అమ్మలకు పిల్లలే ప్రాణం. వాళ్ల కోసం ఏమైనా చేస్తారు. తమకు అసాధ్యం అనుకున్న దాన్ని సైతం సుసాధ్యం చేసుకుంటారు. అలాంటి తల్లే ఇక్కడ కనిపిస్తున్న శుభశ్రీ సాంత్య. తన పిల్లలకు ఆరోగ్యవంతమైన నూరేళ్ల జీవితాన్ని ఇవ్వాలనుకుందామె. అందుకే రసాయనాలకు తావు లేని, సేంద్రియ పద్ధతుల్లో పండించిన ఆహారాన్ని పిల్లలకు అందించాలని పూనుకుంది. అందుకోసం తన ఇంట్లోని చిన్న బాల్కనీలో మిద్దె తోటను ప్రారంభించింది. అలా మొదలైన ఆమె సేంద్రియ వ్యవసాయం నేడు ఏకంగా ఒక ఎకరం విస్తీర్ణం ఉన్న వ్యవసాయభూమికి విస్తరించింది. అందులో స్వచ్ఛమైన కాయగూరలతో పాటు పలు వరి వెరైటీలు, మిల్లెట్లు, ఇతర ధాన్యాలు పండిస్తోంది. ఆమె సక్సెస్ స్టోరీనే ఇది…
సేంద్రియ వ్యవసాయం వైపు శుభశ్రీ మళ్లడానికి ఆమె కొడుకే కారణం. ఆరు నెలల వయస్సులో ఆ బాబుకి గుండె ఆపరేషన్ జరిగింది. అప్పుడు పిల్లాడికి రసాయనాలు లేని స్వచ్చమైన ఆహారాన్ని పెట్టాలని వైద్యులు చెప్పారు. దాంతో తన ఇంట్లోనే కూరగాయ మొక్కలను పెంచాలనుకుంది. అలా నవీ ముంబయిలోని తన ఇంట్లోనే సేంద్రియ పద్ధతిలో కూరగాయ మొక్కలను పెంచడం మొదలెట్టింది. పిల్లల కోసం సేంద్రియ రైతుగా మారిన శుభశ్రీ చదివింది బిటెక్ మెకానికల్ ఇంజనీరింగ్. అందరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు మల్లే ఆమె కూడా పలు కంపెనీల్లో కొంతకాలం పనిచేసింది. పెళ్లయి పిల్లలకు తల్లయిన శుభశ్రీ జీవితం అనూహ్య మలుపు తీసుకుంది. కోవిడ్ పాండమిక్ సమయంలోనే ఆరు నెలల ఆమె కొడుకుకు గుండె జబ్బు ఉందని బయటపడింది. ఆ పిల్లాడి గుండెకు వైద్యులు సర్జరీ చేశారు. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే రసాయనాలకు తావులేని స్వచ్చమైన, కల్తీ లేని ఆహారాన్ని పిల్లవాడికి పెట్టాలని శుభశ్రీకి వైద్యులు సూచించారు. ఆ సంఘటన తను చదివిన చదువుకు పూర్తిగా భిన్నమైన వ్యవసాయరంగంలోకి శుభశ్రీ అడుగులు వేసేలా చేసింది. అలా అర్బన్ ఫార్మర్ అయింది.
తమ ఫ్లాట్ లోని చిన్న బాల్కనీలో రకరకాల మొక్కలు పెంచడం మొదలెట్టింది. ముఖ్యంగా వైద్యసుగుణాలున్న రకరకాల పాలకూర మొక్కల పెంపకంపై చూపుసారించింది. అలా ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఎదిగింది. ‘మా ఇంట్లో ఎవరికీ గుండె జబ్బులు లేవు. పైగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉన్న కుటుంబం మాది. వైద్యులు మా పిల్లవాడికి రసాయనాలు, పురుగుమందుల వాడకం లేని స్వచ్ఛమైన ఆహారం పెడితే మంచిదనడంతో ఎవరిపైనో ఆధారపడడం కన్నా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు నేనే పండిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన అప్పుడు నాకు వచ్చింది. ఇక ఆలస్యం చేయలేదు. మా ఫ్లాట్ లోని చిన్న బాల్కనీలోనే మిద్దె తోట ప్రారంభించాను. మొక్కలకు అవసరమైన ఎరువును కూడా నేనే తయారుచేసుకోవడం మొదలెట్టాను. వంటింటి వ్యర్థాలతో పాటు దగ్గరిలో ఉండే నర్సరీ నుంచి పేడపురుగులు వంటి వాటిని సేకరించి వాటితో ఎరువు చేసి మొక్కలకు వేసేదాన్ని’ అని శుభశ్రీ చెప్పారు. సేంద్రియ పద్ధతిలో కాయగూరలను పెంచుతూనే సాంప్రదాయ వరి వెరైటీలపై, మిల్లెట్లపై కూడా శుభశ్రీ పనిచేయడం ప్రారంభించింది. వీటిని పెంచడంలో తమిళనాడు తంజావూరు ప్రాంతంలోని సేంద్రియ రైతుల సహాయసహకారాలను తీసుకుంది. పదిరకాల ఆహార ధాన్యాలు పండించడం నేర్చుకుంది. నల్ల బియ్యం, ఎర్ర బియ్యంను పండించడమే కాకుండా ధాన్యం, మిల్లెట్లు, కొన్ని రకాల పప్పు గింజలను కలిపి పొడి చేసి అమ్మడం మొదలెట్టింది. ఈ పొడితో జావ లేదా గంజి చేసుకుని తాగితే శరీరానికి ఎంతో మంచిది. మడ్ అండ్ మదర్ బ్రాండుతో తాను చేసిన పొడులను అమ్మడం మొదలుపెట్టింది. ఈ పొడుల్లో పోషకాలతో పాటు ఖనిజాలు, యాంటాక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్, పొటాషియం, కెరటొనాయిడ్స్ ఉన్నాయి. తన పిల్లలకు పోషకాలతో నిండిన ఆహారాన్ని అందిస్తున్నానన్న త్రుప్తి తల్లిగా శుభశ్రీకి ఎక్కువ సంతోషాన్ని ఇస్తోంది.
ఇంజనీర్ అయిన ఆమెకు వ్యవసాయమంటే అస్సలు తెలియదు. కానీ పిల్లల ఆరోగ్యం కోసం వ్యవసాయం గురించి స్వయంగా అన్నీ తెలుసుకుంది. ఎంతో కష్టపడి రకరకాల వ్యవసాయపద్ధతులను నేర్చుకుంది. తొలుత పాలకూర, బెండకాయలు, టొమాటోలు, తెల్ల గుమ్మడి వంటి వాటిని సేంద్రియ పద్ధతిలో పండించడం మొదలెట్టింది. సేంద్రియ పద్ధతిలో కాయగూరలు పండించాలనకుంటున్న తమ దగ్గరలోని అపార్ట్ మెంట్లలో ఉంటున్న తల్లులతో కలసి ఒక వాట్సప్ గ్రూపును శుభశ్రీ ఏర్పాటుచేసింది. నవి ముంబయిలో ఫ్లాట్ కొనాలని కూడబెట్టుకున్న డబ్బుతో ఫామ్ కొనింది. ఇప్పుడు అక్కడే ఆమె వ్యవసాయ కార్యకలాపాలన్నీ సాగుతున్నాయి. తన పిల్లాడికి మల్లే గుండె ఆపరేషన్లు జరిగిన పిల్లల తల్లులు ఆర్గానిక్ కూరగాయలు కావాలంటూ శుభశ్రీని అడగడంతో తన వ్యవసాయాన్ని మరింత విస్తరింపచేయాలని శుభశ్రీ భావించింది. పూర్తిస్థాయి సేంద్రియ రైతుగా మారేందుకు ఐఐటి ఖరగ్ పూర్ నుంచి సస్టైనబుల్ అగ్రికల్చర్ డిగ్రీలో పట్టా కూడా తీసుకుంది. పిల్లలందరికీ కల్తీ లేని, రసాయనాలకు తావులేని ఆహారం అందించాలన్నదే శుభశ్రీ లక్ష్యం. కోయంబత్తూరు, పాండిచ్చేరిలోని రైతులతో మూడు నెలల పాటూ ఉంటూ వారి నుంచి సేంద్రియ వ్యవసాయం గురించిన ఆనుపానులన్నింటినీ తెలుసుకుంటుంటుంది. ఒక తల్లిగానేకాదు పట్టణ ప్రాంత మహిళా సేంద్రియ రైతుగా కూడా శుభశ్రీ ఎందరికో స్ఫూర్తి అనడంలో సందేహం లేదు.