Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Tobacco the great killer: ప్రాణాలు తీస్తున్న ఆకు.. పొగాకు

Tobacco the great killer: ప్రాణాలు తీస్తున్న ఆకు.. పొగాకు

నోటి క్యాన్సర్‌ లలో 90% పొగాకే కారణం

యుక్త వయస్సులో యువకులకు సరదాలు ఎక్కువ. ఆ సరదాలలో ఒకటి ధూమపానం. ముందు ఆనందంగా ఉంటుంది. తరువాత దానికి దాసోహం అయ్యి జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. దీనితో పాటుగా పొగాకుతో తయారు చేసిన ఖైని, పాన్‌ పరాగ్‌లు నములుతున్నారు. వీటిని విక్రయించే వారికి లాభాలు, వాడేవారికి జబ్బులు.. నోటి క్యాన్సర్‌ లలో తొంభై శాతం పొగాకే కారణం.
ప్రపంచంలో ఏడాదికి 70 లక్షల మంది పొగాకు, వాటితో తయారు చేసిన పదార్థాలు కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి. ఎనభై శాతం మరణాలు అల్ప, మధ్య ఆదాయం కలిగిన దేశాలలోనే ఉన్నాయి. పొగాకు వాడకం వలన వాడే వ్యక్తి యొక్క ఆయుః ప్రమాణం పదిహేను సంవత్సరాలు తగ్గిపోతుందని పరిశోధనలో తేలింది.
భారతదేశం పొగాకు ఉత్పత్తి లో మూడవ స్థానంలోను, వినియోగంలో రెండవ స్థానంలోను ఉంది. దేశంలో ఏడాదికి సుమారు పదమూడు లక్షల పొగాకు సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు . ఈ మరణాలలో పొగ త్రాగడం వలన 10 లక్షల మంది, ఇతర మార్గాల ద్వారా అనగా గుట్కా, పాన్‌ పరాగ్‌ వంటివి నమలడం ద్వారా 3 లక్షలు మంది చనిపోతున్నారని భారత దేశ జి.ఎ.టి (గ్లోబల్‌ అడల్ట్‌ టొబాకో ) సర్వే తెలిపింది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌, నోటి క్యాన్సర్లు, క్షయ వ్యాధి వలన ఎక్కువ మంది చనిపోతున్నారు. పొగాకు ఉత్పత్తులు వాడడం వలన గుండె పోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌, మధుమేహం , బి.పి, ఆస్థమా వంటి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. పొగాకులో ఉండే నికోటిన్‌ అనే రసాయనం ఆరోగ్యానికి ఎంతో హాని కల్గిస్తుంది.
ఎంత మంది పొగాకును తీసుకుంటున్నారు
జి.ఎటి 2 సర్వే ప్రకారం మన దేశ జనాభాలో 15 సం. వయస్సు కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో పొగాకును 28.6 శాతం మంది వినియోగిస్తున్నారు. 24.9 శాతం మంది ప్రతీ రోజు, 3.7 శాతం అప్పుడప్పుడు పొగాకు ఉత్పత్తులను తీసుకుంటున్నారు. 11.2 శాతం ఖైని రూపంలో, 7.7 శాతం బీడీ రూపంలో వాడుతున్నారు. వీటి వినియోగం పల్లెలలో కంటే ఎక్కువ పట్టాణాలలో ఉంది. ధూమపానం చేసే వారి పొగను 48.8 శాతం ఇళ్ళల్లో , 26.2 శాతం పనిచేసే ప్రదేశం లో, 7.4 శాతం రెస్టారెంట్లలో, 13.3 శాతం బస్‌లు, రైళ్లు లోనూ, 2.1 శాతం బార్లలోను, 2.2 శాతం సినిమాహాలులలో ఉండే వారు పీల్చుతున్నారు.కారణంగా వీరు కూడా రోగాల బారిన పడుతున్నారు. సిగరెట్లుకు బదులుగా ఇ సిగరెట్‌ లను కొంతమంది పీల్చుతున్నారు. దీనిలో నికోటిన్‌ వాయు రూపంలో ఉండడం వలన ఇవి కూడా హానికరమే. ఈ విషయం తెలియక చాలా మంది వీటిని ఉపయోగిస్తున్నారు.
పొగాకు పరిశ్రమలన వలన పర్యావరణానికి కూడా నష్టం వాటిల్లుతుంది. పొగాకు సాగు నుండి పరిశ్రమలలో వివిధ ఉత్పత్తులు తయారీ వరకు ఉండే దశలలో బయటకు వచ్చే వ్యర్థాలు కాలుష్య ముప్పును కల్గిస్తున్నాయి. పొగాకు ఉప ఉత్పత్తి లకు కావలసిన ఇతర సామగ్రి సమకూర్చుకోడానికి అడవుల్ని కూడా నరకాల్సి ఉంటుంది. ఈ పంట పండించడం వలన నేల క్షీణత జరుగుతుంది. పురుగు మందులు వాడడం ద్వారా జీవ వైవిధ్యానికి నష్ఠం కలుగుతుంది. ఇవేమీ తెలి యని పొగాకు పండించే రైతులు అనారోగ్యం పాలవుతున్నారు. మొక్కజొన్న సాగు, పశువుల మేత వంటి ఇతర వ్యవసాయ కార్యకలాపాలతో పోలిస్తే, పొగాకు పండించే భూములు వేగంగా ఎడారీకరణకి లోనయ్యే అవకాశాలు ఎక్కువ. జీవ వైవిధ్యం కూడా దెబ్బతింటుంది.
మన దేశంలో పొగాకును వాణిజ్య పంటగా పండిస్తు న్నారు. మొత్తం 0.45 మిలియన్‌ హెక్టార్లలో పొగాకును సాగు చేస్తున్నారు. ఈ పంటపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 కోట్ల 60 లక్షలమంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పొగాకు పం డించే రైతులును ప్రత్యామ్నాయ పంటలు పండించే ఏర్పాట్లు చేయాలి. వాటి స్థానంలో ఆహార పంటలు లేదా ఇతర వాణిజ్య పంటలు పండించాలి. ఇలా చెయ్యడం వలన దేశంలో ఆహార ఉత్పత్తులను పెంచవచ్చు. దీనికి ముందుగా రైతులను అవగాహన చేయాలి. ఇతర పంటలు పండించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు వారికి కల్పించాలి. విత్తనాలు పంపిణీ నుండి దిగుబడి వచ్చేంత వరకు వారికి సలహాలు ఇవ్వడానికి , సందేహాల నివృత్తికి సంప్రదింపులు చెయ్యడానికి ప్రత్యేకంగా ప్రభుత్వ విభాగాలు ఏర్పాటు చెయ్యాలి. పండే పంటను ప్రభుత్వం కొనుగోలు చేసే యంత్రాంగం ఉండాలి. పండించడానికి కావలసిన ఆర్థిక సహకారం బ్యాంకులు ఇచ్చేటట్లు చూడాలి. అంతకు మించి ప్రభుత్వాల నుండి భరోసా ఉండాలి. అంతే కాకుండా పొగాకు ఆధారిత పరిశ్రమలలో పనిచేసే వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్గించాలి.
భారతదేశం 2002లోనే చట్టాన్ని తెచ్చింది. ఆరోగ్య సం రక్షణ, విద్యా, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా రవాణా వంటి అనేక బహిరంగ ప్రదేశాలలో ధూమపానం పూర్తిగా నిషేధించబడింది. చాలా రకాల మాస్‌ మీడియా ద్వారా పొగాకు ఉత్ప త్తుల ప్రకటనలు నిషేధం. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు పొగాకు ఉత్పత్తులను విక్రయించడం నిషేధించబడింది.
పొగాకు వలన కలిగే దుష్ప్రభావాలను అందరికీ తెలియజేయాలి. పొగాకు ఉత్పత్తులు మానేయాలనే వారి కోసం పున రావాస కేంద్రాలను ఏర్పాటు చెయ్యాలి. నిషేధించిన పొగాకు ఉత్పత్తులను తయారీ చేసే వారి మీద, విక్రయించే వారిపై తగు చర్యలు తీసుకోవాలి. ఇది అంత సులువైన పనికాదు. కేవలం ప్రభుత్వాలు వలనే ఇది సాధ్యం కాదు. ప్రజల కూడా సహకారాన్ని అందించాలి. స్వచ్ఛంద సంస్థలూ ముందుకు రావాలి. అప్పుడే క్రమ క్రమంగా ఆశించిన ఫలితాలు పొందవచ్చు.

  • డీజే మోహన రావు
    9440485824
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News