ప్రధాని మోడీకి మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఎవరు రాష్ట్రానికి వచ్చిన కేసీఆర్ ని తిడుతున్నారని, మొన్న రాహుల్ వచ్చినా, ఈ రోజు మోడి వచ్చినా తిట్టుడే పని అంటూ హరీష్ రావు అన్నారు. ఢిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీలో తిడుతున్నారని, మోడీ ప్రభుత్వం మా పథకాలను కాపీ కొట్టిందని హరీష్ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ప్రతి పథకం పేరు మార్చి కాపీ కొట్టారని, మేం పని మంచిగా చేయకపోతే ఎందుకు మా పథకాలను కాపీ కొట్టారు..ఎందుకు ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారని ఆయన నిలదీశారు.
ప్రధాని మోడీ అంటున్నారు పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నాయి అని, పెట్టుబడులు వస్తున్నాయి అంటే కేసీఆర్ గొప్పతనమే కానీ ఇందుకు మీరు ఏం చేశారని మంత్రి హరీష్ దుయ్యబట్టారు. తెలంగాణకి చాలా నిధులు ఇచ్చాము అని ప్రధాని అంటున్నారని, మీరు డబ్బులు ఇవ్వలేదు..మాకు రావాల్సిన నిధులు ఆపారు, మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే నిజంగా మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వండి అంటూ మండిపడ్డారు. నీతి అయోగ్ చెప్పినా డబ్బులు ఇవ్వలేదని, బావుల కాడా మీటర్లు పెట్టలేదనీ 21 వేల కోట్లు ఆపింది మీరు కాదా అని హరీష్ నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధి ని మోడీ ప్రభుత్వం అడ్డుకుంటుందని, తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే కళ్ళలో మంటలు లేస్తున్నాయన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గిరిజన యూనివర్సిటీ ఇవ్వండి, కోచ్ ఫ్యాక్టరీ అడిగితే వ్యాగన్ యూనిట్ ఇచ్చారు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు, బురద జల్లుడు తప్ప మీరు చేసేందేమి లేదు, ఏమన్నా అంటే ఈడీ ఉపయోగిస్తున్నారు, మీకు ఈడీలు, సీబీఐలు అండగా ఉండవచ్చు..మాకు తెలంగాణ ప్రజలు అండగా ఉంటారని నిష్టూరాలాడారు.