అప్పర్ లిప్ హెయిర్ ను పోగొట్టే ఇంటి చిట్కాలు
కొందరు ఆడవాళ్లకు, ఎదుగుతున్న అమ్మాయిలకు పెదవులపైన్నని మీసంలా అవాంఛనీయ రోమాలు వస్తాయి. ఇది అమ్మాయిలకు ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. నలుగురిలో తిరగడానికి మొహమాటపడతారు. ఆత్మనూన్యతాభావానికి లోనవుతుంటారు కూడా. పెదాలపై పెరిగిన అవాంఛనీయ రోమాలను చూసి మీసం అంటూ తోటివాళ్లు వారిని ఏడ్పించడం కూడా కద్దు. అయితే ఈ సమస్య అరికట్టేందుకు మన వంటింట్లోనే ప్రక్రుతి సిద్ధమైన పరిష్కారాలు చాలా ఉన్నాయి. వాటిని అనుసరిస్తే ఈ సమస్య నుంచి బయటపడడం తేలికే. ఒత్తిడి, ఆరోగ్యకరమైన డైట్ తీసుకోకపోవడం, హార్మోన్లలో తలెత్తే తేడాపాడాలు వంటివి ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణాలు. స్త్రీలలో కనిపించే ఈ హిర్సుటిజం లేదా అవాంఛిత రోమాల సమస్య జన్యు సంబంధమైన హార్మోన్ల సమస్య వల్ల కూడా తలెత్తుతుంది. దాదాపు ఐదు నుంచి పది శాతం మంది మహిళలు ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందన్నదానిపై అధ్యయనాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ అవాంఛిత రోమాలకు కొన్ని ఇంటి రెమిడీలు ఉన్నాయి.
వాటిల్లో ఒకటి పసుపు, పాలు మిశ్రమంతో చేసిన పేస్టు. పసుపు స్త్రీలలో అవాంఛిత రోమాల సమస్యను తగ్గిస్తుంది. ముఖ్యంగా పెదవులపై వచ్చే అవాంఛిత రోమాలను బాగా తగ్గిస్తుంది. ఒక టేబుల్ స్పూను పసుపు, ఒక టేబుల్ స్పూను నీళ్లు లేదా పాలు తీసుకుని బాగా కలిపి పేస్టులా చేయాలి. దాన్ని పెదవి పైభాగంలో వచ్చిన అవాంఛిత రోమాలపై అప్లై చేసి అరగంట పాటు అలాగే వదిలేయాలి. అది పొడారిన తర్వాత సున్నితంగా ఆ ప్రాంతంలో రుద్ది తర్వాత నీళ్లతో కడిగేయాలి. రెండు వారాలలో కొన్ని రోజులు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. డయిరీ ఉత్పత్తులతో ఎలర్జీ సమస్య ఉన్నవాళ్లు పాల బదులు నీళ్లు వాడాలి.
తెల్లసొనను పెదవుల పై భాగాన వచ్చిన రోమాలపై పూస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. దీనికి గుడ్డులోని తెల్లసొన, ఒక టీస్పూను మొక్కజొన్నపిండి, ఒక టీస్పూను చక్కెర తీసుకోవాలి. తెల్లసొనలో మొక్కజొన్నపిండి, షుగర్ కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. ఈ పేస్టును పెదవి పైభాగంలో వెంట్రుకలు వచ్చిన చోట అప్లై చేయాలి. అరగంట పాటు దీన్ని ఎండనిచ్చి తర్వాత తీసేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చక్కెర కూడా అవాంఛిత రోమాలను తొలగించడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. అవాంఛిత రోమాలను అది తొలగించడమే కాదు వాటిని పెరగకుండా కూడా నిరోధిస్తుంది. ఇది మంచి ఎక్స్ ఫొయిలేటర్ గా పనిచేస్తుంది. అందుకే రెండు టేబుల్ స్పూన్ల చక్కెర, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, మెత్తటి గుడ్డను తీసి రెడీ పెట్టుకోవాలి. ప్యాన్ లో చక్కెరను ఒకనిమిషం పాటు వేడిచేయాలి. దాంట్లో తాజా నిమ్మరసం కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. చల్లబడిన చక్కెర, నిమ్మరసం పేస్టును పెదవుల పైభాగంలో అవాంఛిత రోమాలు ఉన్నచోట రాయాలి. పేస్టు రాసిన చోట మెత్తటి గుడ్డ ఉంచి గుండ్రంగా మసాజ్ చేయాలి. తర్వాత జుట్టును వ్యతిరేకదిశలో మెల్లగా లాగేసేయాలి.
ఇంకొక చిట్కా పెరుగు, తేనె, పసుపుల మిశ్రమం. దీన్ని పేస్టులా చేసి పెదవుల పైన ఉన్న అవాంఛిత రోమాలపై రాయాలి. దీనివల్ల అవాంఛిత రోమాలు కుదుళ్ల నుంచి వచ్చేస్తాయి. ఇందుకు ఒక టీస్పూను తేనె, ఒక టీస్పూను పెరుగు, చిటికెడు పసుపు తీసుకుని మెత్తటి పేస్టులా చేయాలి. ఆ పేస్టును పెదవులపై పూసి మసాజ్ చేయాలి. తర్వాత ఇరవై నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత సున్నితంగా ఆ ప్రదేశంలో రుద్ది చల్లటి నీళ్ళతో కడుక్కోవాలి. గోధుమ పిండితో కూడా పెదవులపై ఉండే అవాంఛిత రోమాలను తొలగించవచ్చు. ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి, ఒక టేబుల్ స్పూను పాలు, చిటికెడు పసుపు తీసుకుని పేస్టులా చేసి దాన్ని పై పెదవి పైభాగంలో అప్లై చేసి అది బాగా ఆరిన తర్వాత ఆ మాస్కును మెల్లగా తీసేయాలి. ఆ తర్వాత నీటితో కడుక్కోవాలి. నిమ్మ, చక్కెర మిశ్రమం కూడా అవాంఛిత రోమాలను తొలగిస్తుంది. నిమ్మకాయలో బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. ఇది పెదవులపై ఉన్న అవాంఛిత రోమాలను కనిపించకుండా చేస్తాయి.
చర్మం ఎక్స్ ఫొయలేట్ చేయడంలో చక్కెర బాగా పనిచేస్తుంది. అంతేకాదు జుట్టు కదుళ్లను వదులు చేస్తుంది. ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాలు సులభంగా ఊడివస్తాయి. అందుకే ఒక నిమ్మకాయ, ఒక టేబుల్ స్పూన్ చక్కెర తీసుకోవాలి. నిమ్మరసం పిండి అందులో చక్కెర వేసి కలిపి పేస్టులా అయ్యేవరకూ ఆగాలి. తర్వాత ఆ పేస్టును పెదవుల పైభాగాన ఉన్న అవాంఛిత రోమాలపై అప్లై చేసి దాన్ని అలాగే పదిహేను నిమిషాలు ఉంచాలి. అది పొడారిన తర్వాత నీళ్లతో ఆ భాగాన్ని కడుక్కోవాలి. ఈ పేస్టును రోజు విడిచి రోజు పెదవుల పైభాగంలో అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే మీది పొడిచర్మం అయితే ఈ మాస్కును వాడొద్దు. ఎందుకంటే నిమ్మ చర్మాన్ని మరింత పొడారిపోయేలా చేస్తుంది.
షుగర్ వాక్సింగ్ ద్వారా కూడా పెదవులపై ఉండే అవాంఛిత రోమాలను పోగొట్టవచ్చు. షుగర్ స్టిక్ నెస్ వల్ల అవాంఛిత రోమాలు సులభంగా ఊడొస్తాయి. దీనికోసం నాలుగు చమోమైల్ టీ బ్యాగ్స్, రెండు టేబుల్ స్పూన్ల చక్కెర, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, నీళ్లు, వాక్సింగ్ స్ట్రిప్, పాప్సికిల్ స్టిక్ వంటివి రెడీ పెట్టుకోవాలి. సాస్ ప్యాన్ తీసకుని అందులో నీళ్లు పోసి చమొమైల్ టీ బ్యాగ్స్ ను అందులో ఉడికించాలి. తర్వాత సాస్ ప్యాన్ ను స్టవ్ మీద నుంచి కిందికి దించాలి. టీ బ్యాగ్స్ ను అందులో అలాగే అరగంటసేపు ఉంచాలి. తర్వాత అందులోంచి టీబ్యాగ్స్ తీసేసి ఒక కప్పులో ఆ టీ నీళ్లను పోయాలి. తర్వాత సాస్ ప్యాన్ లో ఒక కప్పు నీళ్లు పోసి చమోమిల్ టీ డికాషన్కు కూడా కొద్దిగా నీటిని కలిపి చక్కెర, నిమ్మరసం వేసి బాగా కలపాలి. అది నల్ల రంగులోకి వచ్చే వరకూ అంటే రెండునిమిషాల పాటు ఆ మిశ్రమాన్ని ఉడికించాలి. తర్వాత పొయ్యి మీద నుంచి సాన్ ప్యాన్ ను దించి ఆ మిశ్రమాన్ని ఒక బౌల్ లో పోయాలి. ఈ షుగర్ వ్యాక్స్ చల్లారిన తర్వాత పెదవులపై పూసుకొని కొన్ని సెకన్ల పాటు మాత్రమే ఉంచుకోవాలి. పెదవి పైభాగంలోని అవాంఛిత రోమాలపై ఈ వ్యాక్స్ ను పూయడానికి పాప్ సికిల్ స్టిక్ ను వాడొచ్చు. తర్వాత వాక్సింగ్ స్ట్రిప్ ను దానిపై పెట్టాలి. కొన్ని సెకన్ల పాటు దాన్ని అలాగే వుంచి తర్వాత పీకేయాలి. ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాలు ఊడిపోతాయి. తేనె, నిమ్మ మిశ్రమం కూడా తేలికపాటి వ్యాక్స్ లా అవాంఛిత రోమాలపై పనిచేస్తుంది. ముఖ్యంగా పై పెదవిపై ఏర్పడ్డ అవాంఛిత రోమాలను పోగొడుతుంది.
అరటేబుల్ స్పూను నిమ్మరసం, ఒక టేబుల్ స్పూను తేనె, గోరువెచ్చని నీరు, వాష్ క్లోత్ రెడీగా పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులపై అప్లై చేసుకుని ఇరవై నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. మెత్తటి వాష్ క్లోత్ ను గోరువెచ్చటి నీళ్లల్లో నానబెట్టి తర్వాత దాన్ని నీళ్లు లేకుండా గట్టిగా పిండాలి. ఆతర్వాత పైపెదవిపై ఉన్న అవాంఛిత రోమాలపై రాసుకున్న తేనె, నిమ్మరసం మాస్కును సున్నితంగా తీసేయాలి. తర్వాత ఆ భాగాన్ని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. దీనిని వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. బంగాళాదుంప రసంతో పెదవిపై వచ్చిన అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు. మూసుకుపోయిన చర్మరంధ్రాలకు ఇది గాలి తగిలేలా చేస్తుంది. దీనిని ఎలా చేయాలంటే రెండు టేబుల్ స్పూన్ల పప్పు, ఒక టేబుల్ స్పూన్ బంగాళాదుంప రసం, ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూను నిమ్మరసం, నీళ్లు రెడి పెట్టుకోవాలి. పప్పును నీళ్లల్లో నానబెట్టి ఉదయం లేచిన తర్వాత పారబోయాలి. తర్వాత నిమ్మరసం, తాజా బంగాళాదుంప రసాలతో కలిసి ఆ పప్పును గ్రైండ్ చేయాలి. ఈ పేస్టులో తేనె వేసి కలపాలి. దీన్ని పెదవులపై పూసి ఇరవైనిమిషాలపాటు అలాగే ఉంచుకోవాలి. అది ఆరిన తర్వాత ఆ స్క్రబ్ ను పూర్తిగా తీసేయాలి. తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఈ మాస్కును ముఖానికంతా కూడా పూసుకోవచ్చు. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఇంకొక ఇంటి చిట్కా మొక్కజొన్నపిండి, పాలు కలిపిన మిశ్రమం. ఇది కూడా పెదాలపై ఏర్పడిన అవాంఛిత రోమాలను తొలగించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ పేస్టు చర్మాన్ని బిగుతుగా ఉంచడమే కాదు అవాంఛిత రోమాలను కూడా బాగా తగ్గిస్తుంది. ఇందుకు ఒక టీస్పూన్ మొక్కజొన్నపొడి, రెండు టీస్పూన్ల పాలు తీసుకుని దాన్ని పేస్టులా చేసి పెదవి పైభాగాన రాయాలి. తర్వాత దాన్ని బాగా ఆరనిచ్చి తర్వాత ఆ మాస్కును తీసేయాలి. పెదవులపై అవాంఛిత రోమాలు రాకుండా చేసేందుకు లేజర్ హెయిర్ రిమూవల్ ఉత్పత్తులు ఉన్నాయి. లేజర్ హెయిర్ రిమూవల్ పద్ధతితో పాటు ఎలక్ట్రోలసిస్ విధానం కూడా ఉంది.