణాలు సులభంగా పోతాయి. ఇంటి చిట్కాలకొస్తే టొమాటోలు ట్యానింగ్ ను పోగట్టడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. టొమాటాల్లోని ఫైటోకెమికల్స్ అతినీలలోహిత కిరణాల వల్ల దెబ్బతిన్న చర్మంపై ఎంతో శక్తివంతంగా పోరాడతాయి. ఈ కాంపౌడ్స్ ట్యాన్ ను తగ్గిస్తాయి. అంతేకాదు సహజసిద్ధమైన మీ స్కిన్ టోన్ ను తిరిగి పునరుద్ధరిస్తాయి.

ఒకటి లేదా రెండు టొమోటాలు తీసుకుని అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి పేస్టులా చేసి దాన్ని ముఖంపై మరీ ముఖ్యంగా ట్యాన్ ఉన్న ప్రదేశాల్లో పూయాలి.  తర్వాత 20 నిమిషాలు దాన్ని అలాగే వదిలేసి తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. నిమ్మరసం కూడా ట్యాన్ పై బాగా పనిచేస్తుంది. నిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది పిగ్మెంటేషన్ ను తగ్గించి మీ చర్మం రంగును పునరుద్ధరించడమే కాకుండా ట్యాన్ ను తగ్గిస్తుంది. ఇందుకు ఒక నిమ్మకాయ, ఒక కాటన్ ప్యాడ్ ని రెడీగా పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నిమ్మరసం పిండి కాటన్ ప్యాడ్ ను అందులో ముంచి ట్యాన్ ఉన్న ప్రదేశాలపై దానితో సున్నితంగా రాయాలి. తర్వాత ఇరవై నిమిషాలు దాన్ని అలాగే ఉంచి తర్వాత నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. అయితే ఇది వేసుకోబోయే ముందు ప్యాచ్ టెస్టు చేసుకోవాలి.

అలొవిరా కూడా ట్యానింగ్ పై బాగా పనిచేస్తుంది. ఇది పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది. చర్మానికి ఆరోగ్యవంతమైన మెరుపును అందిస్తుంది. ఇందులో కీరకాయను కూడా కలపాలి. ఒక టేబుల్ స్పూన్ అలొవిరా జెల్, ఒక కీరకాయ, ఒక టేబుల్ స్పూన్ తేనె మూడింటినీ రెడీ పెట్టుకోవాలి. కీరకాయను బాగా మెత్తగా చేసి అందులో తేనె, అలొవిరా జెల్ కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. ఆ పేస్టును ట్యాన్డ్ ప్రదేశంలో పూసి 20 నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత ముఖాన్ని నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. దీనిని వారానికి రెండుసార్లు ట్యాన్ ఉన్న ప్రదేశాలలో అప్లై చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. బొప్పాయి కూడా ఈ సమస్యను పరిష్కరిస్తుంది. ఎక్స్ ఫొయిలేషన్ కు బొప్పాయి ఎంతో బాగా పనిచేస్తుంది. చర్మంపై ఉండే మ్రుతకణాలను పోగొట్టడంతో పాటు చర్మం యొక్క సహజసిద్ధమైన స్కిన్ టోన్ ను పునరుద్ధరిస్తుంది.

ఇందుకు ఒక పండిన బొప్పాయి పండును, ఒక నిమ్మకాయను రెడీ పెట్టుకోవాలి. బొప్పాయి పండును బ్లెండ్ చేసి మెత్తటి గుజ్జులా చేయాలి. అందులో నిమ్మరసం కలిపి ఆ పేస్టను ట్యాన్ ఉన్న ప్రదేశంలో పూసి పది నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. దీన్ని వారానికి రెండుసార్లు ట్యాన్ ఉన్న ప్రదేశంలో పూస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే తేనె కూడా ట్యాన్ ను పోగొడుతుంది. తేనె చర్మానికి కావలసిన మాయిశ్చరైజర్ ని అందించడమే కాకుండా స్కిన్ టోన్ ను  మెరుగుపరుస్తుంది. ఒక నిమ్మకాయ, ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకోవాలి. తేనెలో టీస్పూన్ నిమ్మరసం కలిపి ఆ పేస్టును ట్యాన్ ఉన్న ప్రదేశంలో రాయాలి. దాన్ని 20 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. బ్లాక్ టీ సూర్యరశ్మి వల్ల తలెత్తే హానికరమైన ప్రభావాల నుంచి రక్షిస్తుంది. ఒక టీస్పూన్ బ్లాక్ టీ, పావు టీస్పూను పసుపు, ఒక టీస్పూను శెనగపిండి ఈ మూడింటినీ కలిపి కొద్దిగా నీళ్లను కూడా అందులో చేర్చి పేస్టులా చేయాలి. దాన్ని ముఖంపై ట్యాన్ ఉన్న ప్రదేశాల్లో రాసి పదిహేను నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత నీళ్లతో శుభ్రంగా కడగాలి. ఇలా చేస్తే ట్యాన్ పోతుంది.

ఈ విషయంలో కకుంకుమప్వు కూడా బాగా పనిచేస్తుంది. మూడు నాలుగు కుంకుమపువ్వు ముక్కలు, పావు కప్పు పాలు తీసుకోవాలి. పాలల్లో కుంకుమపువ్వు ముక్కలను రెండు గంటలు నానబెట్టి తర్వాత అందులోంచి కుంకుమపువ్వు కాడలను తీసేసి ఆ పాలను ట్యాన్ ఉన్న ప్రదేశంలో రాయాలి. పదిహేను నిమిషాలు అలాగే ఉండి ఆ తర్వాత నీళ్లతో ట్యాన్ ఉన్న భాగాలను శుభ్రంగా కడగాలి. కమలాపండు పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది. ట్యాన్ ను పోగొడుతుంది. ఇందుకు ఒక టీస్పూను కమలాపండు పొడి, పావు టీస్పూను పసుపు, ఒక టీస్పూను తేనె మూడింటినీ తీసుకుని మెత్తటి పేస్టులా చేసి దాన్నిట్యాన్ ఉన్న చోట రాసి ఐదు నుంచి పదినిమిషాలు అలాగే వదిలేయాలి. ఆతర్వాత నీటితో ఆ ప్రదేశాన్ని శుభ్రంగా కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరినూనె కూడా ట్యానింగ్ ను తగ్గిస్తుంది. ఇందుకు ఒక టీస్పూను కొబ్బరినూనె, నాలుగు లేదా ఐదు బాదం పప్పులు తీసుకుని బాగా పొడి చేసి పెట్టుకోవాలి, అలాగే ఒక టీస్పూను చక్కెర తీసుకోవాలి. ఇవన్నీ కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. ఈ స్క్రబ్ ను ముఖానికి, మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ట్యానింగ్ తగ్గుతుంది. అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని పేస్టులా చేసి ట్యాన్ ఉన్న ప్రదేశాల్లో రాసుకుని 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీళ్లతో ఆ ప్రదేశాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి ఒకసారి చేసుకోవాలి. ఇలా మీరు కూడా ట్యాన్ సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News