మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత పి.వి నరసింహా రావు జయంతి సందర్భంగా నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ” తెలుగు రాష్ట్రంలో ,తెలంగాణ ప్రాంతంలో జన్మించి భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యిన గొప్ప నేత పివి నరసింహారావు అన్నారు. ఆయన ప్రధానమంత్రిగా ఎన్నో ఆర్ధిక సంస్కరణలు చేసి భారత దేశాభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఆనాడు ఆయన గొప్ప సంస్కరణలు తీసుకురావడం కారణంగానే నేడు భారతదేశం అభివృద్ధి చెందిందని ఆయన చెప్పారు.
పివి నరసింహ రావు గొప్ప బహుభాషా కోవిదుడని సుఖేందర్ రెడ్డి చెప్పారు. ఆయన అనర్గళంగా 17 భాషల్లో మాట్లాడి అందరిని ఆశ్చర్యానికి గురి చేసేవారన్నారు. కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా గొప్ప రచయితగా కూడా పివి నరసింహా రావు గుర్తింపు పొందరన్నారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన “వేయి పడగలు” అనే రచనను సహస్రఫన్ అనే పేరుతో పి.వి నరసింహా రావు హిందీలోకి అనువాదం చేశారన్నారు. దేశానికి ఎంతో గొప్పగా సేవ చేసిన ఆయనను గొప్పగా గౌరవించుకునే అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పి.వి నరసింహ రావుని గొప్పగా గౌరవించి ఆయన శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి, రాజధాని నగరం నడి బొడ్డున ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించామన్నారు. త్వరలోనే నల్గొండ పట్టణంలో కూడా పివి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. పివి నరసింహ రావుని ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి,కనగల్ జడ్పిటిసి చిట్ల వెంకటేశం ,స్థానిక వార్డు కౌన్సిలర్ యామ కవిత దయాకర్, బి ఆర్ ఎస్ పార్టీ నేతలు యామ దయాకర్, ఐతగొని స్వామి గౌడ్, గోపాల్ రెడ్డి, వెంకటేశ్వర రావు ,యాదయ్య, హరికృష్ణ, మునాస వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.