Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Gunturu Seshendra Sarma: గుంటూరు శేషేంద్ర శర్మ రచనలు, విశ్లేషణ

Gunturu Seshendra Sarma: గుంటూరు శేషేంద్ర శర్మ రచనలు, విశ్లేషణ

భారతీయ సాహిత్య చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించినట్లైతే ప్రపంచ సాహిత్యం మొత్తం కలిపినా భారతీయ సాహిత్యానికి సరితూగదు. అది ఏ భాషలో ఐనా, మన సాహిత్య చరిత్ర అంత గొప్పది. సంస్కృతము, పాకృతము, ప్రాంతీయ భాష లైన బెంగాలి, మలయాళము, తెలుగు, తమిళ సాహిత్యము మొదలైనవన్ని ప్రపంచాన్ని ప్రభావితం చేయగల్గిన సాహిత్యము, ఆయా భాషల నుండి వచ్చిందనే చెప్పాలి. సాహిత్యరంగంలో అత్యంత ప్రామాణికంగా భావింపబడే నోబెల్‌ సాహిత్య బహుమతిని 1913వ సంవత్సరములో గీతాంజలి కావ్యమునకుగాను జాతీయ గీతము రూపకర్త అయిన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌కి వరించడం ఆనందం కల్గించే విషయము. ఆసియా ఖండంలో మొదటి సాహిత్య బహుమతి పొందిన వ్యక్తిగా రికార్డులకెక్కడం హర్షించదగ్గ విషయమే ఐనప్పటికీ, ఈ నూట పది సంవత్సరాల నోబెల్‌ సాహిత్య చరిత్రలో భారతీయ సాహిత్యము నుండి నోబెల్‌ బహుమతిని రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ అనంతరం ఎవరు పొందలేదు. నోబెల్‌ బహుమతిని పొందలేని ప్రామాణికత లేని సాహిత్యము ఉందా అంటే లేదనే చెప్పాలి. అంతెందుకు తెలుగు సాహిత్యము నుండి 2004వ సంవత్సరములో గుంటూరు శేషేంద్ర శర్మ గారి ‘నా దేశం నా ప్రజలు’ కావ్యము నోబెల్‌ సాహిత్య బహుమతికి నామినేట్‌ కావడం, తెలుగు సాహిత్యము యొక్క గొప్పతనము. ఇంతటి మహత్తరమైన కావ్యమునకు దక్కిన గౌరవముగా భావించాలి. ఏది ఏమైనప్పటికీ నోబెల్‌ సాహిత్య బహుమతి రాకపోవడం బాధ కల్గించే విషయమే ఐనప్పటికీ, కేంద్ర ప్రభుత్వము అలాంటి గొప్ప కావ్యమునకు కనీసం జ్ఞానపీట్‌ అవార్డు ప్రకటించకపోవడం తెలు గు సాహిత్యమును అగౌరవపరిచినట్లే, ఇప్పటి వరకు తెలుగు సాహిత్యములో ముగ్గురికి మాత్రమే జ్ఞానపీట్‌ అవార్డు రావడం అంటే ఆలోచించాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. జ్ఞాన పీట్‌ అవార్డు పొందలేని నాసిరకమైన రచనలు ఉన్నాయా? అవా ర్డు పొందినవారు మాత్రమే ప్రామాణికమైన రచనలు చేశారా? అంటే అదీ లేదు, అలా అని అవార్డు పొందిన కావ్యాలపై నేను ఏ విధమైన విమర్శ చేయాలని కాదు. వాస్తవం చేదుగా ఉంటుదనేది, ఎంత నిజమో అందరికి తెలిసినదే, ఏది ఏమైనప్పటికీ శేషేంద్ర శర్మ లాంటి కవులు తెలుగు సాహిత్యంలో కన్పించే, మబ్బుచాటు జాబిలిలా అరుదైన వ్యక్తిత్వంలో అరుదైన కవిగా గుర్తింపబడడం గొప్ప విషయం. భావకవిత్వానికి కృష్ణశాస్త్రి ఆధ్యుడైతే అభ్యుదయ కవిత్వానికి శ్రీశ్రీ మార్గదర్శి ఐతే కొత్తపాతల మేలుకలయిక అన్న ట్లుగా ఇద్దరిని సమన్వయం చేసుకొని తన సాహిత్య ప్రస్థానం కొన సాగించిన బహుముఖ ప్రజ్ఞాశాలి శేషేంద్ర శర్మ.

- Advertisement -

వీరు 1927 అక్టోబర్‌ 20న, నెల్లూరు జిల్లా నాగరాజుపాడు గ్రామంలో జాతీయోద్యమం ఉదృతంగా సాగుతున్న కాలంలో జన్మించారు. సహజంగా ఆ ప్రభావం ఆ కాలంలో జన్మించిన వారందరిపై పడింది దానికి శేషేంద్ర శర్మ మినహాయింపు కాదు. ఆ రోజులలోనే గుంటూరులోని అంధ్ర క్రిస్టియన్‌ కళాశాలలో బీ.ఏ పట్టభద్రులు. మద్రాసు యూనివర్సిటీ నుండి లా పూర్తిచేసి, 37 సం.రాలు మున్సిపల్‌ కమీషనర్‌గా సేవలందించి మంచి గుర్తింపు పొందారు. నా దేశం నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాలరేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్‌ మొదలైన రచనలు చేసి తెలుగు సాహిత్య చరిత్రపై బలమైన ముద్రను వేశారు. కవిత్వంలో సాహిత్య విమర్శలో విలక్షణమైనశైలి వీరి సొంతం. కవికి ఉండవలసిన లక్షణాలు కవిత్వానికి తీసుకోవా ల్సిన అంశాలు, కవిత్వ లక్షణాలు కావ్యప్రయోజనం ఒక్క మాట లో చెప్పాలంటే శేషేంద్ర శర్మగారి రచనలో కవిసేన మేనిఫెస్టో ఆధునిక కావ్య శాస్త్రముగా నిలబడే అద్భుతమైన రచన దీని ద్వార నేను చాలా విషయాలు తెల్సుకోగల్గినందుకు గర్వపడుతున్న. కమ్యునిష్టులకు మేనిఫెస్టో ఎలాంటిదో కవులకు కవిసేన మేనిఫెస్టో కూడా అలాంటిదే. కొత్తతరం కవులకు, టానిక్‌ లాగా ఉపయోగ పడ్తుందని ఖచ్చింతంగా చెప్పగలను, కవికి ఎలాంటి మేనిఫెస్టో వుండాలి ఎలాంటివి ఉండకూడదు లాంటి అనేక అంశాలు ఈ పుస్తకంలో పొందుపరచిన విధానం వర్తమాన రచయితలకు ఉప యోగం. ఏదో ఒకటి రెండు కవితలు, రచనలు చేసి కాలర్‌ ఎగరే స్తున్న ఈ కాలం రచయితలకు ఈ పుస్తకం చదివితే కాస్తైన జ్ఞానో దయం అవుతుందనేది నా అభిప్రాయం. వారు ఎక్కడ తప్పు చేస్తు న్నారో దీని ద్వారా తెలుసుకోగలరు.
ఓ నా ప్రజలారా !
రండి మీకో కొత్త పద్యం ఇస్తా
ఈ పద్యం మాకో కొత్త ప్రాణం ఇస్తుంది
కొత్త ప్రయాణం చేస్తుంది అంటాడు ఆత్మ విశ్వాసంతో శేషేం ద్ర శర్మ. ప్రపంచానికి తెలియని విషయాలను ఎరుకచేప్పే వాడే కవి అదీ వైవిధ్యముగా, నిత్య నూతనముగా వినసొంపుగా వుండిన ప్పుడు అందరికి చేరుతుంది. దాని ప్రభావం సమాజం మీద తప్ప కుండా ఉంటుంది. దాన్ని ఎవరు కాదనలేరు కూడా. దీనికి ఉదా హరణగా మధ్య యుగాల తర్వాత వచ్చిన అనేక విప్లవాలు, ఉద్య మాలు వివిధ రచనలు చదివిన యువత వాటి ద్వారా ప్రభావితం కావటమే అందుకే కవి అన్ని తరాలను ప్రభావితం చేయగల్గే రచన చేయాలి. అది తరతరాలుగా సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటుంది అంటాడు.
రాత్రి పిండారబోసినట్లు వెన్నెలకాస్తుంది
రాత్రి నగ్నంగా వెన్నెల్లో స్నానం చేస్తుంది.
పై రెండు వాక్యాల్లో ఉన్న తేడాలు గమనిస్తే ఇందులో సహజ మైనది ఎదో ప్రత్యేకమైనది ఏదో ఇట్టే పసిగట్టవచ్చును. అందుకే కవికి ప్రత్యేకమైన శైలి ఉండాలని సూచించారు. కాలం అంటే కర్రపుల్ల కాదని, అది డబ్బు సంపాదించే యంత్రం కాదని అలాగే మంత్రదండం మరియు కీర్తిశిఖరాలను ఎక్కించే సోపానం కాదని, కవిత్వమంటే మహోజ్వల కాంతిచ్చటల్ని విరజిమ్మే వజ్రాయుధ మని, ఒక సముద్ధండగాండీవమని వారి అభిప్రాయం.
నేనంతా కలిసితే
పిడికెడు మట్టే కావచ్చు
కానీ కలమెత్తితే
ఒక దేశం జెండాకున్న పోగరుంటుంది నాకు
అని ఆత్మ విశ్వాసంలో ప్రకటించిన కవి శేషేంద్ర గారు. కొద్ది మంది ఈ వాక్యాలను అహంభావంతో అన్నమాటలుగా చెప్పారు కాని ప్రతి దేశానికి జెండా ఉంటుంది అది ప్రజల విశ్వాసాలకు ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ప్రతిక ఆదేశపు జెండా. అందుకే ఒక దేషపు జెండాకు ఉండే గౌరవం ఎలాంటిదో కవికి కూడా అలాంటి పొగరు అహంకారం, గర్వం ఉండాలంటాడు. కవి కూడా దేశంలో భాగమే దేశభక్తుడు కూడా కాబట్టి ఎవరికీ వంగి సలాం చేయా ల్సిన పనిలేదు, కలం పట్టినప్పుడల్లా గర్వంగా నిలబడతానని స్వయంగా చెప్పుకున్నాడు.
కాలాన్ని నా కాగితం చేసుకుంటా
దాని మీద లోకానికి స్వప్నం రాసి ఇస్తా
దాని కింద నా ఊపిరితో సంతకం చేస్తా
శేషేంద్ర శర్మ స్వప్నం బహు స్వచ్చం అసమానతలు లేని సమాజ నిర్మాణం జరగాలని, పేదలు సామాన్యుల కష్టాలను, కన్నీ ళ్ళను చూసి చలించి ఆ అనుభవంతోనే కవితల రూపంలో వాటిని వ్యక్తపరిచారు.
నేను చెమట బిందువుని
కండల కొండలో ఉదయించే లోక బంధువుని
గుండెలతో నాకు దోస్తీ
నేనుండేది బాధల బస్తీ
మనిషి చెమట చుక్కలు రాల్చకపోతే ఇంత నవనాగరికతా సమాజం మనకళ్ళముందు ఆవిస్క్రుతమయ్యేదా? కవి అనేవాడు ప్రజల పక్షం ఉండాలి అది పేదల పక్షం వహించాలి, బాధ విలువ తెలిస్తేనే దాని గూర్చి వ్యక్తీకరించగలడు, ఆ బాధ లేని వాడికి దానిని వ్యక్తీకరించే అర్హత లేదంటాడు ఓ చోట.
అందమైన పోయెం అంటే
దానికి గుండె ఉండాలి
అది కన్నీరు కార్చాలి
పీడితుల పక్షం వహించాలి
నాలుగు వ్యాక్యాలు వ్రాసి కవిగా చెలామణి అవుతున్న వారం దరికి శేషేంద్ర గారి పై నాలుగు మాటలు హెచ్చరిక లాంటివనే చెప్పాలి. కవి ఎవడు ఎలా ఉండాలి, ఎవరి పక్షం ఉండాలి, ఎలా ఉండాలి, ఎటువంటి వ్యక్తిత్వ నిర్మాణం ఉండాలి అనేది కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పారు. బహుశా ఇలా చెప్పడం అందరికి సాధ్యం కాదేమో.
నేను పోతేపోతాను,
మళ్ళీ రాకపోవచ్చు కాని
నా జ్ఞాపకాల బారి నుంచి తప్పించుకోలేరు మీరు
అవి ఈ దేశపుగాలుల్లో పక్షులై పాడుతుంటాయ్‌
కిరణాలై అల్లుకుంటాయ్‌ …..
అందరం పోయేవారమే కాని అందరిలా సాధారణంగా చస్తే ఎవరు పట్టించుకుంటారు. ఏదో ప్రత్యేకత ఉండాలి. మన చావుకి కూడా చరిత్ర ఉండాలి. పోయినవారు మళ్ళీ వస్తారా రారా అన్నది నమ్మకం లేనప్పుడు నా రాతలు, మిమ్మల్ని వెంటాడుతూ ఉంటా య్‌ అవి మమ్మల్ని పక్షులై, కిరణాలై మిమ్మల్ని అల్లుకుంటాయ్‌ అని గొప్పగా సందేశం ఇచ్చారు. అదేవిధంగా నా దారిలో రాళ్ళు అడుగుతున్నాయ్‌ గొంతులు గొంతులు మాకు గొంతులు అని, అలానే నాగుండెల మీద పరుగులెత్తే అనుభవాల రధచక్రాల కింద నా శరీరపు కండలు నలిగిపోతున్న అవి రేపే భావాల మేఘాలు చూస్తూ నిర్వన్నుడుగా ఉండిపోతాను అంటాడు. ఈ కవిత చదివితే నాకు శ్రీశ్రీ గారి మహాప్రస్థానం జయభేరి కవితలోని నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను! నేను సైతం విశ్వ వృష్టికి అశ్రువొక్కటి ధార పోశాను అన్న వాక్యాలు గుర్తుకు వచ్చినవి.
నీవొక కర్ర ముక్కవే కావొచ్చు
కానీ అనాది సృష్టిలో తలయెత్తిన మానవ
మహాకృషికి ఏకైక చిహ్నానివి
నాగలి అనే నీ పేరే గానీ…….
ఆకాశం నుంచి భూగోళం మీదికి రాలిన
ఒక మండే అక్షరానివి
నీ నీర్యానికి లొంగిపోయి భూమి
ఆనందోద్రేకంతో పళ్ళూ, ఇల్లు పద్యాలు
దోసిళ్ళతో దానాలు చేసింది,
నీవు ఈ దినం చరిత్ర చరమ పేజీలో గీచావు
మానవ జాతి మధ్య ఒక మండేగీత
కార్యచోరులు కార్యశూరులు అని….
అన్నపూర్ణగా పిలువబడుతున్న దేశంలో ఆకలి కేకల ఆర్తనా దాలు, అన్నదాతల ఆత్మహత్యలు, నిత్యం ఏదో ఒక చోట వింటూ నే ఉన్నాం. దేశానికి తిండి పెట్టెవాడికి తిండి కరువు, దర్జీకి బట్ట కరువు అన్నట్లు, వ్యవసాయం మాని పల్లెల నుండి పట్నాలకు వలసబాటపట్టే అనేక మంది అనేక రకాల పనులలో మగ్గిపోతున్న వారిని చూస్తూనే ఉన్నాం, ప్రకృతికి, మనిషి అనాదిగా సంఘర్షణ జరుగుతూనే వుంది. ప్రకృతిని లొంగదీసుకోవాలనే క్రమంలో మనిషి నిత్యం ఓడిపోతూనే వున్నాడు. అయిన అన్వేషణ, పరిశో ధన మనిషి తపన ఆగటం లేదు, ప్రకృతి నేటికి మనిషికి ఎన్నో సవాళ్ళు విసురుతూనే వుంది. మనిషి భూమిపై అజమాయిషీ చెలాయిస్తున్నట్లుగా విర్రవీగుతున్నప్పటికి మనిషి అల్పజీవి మాత్ర మే. అది తెలియక నది నదాలు, ప్రకృతిని ధ్వంసం చేస్తూనే వున్నాడు. చివరికి తన పతనానికి తనే స్వయంగా గోతులు తవ్వు కుంటున్నాడు. ఇంకా ఇందులోనే ఇలా అంటాడు ఎండల తల పాగాలతో వెళ్లిపోతుంటే మిలియన్ల గొంతులెత్తి ఏడుస్తున్నవి ధాన్యపు రాసులు, రైతు నాగలి మోస్తున్నాడు క్రీస్తు శిలువ మోసి నట్లు ఈ దేశపు గర్భగుడిలో దేవుడు జీర్ణమైపోయాడు ఆకలి వేస్తోంది మరో దేవుడి కోసం అంటాడు ఇంతకుమించిన వర్తమా నపు చారిత్రక సత్యం ఇంకేం ఉంటుంది ఆలోచించండి.
ఎవడో ఇరవయ్యో శతాబ్దపు భక్తుడు
గుడిగంట మ్రోగించాడు. దూరాన నాకు వినిపించింది
ఆ ముసలి దేవాయలం దగ్గుతోంది
రాళ్ళు ఊడిపోయాయి అక్కడక్కడ దంతాల్లా
మనిషి కష్టాలు తీర్చేశక్తి ఎవరో,
మనిషి ఇంకా వెతుకుతూనే ఉన్నాడు అక్కడే
ఏ శత్రువు నీ బయట లేడు
నీశత్రువు నీలో వున్న బానిసత్వమే
ఇక్కడ ఏ చెరసాల బయట లేదు
ఇండియా కంటే పెద్ద చెరసాల లేదు
స్వాతంత్య్ర సమరయోధుడు రాజకీయ సాధనంగా మారాడు
కాలమే రాజకీయాల బానిసగా మారినప్పుడు
గాంధీ చీమలు తిన్న గారెలా మారాడు.
పై పంక్తులకు వివరణ వ్రాయాల్సిన అవసరం లేదనుకుం టాను. దేశంలో ఇప్పుడున్న పరిస్థితులకు ప్రతిబింబాలు మరియు అక్షర సత్యాలు కూడా. జాతీయ నాయకులు రాజకీయ సాధనా లుగా మారిపోయారు, ఇక స్వాతంత్రత్య సమరయోధులు దాదా పుగా చివరి అంకంలో వున్నారు. వారి గూర్చి పట్టించుకునే పరిస్థి తులే లేవు ఇప్పుడు. ఈ మాటలు చెప్పటానికి ధైర్యం వుండాలి.
నదులు కవులు భూగోళపు రక్తనాలాలు
నదులు ప్రవహిస్తాయి
కవితల్లా పక్షులకోసం పశువుల కోసం
మనుష్యుల కోసం
నదులు కంటున్న కలలు పొలాల్లో ఫలిస్తాయి.
ధరిత్రిని హలం దున్నితే
అప్పుడు అవుతుంది అది ఒక దేశం
ధరిత్రిని కలం దున్నితే
అది ఒక ఇతిహాసం
హలము కలమూ దున్నని ధరిత్రి
ధరిత్రి కాదు వట్టి మట్టి.
ఇందులో ఏ పంక్తిని కూడా వదలాలని అనిపించదు, వ్రాస్తూ నే వుండాలనిపిస్తది. అందుకే శేషేంద్ర శర్మ గొప్ప కవి అయ్యాడు. తిరుగుబాటుతత్వం తన కవిత్వంలో కనిపిస్తున్నప్పటికీ అన్ని అక్షరసత్యాలే కలము హలము విడదీయరానివి. హలము దున్నని నేల, కలము లేని కావ్యము రెండు వ్యర్ధమే కాబట్టి హలము కలము దున్నని ధరిత్రి ధరిత్రి కాదు వట్టి భీడు భూమి అంటాడు. ఇంకా చివర్లో సూర్యుడి నుండి సూర్యుడికి ఇరవై నాలుగు గంటల దూరం, మనిషి నుండి మనిషికి రెండు గుండెలే దూరం ఆకాశం ప్రభాత వ్రాయువుల్లో ఉదా రంగు ముడుతలు విప్పి తనని జెండాలా ఎగరేస్తోంది అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకులు దూరం! అంటూ ముగిస్తాడు.
ఇలా వ్రాసుకుంటూ ఐతే ఒక పెద్ద సిద్ధాంత గ్రంధం అవు తుంది, కాని ఏ వాక్యాలను తీసివేయలేము. ఆయన వాడిన పదాల శక్తి అలాంటిది, వాటి తీవ్రత కూడా పెద్ద దుమారం రేపింది. అం దుకే నేటికి గుంటూరు శేషేంద్ర శర్మ గారి సాహిత్యం యువతను ఉత్తేజితుల్ని చేస్తుంది. అందుకే కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరు ఉంది అని ఆత్మ విశ్వాసంతో ప్రకటించు కున్న గొప్ప కవి. శేషేంద్ర గారు మరణించినప్పుడు (30/05/ 2007) ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇలా రాసింది. తెలుగు వాళ్ళు శేషేంద్ర శర్మను దూరంపెట్టినందుకు తప్పకుండా పశ్చత్తాప పడాలి. శేషేంద్ర శర్మ తెలుగు సాహిత్య రంగానికి ఇంకా ఎంతో ఇచ్చేవాడు కాని మనం అందుకు అర్హులం కాము. ఆయనకు జ్ఞానపీఠ పురస్కారం తిరస్కరించబడటం దీన్ని రుజువు చేస్తుంది. అని నిజంగానే హిందు పత్రిక వ్రాసిన ఆ మాటలు ముమ్మాటికి నిజం కూడా. అవార్డులు రావాలంటే పెద్ద వారితో పైరవీలు చేసు కునే గొప్ప నెట్‌ వర్క్‌ లేదా రాజకీయ నేపధ్యం అందరికి ఉండదు కదా దానికి శేషేంద్ర శర్మ గారు మిహహాయింపు కాదు. తెలుగు సాహిత్యం నాటి నుండి నేటి వరకు ఉత్తరాది సాహిత్యంతో పోల్చు కుంటే తెలుగు సాహిత్యం పరాభవానికి గురైందన్న మాట వాస్తవ మే. శేషేంద్ర శర్మ గారు కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకున్న అవా ర్డులు రాష్ట్రేంద్రు బిరుదం, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు, ఇక రాష్ట్ర ప్రభుత్వం వీరిని ఏమైన గౌరవించిందా అంటే అది లేదు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్‌ పురస్కారం మాత్రమే ఇచ్చింది అంటే తెలుగు నేల శేషేంద్ర గారిని ఎంతగా సద్వినియో గం చేసుకుందో ఈ ఒక్క సంఘటన రుజువు చేస్తోంది.
ఏది ఏమైనా ఒక కవి లేదా ఒక మేధావి ఈ ప్రపంచానికి ఏం ఇవ్వగలడు విలువైన జ్ఞానాన్ని అంతే విలువైన సమాచారాన్ని లేదా సృజనాత్మకమైన ఒక వస్తువును లేదా ఒక యంత్రాన్ని తయారు చేయగలడు. శేషేంద్ర శర్మ కూడా మేధోపరమైన రచనలు మనకు ఇచ్చారు. తెలుగు సినిమా చరిత్ర ఒక మైలు రాయి వంటి సినిమా బాపు గారి దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గు సినిమాలో నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది కన్నుల్లో నీరు తుడిచి కమ్మని కల ఇచ్చింది అంటూ సాగే పాటలో చివర్లో ఇలా అం టారు. నది దోచుకుపోతున్న నావకు చెప్పండి రేవుబావురుమం టోందని ఇంతటి ఆర్ధమైన సాహిత్యం మనకు ఇచ్చి వారు మాత్రం ఎలాంటి ప్రచార్భాటాలు లేకుండానే నిష్క్రమించటం బాధ కల్గించే విషయం వారి సాహిత్యాన్ని ఇంకా జనంలోకి తీసుకొని వెళ్ళాల్సిన అవసరం వుంది అలాగే ప్రభుత్వాలు ఇకనైనా గుర్తిస్తే వారికి వారి రచనలను మనం గౌరవించినట్లుగా భావించాలి. సినారె మట్టికి మనిషికి విడదీయరాని బంధమేదో ఉంది అన్నట్లు దేశమంటే మట్టి కాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌ అన్న మహాకవి గారి వాక్యా లను స్మరిస్తూ నా దేశం నా ప్రజలు లాంటి గొప్ప రచన చేసిన శేషేంద్ర శర్మ అరుదైన వ్యక్తులలో అరుదైన కవిగా గుర్తింపబడ్డారు.
ప్రాంతీయ వివక్ష అనేది ఒక గుంటూరు శేషేంద్ర శర్మ గారికే జరుగలేదు కేవలం అభ్యుదయ కవిత్వానికే పరిమితమైన శ్రీశ్రీ గారికి, వారు వ్రాసిన మహాప్రస్థానం యువతను పక్కదారి పట్టి స్తుందని నిషేదించారంటే సాహిత్యానికి ప్రభుత్వాలు ఎంతగా ప్రాధాన్యం ఇచ్చాయో అర్ధం చేసుకోవచ్చును, అలాగే దాశరధి, రాయప్రోలు సుబ్బారావు, కృష్ణశాస్త్రి, తిలక్‌, ఆరుద్ర, చలం, జాషువా, కాళోజి మొదలైన వారికి కూడా అలాగే జరిగింది. ఇలా చెప్పుకుంటూపోతే తెలుగు సాహిత్యంలో చాలామందికి ఇలాంటి పరాభవాలు ఎన్నో ఎన్నోన్నో. అందుకే ఇటువంటి వాటికి ఒక్క గుంటూరు శేషేంద్ర శర్మ గారు మినహాయింపు కాదు, ఐనా గుర్రం జాషువా సుకవి జీవించు ప్రజల నాలుకల యందు అన్న ట్లుగా, ప్రభుత్వాలు గుర్తించినా గుర్తించకపోయినా ప్రామాణిక మైన సాహిత్యం ఎప్పుడు ప్రజల నోళ్లలో నానుతూనే ఉంటుంది, తరాలు మారినా దాని విలువ తగ్గదు, నేటి కాలపు కవిత్వం వ్రాస్తున్న చామందికి శేషేంద్ర శర్మ లాంటి వారు తెలియకపోవడం దురదుష్టకరం సాహిత్య విద్యార్ధిగా తరగతి గదిలో పరిశోధకుడిగా వారి గూర్చి నాలుగు మాటలు రాసే అవకాశం రావడం మా అదృష్టం. అందుకే కవిత్వమొక మెస్మరిజం కవి కన్ను ఒక ప్రిజం నేను సృష్టించిన అలంకారం నీ అందకారానికి దీపం అంటారు అది అందరికి సాధ్యపడదు. శ్రీశ్రీ శేషేంద్రను ఉద్దేశించి శేషేన్‌ శేషేన్‌ నీ పోయెమ్స్‌ చూసేన్‌ నీది మంచి పద్యమా లేక ఫ్రెంచి మ ధ్యమా అన్నారంటే వారి గొప్పతనం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.
డా॥మహ్మద్‌ హసన్‌

  • 9908059234
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News