తెలంగాణ బీజేపీని జీ కిషన్ రెడ్డి చేతుల్లో పెట్టిన హైకమాండ్, ఏపీ బీజేపీని దగ్గుబాటి పురంధేశ్వరికి అప్పగించింది. ఇక పంజాబ్ బీజేపీ విషయానికి వస్తే సునీల్ కుమార్ జక్కర్ కు, ఝార్ఖండ్ బీజేపీకి బాబూలాల్ మరాండికి అప్పగించింది. కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ నేషనల్ ఎగ్జిక్యుటివ్ కమిటీలో సభ్యునిగా ప్రకటించింది. తెలంగాణలో ఈటల రాజేందర్ ను ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలు కట్టబెట్టి ప్రస్తుతానికి వ్యవహారాన్ని చక్కబెట్టే పనిచేశారు.
2024 ఎన్నికలే ధ్యేయంగా బీజేపీ చాలా పెద్ద కసరత్తు చేసింది. నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ ఈనెల 7న బీజేపీ రాష్ట్రాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో కీలక భేటీని ఏర్పాటుచేసింది. రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయటంతోపాటు, లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాల్లో విజయం సాధించేలా బీజేపీ దృష్టిసారిస్తోంది. కాగా రేపు ఉదయం 10.30కు కేబినెట్ భేటీ కూడా జరుగనుంది. అతిత్వరలో కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్వవస్థీకరించి, ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యతను ఇవ్వనున్నారు.