బనగానపల్లె మండలంలోని నందవరం గ్రామంలో వెలసిన శ్రీ కాశీ విశాలాక్ష్మి స్వరూపమైన శ్రీ నందవరం చౌడేశ్వరి దేవి చీర- సారె మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏటా ఆషాడ బహుళ చవితి రోజున అమ్మవారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చీర-సారె సమర్పణ నిర్వహించటం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా గ్రామంలోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం నుంచి ఉదయం 10.30 పెద్దఎత్తున ముత్తైదువులు చీరె సారేతో భక్తుల సందడితో కోలాటాల మధ్య, మంగళ వాయిద్య నృత్య వేద ఘోషల నడుమ అంగరంగ వైభవంగా ఊరేగింపుగా బయలుదేరి, అమ్మవారి ఆలయానికి చేరుకుని “అమ్మవారికి చీరె సారె” సమర్పణతో ముగిసింది.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నందవరం, బనగానపల్లె, నంద్యాల నుంచి వచ్చిన మహిళలు తమ ఇళ్ల నుండి చీర సారె తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించి, దేవి కృపాకటాక్షాలు పొందారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి రామానుజన్, మాజీ చైర్మన్ పీఆర్ వెంకటేశ్వరరెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు ఆలయ అన్నదానసత్రం, ఆర్యవైశ్య సత్రంవారు అన్నదాన వితరణ గావించారు.
నందవరం చౌడేశ్వరి మాత చీర-సారె మహోత్సవంలో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, వైకాపా అవుకు మండల ఇంచార్జ్ కాటసాని తిరుపాలరెడ్డి పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందారు. ఉదయం వారు నందవరం విచ్చేసి చెన్నకేశవ స్వామి ఆలయం నుంచి కోలాటాల మధ్య జరిగిన ఉత్సవంలో పాల్గొన్నారు. అనంతరం వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల ఆలయ ఈవో రామానుజన్ ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ పీఆర్ వేంకటేశ్వర రెడ్డి, బనగానపల్లె సిఐ తిమ్మారెడ్డి, నందివర్గం ఎస్సై రామంజనేయ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డిలు పాల్గొన్నారు.