ఎమ్మిగనూరు జనసేన అంతర్గత రాజకీయాలు పలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. సినీ నిర్మాత రూపా జగదీష్ జనసేన వీడినప్పటికీ ఆయన్ను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఎమ్మిగనూరు రాజకీయాల్లో కీలకంగా మారిన సినీ నిర్మాత రూపా జగదీష్ తీసుకున్న అనూహ్యమైన నిర్ణయాలు ఎమ్మిగనూరు రాజకీయాల్లో ఆయనను ఎటువైపుకు తీసుకువెళుతున్నాయో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. కర్నూలులో 2 నెలల క్రిందట జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో తన మిత్రుడు సయ్యద్ ఇద్రుస్ భాషఖాద్రీతో పాటు వారి అభిమానులతో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న రూపా జగదీష్ జనసేన పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. పలు గ్రామాల నుండి చేరికలతో ఇక పార్టీ గాడిలో పడుతుంది అనుకుటుండగా అకస్మాత్తుగా 2 నెలలు కూడా గడవక ముందే పార్టీ ఇంచార్జి రేఖా గౌడ్ పార్టీ పటిష్టానికి సహకరించడం లేదంటూ తీవ్ర ఆరోపణలు చేసి, పార్టీకి రాజీనామా చేసారు.
ప్రస్తుత ఇంచార్జి రేఖా గౌడ్ పార్టీలో పెద్దల ఒత్తిడికి తలొగ్గి పార్టీలో చేరమని స్వయంగా వచ్చి రూపా జగదీష్ ను ఆహ్వానించినప్పటికీ పార్టీలో అతను చేరడం ఆమెకు మొదటి నుండి ఇష్టం లేదనే తెలుస్తోంది. పార్టీలోకి అతను చేరితే తమ ఇంచార్జి పదవి ఉండదనే భయంతో చేరకుండా చివరి వరకు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పార్టీ పెద్దలు నేరుగా ఆహ్వానించడంతో రూపా జగదీష్ పార్టీలో చేరినట్లు తెలిసింది. పార్టీలో రేఖా గౌడ్ వల్ల గడచిన నాలుగున్నర సంవత్సరాల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పార్టీ ఏ మాత్రం అభివృద్ధి చెందడం లేదనే విషయం అధిష్ఠానానికి తెలిసే, రూపా జగదీష్ ను ఆమె స్థానంలో ఇంచార్జిగా నియమిస్తే నిజాయితీ పరుడిగా, ప్రజా సేవకుడిగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అతనికున్న మంచి ఇమేజ్ పార్టీ అభివృద్ధికి ఉపయోగపడుతుంది అని అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది.
ఇక్కడ మాత్రం పరిస్థితి ఇంకొక లాగా తయారయ్యింది. రేఖా గౌడ్ ఎమ్మిగనూరులో నివాసం ఉండకపోవడం, ఎప్పుడో నాలుగైదు నెలలకొకసారి ఎమ్మిగనూరుకు వచ్చి నామమాత్రంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని వెళ్లడం వల్ల పార్టీకి ఉన్న అతి కొద్దిమంది కార్యకర్తల్లో కూడా నిరుత్సాహం ఉండేది. కానీ రూపా జగదీష్ చేరికతో జనసేన అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం మొదలైంది. ఇక నుంచి పార్టీ అభివృద్ధి చెందుతుంది అని ఆనంద పడుతున్న సమయంలో ఒక్కసారిగా రూపా జగదీష్ పార్టీ నుంచి బయటకు రావడంతో పార్టీ కార్యకర్తల్లో మళ్లీ నిరుత్సాహం ఆవరించింది. పార్టీలో చేరినప్పటి నుండి పలు గ్రామాల నుండి చేరికలు మొదలవ్వడంతో కన్నెర్ర చేసిన స్థానిక అధికారపక్ష నాయకుల వల్ల రకరకాల ఇబ్బందులు ఎదురవ్వడం ఆ విషయంలో ఇంచార్జి రేఖాగౌడ్ కు తెలియ చేసినా ఆమె నుండి ఎటువంటి స్పందన లేకపోవడం, పార్టీ కార్యక్రమాలకు పిలవక పోవడంతో, ముందే ముక్కుసూటి మనిషిగా పేరున్న రూపా జగదీష్ వెంటనే అధిష్టానంకు ఫిర్యాదు చేయడంతో కొద్ది కాలం వేచి ఉండమని అధిష్టానం సలహా ఇచ్చిందని తెలిసింది.
వారాహి యాత్ర సన్నాహాల్లో బిజీగా ఉన్న అధిష్టానం స్పందించక పోవడంతో కొన్నిరోజులు వేచి చూసిన జగదీష్ ఇక కుదరదని పార్టీని వీడారు. పార్టీ నుండి బయటకు వచ్చేటప్పుడు కూడా కేవలం ఇంచార్జి రేఖాగౌడ్ ను తప్ప పార్టీని కానీ పార్టీ పెద్దలను విమర్శంచ లేదు. కేవలం పార్టీ అభివృద్ధికి రేఖా గౌడ్ సహకరించడం లేదని పార్టీని వీడుతున్నానని చెప్పారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం కృషి చేస్తామని చెప్పడం గమనించిన అధిష్టానం పార్టీ బలోపేతం కావాలంటే ఇలాంటి నిక్కచ్చిగా పనిచేసే వాళ్లే కావాలని అభిప్రాయపడి ఇటీవలే రూపా జగదీష్ ను సంప్రదించి పార్టీలోకి తిరిగి రమ్మని ఆహ్వానించడమే కాకుండా ఈసారి ఎమ్మిగనూరు ఇంచార్జిగా బాధ్యతలు స్వీకరించమని అడిగినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో రూపా జగదీష్ మళ్లీ జనసేన పార్టీలోకి చేరతాడా? అతను ఇంచార్జిగా బాధ్యతలు స్వీకరిస్తే జనసేన పార్టీ క్షేత్ర స్థాయిలో బలపడితే ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీకి లాభం అని నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరి రూపా జగదీష్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.