Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Indian Youth: యువతకు, విద్యావంతులకు రాజకీయాలలో ప్రాధాన్యమివ్వాలి

Indian Youth: యువతకు, విద్యావంతులకు రాజకీయాలలో ప్రాధాన్యమివ్వాలి

దేశ ప్రగతికి చోదక శక్తి యువతే

భారత దేశ జనాభాలో 15-29 యేళ్ల యువత 27.5 శాతం ఉన్నారు. యువ జాతి ప్రగతికి సంధాన కర్తలు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. మన దేశంలో యువత శాతం పెరుగుతుంది. మనదేశo 2020 నాటికి ప్రపంచంలో అత్యంత ‘యువ దేశంగా’ నిలిచింది. దేశ జనాభాలో 40 శాతం ఉన్న యువత అత్యంత మానవవనరు అని చెప్పవచ్చు. జాతి భవిష్యత్తు వారే కనుక యువత నిర్వహించాల్సిన పాత్ర మహత్తరమైంది. వారి సృజనాత్మకత ఉత్సాహం శక్తి కలిసి దేశంలో అద్భుత ఫలితాలివ్వగలవు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు దోహదపడే బలమైన మానవ వనరులు యువత. దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు నడిపే సత్తా వున్న యువతకు దేశ రాష్ట్ర స్థాయి. రాజకీయాలలో వివిధ రాజకీయ పార్టీలు యువకులకు, విద్యావంతులకు ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వివిధ రాజకీయ పార్టీలు అనుబంధ సంఘాలలో విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, మరికొన్ని సంఘాలలో యువకులు విద్యావంతులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతి రాజకీయ పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమం ప్రతి ఎలక్షన్‌ ఎన్నికల సభలు ధర్నాలు పాదయాత్రల్లో సమావేశాలలో యువకులు విద్యావంతులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలు జయప్రదం చేయడ ములో ముందుండి ప్రధానమైన పాత్ర పోషించడం జరుగుతుంది. జాతీయ రాజకీయ పార్టీలు, ప్రాంతీయ రాజకీయ పార్టీలు యువతను విద్యావంతులను ఓటు బ్యాంకుగా ఓట్లను సమీకరించే కార్యకర్తలుగా ఉపయోగించుకోవడం రాజకీయ పార్టీల సాంప్రదాయమైంది. విద్యావంతులైన యువతకు చట్టసభలలో ఎన్నిక కావడానికి విద్యార్థి సంఘం, యువజన సంఘం, కుల సంఘాల తరపున వారి వారి జనాభా, ఓటర్ల సంఖ్య ప్రాతిపదికన రిజర్వేషన్‌ పద్ధతి ప్రకారంగా వారు పార్టీలలో అనుబంధ సంఘాలలో పనిచేస్తున్న సీనియారిటీ ఆధారంగా గ్రామ పంచాయతీ వార్డ్‌ సభ్యుని నుండి మండల, జిల్లా పరిషత్‌ మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్లు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు జరిగే చట్ట సభ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా విద్యావంతులైన యువతకు అవకాశం కలిపించాలి. యువతకు 50 శాతం టికెట్స్‌ ఇవ్వాలి. యువతకు, విద్యావంతులకు తప్పనిసరిగా 50% సీట్లు కేటాయించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లుగానే నేటి యువత విద్యావంతులే రేపటి భవిష్యత్తు దేశ ప్రగతి రథ సారధులు. కనుక దేశ భవిష్యత్తు వీరిపైనే ఉంది. జనాభాలో 15-29 యేళ్ల వయసున్న యువత 27.5 శాతం వుంది. యువ శక్తి వనరులు ఎక్కువ వున్న దేశంగా భారత్‌ ప్రపంచములో గుర్తించ బడ్డది. విద్యావంతులలో గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, డాక్టరేట్‌ పట్టభద్రులు కూడా వివిధ సంఘాలలో వివిధ రాజకీయ పార్టీలలో వివిధ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. వార్డు సభ్యుడు మొదలుకొని పార్లమెంటు సభ్యుడు వరకు చట్టసభలకు జరిగే సార్వత్రిక మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీలు టికెట్స్‌ ఇవ్వాలి గతంలో యువత రాజకీయ పార్టీలో పార్టీకి చేసిన సేవలు సీనియారిటీ నిబద్ధత ప్రజాసంభందాలు మొన్నగు అంశాలనులెక్కలోకి తీసుకోవాలి. రిజర్వేషన్‌ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి.
యువత రాజకీయాలు ఉపాధి కల్పన భారత దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలల్లో నిరుద్యోగం ప్రధానమైనది. ‘ఓనామాల నుండి డాక్టరేట్‌ డిగ్రీ’ వరకు ఉన్నత విద్యలను అభ్యసించిన కూడా ఉద్యోగ అవకాశాలు దక్కడం లేదు. కనుక సామాజిక అంశాలపై సంక్షేమ పథకాలపై దేశ పరిస్థితులపై సమగ్ర అవగాహన కలిగిన యువతకు విద్యావంతులకు చట్ట సభలకు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలు టికెట్లను కేటాయిస్తే గ్రామీణ ప్రాంతాలలో యువకులకు నాయకత్వము కలుగుతుంది. గ్రామీణ సమస్యల పరిష్కారానికి యువత శక్తివంతంగా పనిచేసే అవకాశం ఏర్పడుతుంది. నిరుద్యోగ యువతకు రాజకీయ రంగములో పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కొంతవరకు నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. యువత సంఘ విచ్చిన్నకర కార్యకలాపాలకు దూరంగా వుండే అవకాశం కలుగుతుంది .
రాజకీయ పార్టీలు విద్యావంతులైన యువతకు చట్టసభలకు ప్రజాప్రతినిధులుగా అవకాశాలు కల్పించాలి. గుణాత్మక మార్పులు యువత భాగస్వామ్యం ప్రతి జిల్లా కేంద్రాలలో ఎంప్లాయిమెంట్‌ కార్యాలయాలలో నిరుద్యోగులుగా ఉద్యోగ అవకాశాల కోసం సంవత్సరాల పాటు ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు నైపుణ్యాభివృద్ధి రాజ్యాంగ అంశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రగతి పథకాల అమలులో శిక్షణ ఇవ్వాలి. శిక్షణ పొందిన యువత ప్రజలను వివిధ పథకాలలో భాగస్వాములను చేస్తూ దేశములో గుణాత్మక పరిమానాత్మక మారుపల సాధనలో యువశక్తిని సంపూర్ణంగా ఉపయోగించాలి.
సామాన్యుని ముంగిట్లో ప్రగతి ఫలాలు యువత
ప్రజాస్వామ్యం ప్రగతి ఫలాలు సామాన్యుని ముంగిట్లోకి చేర్చడానికి యువత కృషి చెయ్యాలి. యువతకు వివిధ రాజకీయ పార్టీలు ప్రజల సేవ చేయడానికి అవకాశం కల్పించాలి. వారికి అవకాశాలు దక్కకపోవడంతో ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో రాజకీయ పార్టీలు వివిధ అనుబంధ సంఘాలలో సేవలు మాత్రమే ఉపయోగించుకొని వారికి తగిన అవకాశాలు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులుగా పని లేకపోవడం వల్ల సోమరులుగా తయారై మత్తుకు మాదక ద్రవ్యాల వినియోగం దొంగ తనాలకు డ్రగ్స్‌కు అలవాటు పడి నేరాలకు పాలుపడుతున్నారు. వివిధ వ్యసనాలకు అలవాటుపడి నిరాశ నిస్పృహలకులోనై డిప్రెషన్‌తో ఆత్మహత్యలకు పాల్పడి వారి కుటుంబ సభ్యులకు గర్భ శోకం కలిగిస్తున్నారని అనేక సామాజిక ఆర్థిక సర్వేల్లో వ్యక్తమైంది. యువత కుటుంబ సభ్యులపై వృద్ధులైన తల్లిదండ్రులపై బ్రతుకు భారంగా రోజులు సాగదీస్తున్నారు.
దేశ స్వాతంత్య్రానికి పూర్వం స్వాతంత్య్ర అనంతరం తెలంగాణ ఉద్యమం వరకు దేశములో జరిగిన సాంఘిక రాజకీయ పౌర ఉద్యమాల వ్యూహాల్లో కార్యకలాపాల్లో యువత కేంద్ర బిందువుగా వుండడం గమనార్హం. రాజకీయ పార్టీలు యువతను పార్టీజెండాలు పట్టి జై కొట్టడానికి గొంతులు చించుకొని నినాదాలు బిగ్గరగా ఇ వ్వడానికి మాత్రమే వీరిని ఉపయోగించుకుంటే సరిపోదు.
రాజకీయ పార్టీలకు కనువిప్పు
మైకెల్‌ గ్రీస్‌ రాసిన సామాజిక రాజకీయ మార్పులో క్రియాశీలక ప్రతినిధులుగా యువత అనే పుస్తకములో యువతలో సానుకూల దృక్పథం కలిగించి అభివృద్ధికి అనువుగా మలుచుకోవడం అనేది ఎప్పటికప్పుడు విస్తృత స్థాయిలోని బలీయమైన ఉద్యమము చేపట్టాల్సి ఉంటుందనీ పేర్కోవడం రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలి. ప్రస్తుతం రాష్ట్రంలోనూ దేశంలోనూ వివిధ రాజకీయ పార్టీలలో వివిధ విభాగాల్లో ప్రతినిధులుగా వివిధ హోదాలలో పనిచేస్తున్నయువత సేవలను గుర్తించాలి. పెరిగిన జనాభా వల్ల నిరుద్యోగులకు ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించలేక పోయినా కనీసం ప్రజా ప్రతినిధులుగా ప్రజాసేవ చేయడానికి అవకాశం కల్పించాలని వివిధ రాజకీయ పార్టీలకు యువత విద్యావంతుల అభిప్రాయ పడుతున్నారు.
స్థానిక సంస్థల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులు కొన్ని సందర్భాలలో ప్రజాప్రతినిధులుగా గ్రామాలలో మహిళ ప్రజా ప్రతినిధులు. స్థానిక సంస్థలలో గెలిచి ప్రభుత్వ పని తీరు ఒక సంక్షేమ పథకాలపై అవగాహన లేక సభలు సమావేశాలలో ఉత్సాహ విగ్రహంగా ఉండి ప్రజలకు ప్రభుత్వానికి ఆశించిన మేరకు ఏమాత్రం ప్రజాప్రతినిధిగా పూర్తిస్థాయిలో సేవ అందించలేకపోతున్నారు.
చట్టసభలు కనీస విద్యార్హత
గ్రామ పంచాయితీ వార్డ్‌ మెంబర్‌ నుండి అసెంబ్లీ పార్లమెంటు కుపోటి చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతలు నిబంధన అమలు చెయ్యాలి. విద్యావంతలైన యువతకు స్థానిక సంస్థల నుండి చట్ట సభలకు ప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం కల్పించి సామాజిక ఆర్థిక వికాసంలో విజ్ఞాన వoతులను బాగస్వాములను చెయ్యాలి. ‘నేటి యువత రేపటి నాయకులు‘ అనే నినాదాన్ని మానుకొని ‘నేటి యువత నేటి నాయకులే ‘అన్న స్పృహ రాజకీయ పార్టీలకు కలుగాలి చట్ట సభలకు యువతను ప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం కల్పించి రాజకీయ పార్టీలు యువత రాజకీయాల్లో రాణించి ప్రజాసేవ చేయడానికి రాచబాట వెయ్యాలి. అభివృద్ధికర ఆదర్శవంతమైన భారత్‌ నిర్మాణములో అన్ని రంగాలలోనూ దూసుకుపోతున్న యువతకు రాజకీయ రంగములో ప్రవేశం కల్పించాలి. చట్ట సభల్లో అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కలిపించాలి. ప్రజాస్వామ్య పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలి. దేశంలో గుణాత్మక మార్పుల ఆవిష్కరణలో యువ శక్తి సామర్థ్యాలతో ముందుకు సాగాలి ఎవరికి తలవంచనీ రీతిలో సంపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో రాజకీయాలలో యువత ముందుకు సాగాలి.
మెరుగైన రాజకీయాలు యువత
యువత మెరుగైన సుస్థిర రాజకీయాలతో నేరమయ రాజకీయాలను అడ్డుకొని సుస్తిరాభివృధి కొరకు యువ శక్తి కృషి చెయ్యాలి. ‘లే మేలుకో రాజకీయాలలో ముందుకు సాగిపో’ లక్ష్యాన్ని సాధించే వరకు ఆగకు అన్న, ‘స్వామీ వివేకానంద బోధనల స్ఫూర్తితో’ నిరంతరం ముందుకు సాగాలి. యువశక్తిని అభివృధి వనరుగా తీర్చిదిద్దాలి. ప్రగతి శీల రాజకీయాలతో ‘స్వయంసమృద’ స్వావలం బన స్వదేశీ ఆత్మనిర్భర భారత్‌ ఆవిష్కరణకు ఉద్యమిద్దాం.
నేదునూరి కనకయ్య
తెలంగాణ ఎకనామిక్‌ ఫోరం అధ్యక్షుడు

  • 9440245771
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News