నీలాల కన్నుల్లో మెలమెల్లగా
నిదుర రావమ్మా రావే… నిండారా రావే
నెలవంక చలువలు వెదజల్లగా
నిదుర రావమ్మా రావే నెమ్మదిగా రావే
ఎప్పుడో 1969లో విడుదలైన నాటకాల రాయుడు అనే సినిమా కోసం ఆచార్య ఆత్రేయ రాసిన పాట ఇది. ఇప్పటికీ అప్పుడప్పుడు ఇలాంటి పాటలు మనకి మనం పాడుకోవడమో.. లేదా ఫోన్‌లో ప్లే చేసుకుంటూ ఇయర్ బడ్స్ ద్వారా వింటూ అలా కునుకు తీయడమో ఎంత మంచిదో మీకు తెలుసా? అది కూడా పగలు పనిచేసుకునేటప్పుడు, అందులోనూ పనిలో పూర్తిగా తలమునకలు అయిపోయేటప్పుడు మధ్యలో ఒక్క పావుగంట నుంచి అరగంట పాటు అలా చిన్న కునుకు తీస్తే మీ మెదడుకు పునరుత్తేజం రావడమే కాదు.. మీ అప్రమత్తత పెరిగి, ఉత్పాదకత గణనీయంగా మెరుగవుతుందట. ఇదేదో ఆషామాషీగా చెబుతున్న విషయం కాదు. 40 నుంచి 69 ఏళ్ల మధ్య వయసుగల 4 లక్షల మందికి పైగా బ్రిటిషర్ల మీద యూనివర్సిటీ ఆఫ్ ద రిపబ్లిక్‌కు చెందిన యూనివర్సిటీ కాలేజ్ లండన్ వాళ్లు పరిశోధన చేసి.. బల్లగుద్ది మరీ చెబుతున్న వాస్తవం. పగటిపూట ఒక్క అరగంట అలా కునుకు తీస్తే మెదడు ఆరోగ్యం చాలా మెరుగుపడుతుందని, అంతేకాక వార్ధక్యం వచ్చినా డిమెన్షియా (తీవ్రమైన మతిమరుపు) లాంటివి వచ్చే ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు.
అలా తరచు చిన్నచిన్న కునుకులు తీయడం వల్ల మెదడు కుచించుకుపోకుండా ఉంటుందని, దానివల్ల వార్ధక్యం ఏడేళ్ల పాటు వాయిదా పడుతుందని తేలింది. పగటిపూట అప్పుడప్పుడైనా అలా పడుకునేవారికి, ఏమాత్రం పడుకోకుండా మిషన్లలా పనిచేస్తూనే ఉండేవారికి మధ్య వార్ధక్యం వచ్చే వయసు 2.6 నుంచి 6.5 సంవత్సరాల తేడా ఉంటోంది. కాస్త విశ్రమించేవారికి ఆలస్యంగా ముసలితనం వస్తే, నిరంతర శ్రామికులకు ముందే వచ్చేస్తోంది.
“కొంతమంది పగటిపూట చిన్నపాటి నిద్రపోవడం వల్ల వారి వయసు పెరిగేకొద్దీ మెదడు ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది” అని యూసీఎల్‌లోని ఎంఆర్‌సీ యూనిట్ ఫర్ లైఫ్ టైమ్ హెల్త్ అండ్ ఏజింగ్‌కు చెందిన సీనియర్ ఆథర్ డాక్టర్ విక్టోరియా గార్‌ఫీల్డ్ చెప్పారు. పగటిపూట నిద్రకు, మెదడు ఆరోగ్యానికి మధ్య సంబంధం గురించి వోక్హార్డ్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ పవన్ పాయ్ మాట్లాడుతూ, “క్రమం తప్పకుండా రోజూ పగలు ఓ అరగంట పడుకుంటే మెదడు పరిమాణం తగినంతగా ఉంటుంది. దానివల్ల అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం కూడా చాలా తక్కువగా ఉంటుంది. వృద్ధాప్యంలో మెదడు కుంచించుకుపోయే రేటును ఇవి తగ్గిస్తాయి. తద్వారా, మన అభిజ్ఞా పనితీరు మెరుగుపడతుంది, జ్ఞాపకశక్తి చెక్కుచెదరదు. క్రమం తప్పకుండా మధ్యాహ్నం కాసేపు పడుకుంటే మానసికంగా చురుగ్గా ఉంటాం. దీనివల్ల సృజనాత్మక ఆలోచనలు పెరుగుతాయి. వయసు కారణంగా వచ్చే న్యూరో ఇన్‌ఫ్లమేషన్ సైతం వీటివల్ల తగ్గుతుంది” అని వివరించారు.
పగటి నిద్రలు శక్తిని పెంచడానికి, దృష్టిని మెరుగుపరచడానికి, శ్రద్ధ, మానసిక స్పష్టతను పెంచడానికి కూడా సహాయపడతాయి. ఈ విషయంలో ఎవరికైనా అపోహలు ఉంటే ఒక్కసారి డాక్టర్లతో మాట్లాడి వాటిని తొలగించుకోవడం మంచిది. ఎప్పుడు, ఎన్ని నిమిషాల చొప్పున నిద్రపోవాలో వాళ్లను అడిగితే శరీరతత్వాన్ని బట్టి, వయసును బట్టి అది చెబుతారు. వీలైనంత వరకు మధ్యాహ్నం పూట కనీసం 10-15 నిమిషాలు నిద్రపోవడం అందరికీ మంచిది. అలాగని మరీ ఎక్కువసేపు నిద్రపోతే అది దినచర్యను దెబ్బతీస్తుంది.
దీపాలు పెట్టే వేళకే..
“కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది.. కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది” అని శాస్త్రీయ విషయాన్ని కూడా పాటల్లో చెప్పిన మహానుభావుడు ఆత్రేయ. రాత్రి ఉద్యోగాలు, రాచకార్యాలు, అర్ధరాత్రి దాటినా టీ వీ, స్మార్ట్ ఫోన్లు చూడటం.. ఇలా కారణం ఏదైనా చాలామంది అర్ధరాత్రి దాటినా నిశాచరుల్లా మేలుకునే ఉంటారు. గూట్లో దీపం, నోట్లో ముద్ద, కంటికి కునుకు అనేది ఒకప్పటి సామెత. అంటే సాయంత్రం దీపాలు పెట్టే సమయానికి తినేసి హాయిగా పడుకోవాలన్న మాట.
ఎంఐటీ చెబుతోంది కూడా ఇదే
ఒక కునుకు తీసి లేస్తే మనుషుల్లో సృజనాత్మకత బాగా పెరుగుతుందని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్లు కూడా బల్లగుద్ది చెబుతున్నారు. చాలా సేపటి నుంచి మేలుకుని ఉన్నవారి కంటే, కాసేపు విశ్రాంతి తీసుకుని లేచినవారిని ఏవైనా ప్రశ్నలు అడుగుతుంటే ఠక్కుమని సమాధానాలు చెప్పేస్తున్నారట. అప్పటికే బాగా సృజనాత్మకత ఉందనుకునే వారిలోనూ పడుకుని లేచిన వెంటనే ఉన్న సృజనాత్మక శక్తికి, రోజంతా పని చేసి అలసిపోయి… పడుకోబోయే ముందు ఉన్న సృజనాత్మకత శక్తికి చాలా తేడా ఉంది. నిద్ర లేచిన వెంటనే బుర్ర చాలా క్రియేటివ్‌గా పని చేస్తోదని ఈ పరిశోధనలో కనుగొన్నారు.
జోల పాడేదెవరు?
దగ్గర్లో వేంకటేశ్వరస్వామి ఆలయం ఏదైనా ఉంటే ఉదయాన్నే మనకు కౌసల్యా సుప్రజా రామా పూర్వాసంధ్యా ప్రవర్తతే.. అని శ్రావ్యమైన మేలుకొలుపు వినిపిస్తుంది. ఆ తర్వాత మాత్రం చెత్త తీసుకెళ్లేవాడి దగ్గర నుంచి పాత ఇనప సామాన్లు కొనేవాళ్లు, చీపురుకట్టలు అమ్ముకునేవాళ్ల మైకులతో పదే పదే నిద్రాభంగం అవుతూనే ఉంటుంది. వెంకన్నకు అన్నమయ్య, భద్రాద్రి రామయ్యకు రామదాసు, అయోధ్య రామయ్యకు త్యాగయ్య జోలపాటలు పాడారు. మనకు మాత్రం అలా ఎవరూ పాడే అవకాశం లేదు కాబట్టి.. అలాంటి జోలపాటలనే ఫోనులో పెట్టుకుని వింటూ అలా ప్రశాంతంగా కాసేపు నిద్రపోవాలి.
ఎంతసేపు పడుకుంటే మంచిది.. ఏది మంచిది కాదు?
15 నిమిషాల కంటే తక్కువసేపు పడుకుంటే అది స్వల్ప నిద్ర అని, 30 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోతే అది దీర్ఘనిద్ర అని అంటారు. ఏదైనా కానీ.. కాసేపు అలా నిద్రపోతే మాత్రం జ్ఞాపకశక్తి బ్రహ్మాండంగా పెరుగుతుందని, అప్రమత్తత కనీసం ఒక గంట పాటు ఉంటుందని వైద్య నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే 90 నిమిషాల కంటే ఎక్కువసేపు పడుకుంటే మాత్రం మరింత మత్తు రావడం తప్ప ప్రయోజనం లేదట. ఇదంతా ప్రతి మనిషికీ మారుతుంది. ఎవరు ఎంతసేపు పడుకోవాలన్నది వాళ్ల శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. మధ్యాహ్నం మరీ ఎక్కువసేపు పడుకుంటే రాత్రి నిద్రపట్టక ఇబ్బంది పడతారు. అంతటి పరిస్థితిని మాత్రం తెచ్చుకోవద్దని వైద్యనిపుణులు సలహా ఇస్తున్నారు.