రామగుండం నియోజకవర్గ నిరుద్యోగ యువతకు శాశ్వత ఉద్యోగ, ఉపాధి కల్పనలో భాగంగా ఐటి పార్క్ ఏర్పాటు కోసం అమెరికా వెళ్ళిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డల్లాస్ లో రామగుండంకు చెందిన ఐటీ సంస్థ డైరెక్టర్ వేణు సంగాని, తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. తమ ప్రాంతంలో ఐటీలో శిక్షణ పొందిన, నైపుణ్యం కలిగిన యువత అందుబాటులో ఉన్నారని, ఐటీ పార్క్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తామని, రామగుండం నియోజకవర్గంలో ఐటి పార్క్ ఏర్పాటుకు సహకరించాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు సంస్థల పారిశ్రామికవేత్తలు రామగుండంలో తమ శాఖలను ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేశారని, దాంతో మొదటి దశలో సుమారు 50 నుండి 100 మంది ఐటి నిపుణులకు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండస్ట్రియల్ మాంచెస్టర్ గా ఉన్న రామగుండం నియోజకవర్గాన్ని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఉపాధిని అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నానని అన్నారు. అన్నీ అనుకూలిస్తే ఆగస్టు నెలలో రాష్ట్ర ఐటీ శాఖమాత్యులు కేటీఆర్ తో ఐటీ పార్క్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, పనులు ప్రారంభిస్తామన్నారు.