ఆమె మంత్రి పదవి చేపట్టి పట్టుమని 4 నెలలు కూడా తిరక్కుండానే ప్రభుత్వంలో నంబర్ 2 స్థానానికి ఎగబాకడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అతిషి అనుకోకుండా లక్కీ ఛాన్స్ కొట్టేశారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో కీలకమైన నంబర్ 2 ప్లేస్ లో వెలిగిన డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా జైలులో ఉండటం అతిషికి రాజకీయంగా మరింత కలిసివచ్చింది. మనీష్ చేపట్టిన కీలక శాఖలన్నీ ఇప్పుడు అతిషి చేతుల్లో ఉన్నాయి. తాజాగా జరిగిన ఢిల్లీ మంత్రివర్గ విస్తరణలోనూ ఆమెకు అత్యధిక ప్రాధాన్యత దక్కడం విశేషం.
మొత్తం 10 శాఖలకు మంత్రిగా ఉన్న అతిషి కీలకమైన ఫైనాన్స్, రెవిన్యూ, ప్లానింగ్ వంటి శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టనుండటం హైలైట్. కైలాష్ గెహ్లాట్, మనీష్ సిసోడియాల శాఖలు ఆమెకు దక్కటమే కాదు ఎవరైనా మంత్రులు సమర్థవంతంగా పనిచేయకపోయినా ఆ శాఖలు కూడా ఆమెకు అప్పగిస్తుండటంతోపాటు, మంత్రులు లేని శాఖలకు కూడా ఆమెనే మంత్రిగా వ్యవహరిస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో మనీష్ కు కూడా ఇలాంటి ప్రాధాన్యతనిచ్చిన కేజ్రీవాల్ ప్రస్తుతం అతిషికి ఇస్తుండటం వెనుక పలు రాజకీయ సమీకరణాలున్నట్టు స్పష్టమవుతోంది.
వ్యూహాత్మకంగా తనవద్ద ఎటువంటి పోర్ట్ పోలియోలు లేకుండా ముందు జాగ్రత్తలు పకడ్బందీగా తీసుకునే కేజ్రీ గతంలో మనీష్ వంటివారిపై అన్ని బాధ్యతలు పెట్టేవారు. తాజాగా అతిషిపై కూడా ఢిల్లీ సీఎం అచ్చం అలాంటి భరోసాను పెట్టడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి హస్తినలో బిజియెస్ట్ మినిస్టర్ గా ఆమె షెడ్యూల్ ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి ఎమ్మెల్యేగా గెలవగానే ఆమెకు సుమారు డజన్ శాఖలు చేతికి రావటం అంటే ఇలాంటివి చాలా అరుదుగా జరిగే ఫీట్లని రాజకీయ పండితులే షాక్ తింటున్నారు. గతంలో మనీష్ సిసోడియాకు సలహాదారుగా ఉన్న అతిషి ఇప్పడు మనీష్ శాఖలకు మంత్రిగా అజమాయిషీ చెలాయించే స్థితికి ఎదగటం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.