కూరగాయల ధరలకు మళ్లీ రెక్కలు వచ్చినట్టు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు ఆకాశాన్నంటడం ప్రారంభమైంది. సామాన్య పౌరులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. టమేటా వంటి కూరల ధరలు కిలో వంద రూపాయలు దాటిపోవడం సాధారణంగా మూలిగే నక్క మీద తాటి పండు పడ్డ చందంగా ఉంటుంది. నిత్యావసర వస్తువులు, సరుకులు, మందుల ధరలు దాదాపు నలభై శాతం పెరిగిపోవడంతో గగ్గోలు పెడుతున్న సామాన్య ప్రజానీకం గత కొద్ది రోజులుగా కూరగాయల ధరలు కూడా పెరుగుతుండడంతో అల్లల్లాడిపోవడం జరుగుతోంది. వర్షాకాలం ప్రారంభం కావడం, కొన్ని ప్రాంతాలలో వర్షాల వల్ల రవాణా సౌకర్యాలు దెబ్బతినడం వంటి కారణాల వల్ల కాయగూరల ధరలు పెరగడం జరుగుతోంది. మరికొన్ని ప్రాంతాలలో వర్షాభావం కారణంగా పంట దిగుబడి తగ్గి, కూరల ధరలు పెరగడం ప్రారంభమైంది. అతివృష్టి, అనావృష్టుల వల్ల నిత్యావసరాల ధరలు అతి వేగంగా పెరిగిపోతున్నాయి. సరఫరా తగ్గిపోవడం, డిమాండ్ పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా అధికార వర్గాలు చెబుతున్నాయి.
ప్రకృతిలో చోటు చేసుకునే మార్పుల ప్రభావం నుంచి బయటపడడం అనేది జరగడం లేదు. ప్రకృతిలో ఈ విధమైన మార్పులు వచ్చినప్పుడల్లా దేశం పరిస్థితి అస్తవ్యస్తం అవుతోంది. దేశానికి ఇటువంటి సవాలు ఎదురైన వెంటనే ఉత్పత్తిలోనూ, సరఫరాలోనూ పెద్ద ఎత్తున తేడాలు చోటు చేసుకుంటాయి. నిజానికి, దేశంలో పండ్లకు, కూరగాయలకు కొరతేమీ లేదు. విశ్వవ్యాప్త కూరగాయల మార్కెట్ సమాచారం ప్రకారం, 2022లో దేశంలో మొత్తం కూరగాయల ఉత్పత్తి 9.96 కోట్ల మెట్రిక్ టన్నులు.కాగా, 2023 నాటికి అది 10.59 కోట్ల టన్నులు దాటే అవకాశం ఉంది.అంతేకాదు, 2024 నాటికి ఇది మరో 6.8 శాతం పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.2028 నాటికి దేశంలో మొత్తం కూరగాయల ఉత్పత్తి 13.54 కోట్ల టన్నులు దాటే అవకాశం కూడా ఉందని అంచనా.దేశంలో తలసరి కూరగాయల వినియోగం 74.61 కిలోలను మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
కూరగాయల ఉత్పత్తిలో చైనా తర్వాత భారత్ రెండవ స్థానాన్ని ఆక్రమించి ఉంది. భారత్‌లో సీజన్‌తో సంబంధం లేకుండా ప్రతి కాలంలోనూ కూరగాయలు పండుతూనే ఉంటాయి. దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కూరగాయల ఉత్పత్తి జరుగుతుంటుంది. అదే విధంగా సరఫరాలో కూడా మార్పులు చోటు చేసుకుంటుంటాయి. అందువల్ల దేశంలో పంపిణీ వ్యవస్థ పటిష్ఠంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇందుకు రకరకాల రవాణా సౌకర్యాల వినియోగం అవసరమవుతుంది. అంతేకాదు, భారతదేశంలోని మారుమూల గ్రామాలలో సైతం శీతలీకరణ కేంద్రాలను, గిడ్డంగులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఏయే రాష్ట్రాలలో ఏయే కూరగాయాలు పండేదీ, ఏ ప్రాంత ప్రజలు ఏయే కూరగాయలను ఎక్కువగా వినియోగించేదీ, ఏయే సీజన్లలో వినియోగంలో తేడాలు వచ్చేదీ ప్రభుత్వాలు సమగ్రమైన వివరాలను సేకరించాల్సిన అవసరం ఉంది. ఈ వివరాలను, సమాచారాన్నిబట్టి దేశంలోని ఏయే ప్రాంతాలకు ఏయే రకాల కూరగాయలను సరఫరా చేయవలసిందీ తెలుసుకోవడానికి, ఆ ప్రకారం యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వీలుంటుంది. దీని వల్ల కూరగాయలకు కొరత ఏర్పడడం, ధరలు పెరగడం వంటి సమస్యలు ఉండవు.
దేశంలో ఎందరో అనుభవజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తలున్నారు. దేశంలో ఆర్థిక నిపుణులకు కొదవేమీ లేదు. వ్యవసాయానికి సంబంధించిన మూడు కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాలున్నాయి. రాష్ట్ర స్థాయిలో 64 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్నాయి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి గుర్తింపు పొందిన నాలుగు డీమ్డ్ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కూడా వ్యవసాయ పరిశోధనల్లో నిమగ్నమై ఉన్నాయి. వీరందరి సహాయ సహకారాలతో కూరగాయల సరఫరా, పంపిణీ వ్యవస్థలను తీర్చిదిద్దవచ్చు. కూరగాయల వినియోగాన్ని చక్కదిద్దవచ్చు. కొరతలను తీర్చవచ్చు. ధరలను అదుపు చేయవచ్చు. ఉత్పత్తి తగ్గిపోతే వేరే సంగతి. కానీ, సరఫరాలు, పంపిణీ, రవాణాలు లోపభూయిష్ఠంగా ఉన్నప్పుడు వీటిని చక్కదిద్దడం, సరిచేయడం చాలా అవసరం. కూరగాయలను నిల్వ చేయడానికి వీలైన శీతలీకరణ కేంద్రాలను, గిడ్డంగులను నెలకొల్పలేకపోవడం దురదృష్టకర విషయం. ఈ నిర్లక్ష్యమే దేశానికి శాపంలా పరిణమించింది.