Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్ABVP a movement for nation: దేశం కోసం 76 ఏళ్ల ఒక విద్యార్థి...

ABVP a movement for nation: దేశం కోసం 76 ఏళ్ల ఒక విద్యార్థి ఉద్యమం

దేశం కోసం జీవిద్దాం.. దేశం కోసం మరణిద్దాం

1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వచ్చింది ఆ సందర్భంగా నెహ్రూ నేతృత్వంలో పాలన దేశాన్ని ఏ విధంగా నడపాలి అంటూ అంబేద్కర్‌ నేతృత్వంలో రాజ్యాంగ రచన సాగుతుండగా మరోవైపు వివిధ స్వతంత్ర రాజ్యాలను సర్దార్‌ పటేల్‌ స్వతంత్ర భారతంలో కలుపుతూ సాగుతున్న సందర్భంలో ఢిల్లీ యూని వర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ ఓం ప్రకాష్‌ బెహలె అసలు ఈ దేశం ఎందుకు స్వాతంత్రం కోల్పోయింది? వచ్చిన స్వాతంత్రం మళ్ళీ కోల్పోకుండా ఉంటుందా? మరి వచ్చిన స్వాతంత్రాన్ని ఎలా కాపాడుకోవాలంటూ ఆలోచింపసాగారు. అసలు ఈ దేశం స్వాతంత్రం కోల్పోవడానికి గల కారణాలను పొరపాటులను తెలుసుకొని భవిష్యత్తులో అటువంటి కారణాలు పొరపాట్లు తలెత్తకుండా జాగ్రత్త పడితే చాలు కదా అని తలిచి దేశ చరిత్రను పరిశోధించగా ఆ పరిశోధన ఫలితం ఏమి వచ్చిందంటే అసలు ఈ దేశ ప్రజలు ముఖ్యంగా యువత తమ జ్ఞానాన్ని తమ శీలాన్ని సమాజం పట్ల ఉండవలసిన ఏకత భావన, దేశభక్తి, స్వాభిమానం కోల్పోవడం, స్వార్ధం పెంచుకోవటం వలన విదేశీ యులు వాటిని ఆయుధాలుగా మలిచి ఈ దేశాన్ని 1000 సంవత్సరాలు పాలించారు అని తెలుసుకున్నారు.
కావున ఈ దేశ యువతలో మళ్లీ జ్ఞానాన్ని శీలాన్ని, ఏకతను, దేశభక్తి, స్వాభిమానం రగిల్చి వ్యక్తి నిర్మాణం చేస్తే చాలు ఈ జాతి పునర్నిర్మాణం అవుతుంది తద్వారా ఈ దేశం విశ్వగురువు అవుతుంది అని భావించారు. కానీ స్వతంత్ర భారతంలో ఈ కార్యాన్ని చేయవలసిన పాలకుల వైఖరి ఆ దిశగా ఆలోచించకపోగా మెకాలే విద్యా విధానాన్ని కొనసాగించడం చూసి ఈ దేశంలో ముందు ముందు రాబోవు సమస్యలను ముందుగా గ్రహించి ఆ సమస్యల పరిష్కారానికి అదేవిధంగా జాతీయ పునః నిర్మాణముకై సంకల్పించి అందుకు ఒక మార్గాన్ని వారెనుకున్నారు. ఆ మార్గమే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ).
ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు కోట్లాది మంది విద్యార్థి యువతతో మమేకమై దేశ ప్రయాణంలో కీలక పాత్ర పోషించింది. 1948 జులై 9న జాతీయ విద్యార్థి దినోత్సవం రోజున కేవలం ఐదు మంది విద్యార్థులతో ఢిల్లీ యూనివర్సిటీలో ప్రారంభమైన ఏబీవీపీ విద్యార్థుల కోసం సమాజం కోసం దేశం కోసం క్షణం క్షణం మా కణం. కణం భరత మాతకే సమర్పణం అంటు ముందుండి పని చేస్తూ.. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా నిలిచి 76వ వసంతంలోకి అడుగుపెడుతుంది.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో వందేమాతర గీతాన్ని జాతీయ గీతం చేయాలని వివిధ రాష్ట్రాలకు అక్కడి ప్రాంతీయ భాషలను రాష్ట్ర భాషగా హిందీని అధికారిక భాషగా గుర్తించాలని, రాజ్యాంగంలో ఇండియా పేరును భారత్‌గా మార్చాలని ఏబీవీపీ ఉద్యమం చేసింది.
దేశంలో విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ఎన్నో రాజీ లేని పోరాటాలు చేసింది అందులో దేశం చూపు మొత్తం ఏబీవీపీ వైపు తిప్పిన ప్రముఖ ఉద్యమాలలో ఒకటి విద్యార్థులపై పన్ను భారం లేని విద్యను కొనసాగించాలని డిమాండ్‌ చేయగా ప్రభుత్వం పన్నును రెండింతలు చేయడం తో ఏబీవీపీ దేశం మొత్తం ఆందోళన నిర్వహించింది దీనితో 1968లో డీఎస్‌ కొఠారిని యుజిసి చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. 1968లో విద్యపై కేంద్రము ఒక విధానాన్ని ప్రకటించింది.
1973లో గుజరాత్‌ రాష్ట్రంలో ఎల్డీ ఇంజనీరింగ్‌ కాలేజీ మోర్వి పాలిటెక్నిక్‌ కాలేజీలో మెస్‌ ఫీజుల పెంపు నిర్ణయానికి వ్యతిరేకిస్తూ ఏబీవీపీ సాగించిన ఉద్యమం కారణంగా నాటి చిమన్‌ భాయ్‌ పటేల్‌ ప్రభుత్వం గద్దె దిగవలసి వచ్చింది గుజరాత్‌ లాగే బీహార్లు కూడా ఉద్యమం ప్రారంభమైంది. 1974 మార్చి 19న ఉద్యమానికి నేతృత్వం వహించమని జయప్రకాష్‌ నారాయణను కోరింది. అసెంబ్లీ ముందు ధర్నాలు కర్ప్యూల నడుమ నడిచిన ఈ ఉద్యమం 1975 జూన్‌ 20న ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడంతో ప్రజా ఆందోళనగా మారింది సుమారు 5వేల మంది విద్యార్థి పరిషత్‌ కార్యకర్తలు మీసా చట్టం కింద అరెస్టు చేసి జైల్లో బంధించారు ఎమర్జెన్సీ తర్వాత అనేక విద్యార్థి సంఘాలు జనతా పార్టీలో కలిసిపోయాయి కేవలం ఏబీవీపీ మాత్రం జాతీయ పునర్నిర్మాణంలో ముందుకెళ్లాలని నిర్ణయించుకుంది.
1982లో కాకతీయ యూనివర్సిటీని నాటి ఆర్‌ఎస్‌యు కార్యకర్తలు కారల్‌ మారక్స్‌ యూనివర్సిటీగా పిలుచుకునేవారు గణతంత్ర దినోత్సవం రోజున యూనివర్సిటీ ఉపకులపతి జాతీయ జెండా ఎగరవేసిన తర్వాత దానిని దింపేసి నల్లజెండాను ఎగురవేస్తారు అక్కడ ఉన్న వారు ఎవరు కూడా స్పందించలేదు. కానీ జాతీయ జెండాకు జరిగిన అవమానాన్ని చూసి తట్టుకోలేక ఏబీవీపీ కార్యకర్త సామా జగన్‌ మోహన్‌ రెడ్డి వారిని ఎదిరించి జాతీయ జెండాను ఎగరవేశారు. దీంతో ఆర్‌ఎస్‌యు కార్యకర్తలు అతడిని కిరాతకంగా చంపి వేస్తారు. ఇలా దేశం కోసం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే 30 మంది కార్యకర్తలు ప్రాణాలు సైతం త్యాగం చేసి దేశం కోసం జీవిద్దాం.. దేశం కోసం మరణిద్దాం.. అంటూ నేటి తరానికి దేశభక్తిని చాటారు.
బంగ్లాదేశ్‌ అక్రమ చొరబాటు దారులకు వ్యతిరేకంగా 1983 నుండి సేవ్‌ అస్సాం ఉద్యమం చేసింది. బంగ్లాదేశ్‌ సరిహద్దులను మూసివేయాలని అక్రమ చొరబాటు దారులను వారి స్వస్థలాకులు పంపివేయాలని 2008 డిసెంబర్‌ 17న బీహార్‌ సరిహద్దులోని చికెన్‌ దగ్గర 50 వేల మందితో ఆందోళన నిర్వహించింది.
1990లో ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించి శ్రీనగర్‌ లాల్‌ చౌక్లో జాతీయ జెండాను కాల్చి దేశానికి జెండాను ఎగరవేయాలని సవాలు విసిరినప్పుడు ఛలో కాశ్మీర్‌ కార్యక్రమంతో దాదాపు పదివేల మంది కార్యకర్తలతో అదే లాల్బౌక్లో జాతీయ జెండాను ఎగురవేసి జాతి గౌరవాన్ని నిలిపి ఆర్టికల్‌ 370 రద్దుకై డిమాండ్‌ చేసింది.
తెలంగాణలో బీడు భూములు గోదావరి కృష్ణ జలా లతో సస్యశ్యామలంగా మారాలని 1997లో తెలంగాణ సస్యశ్యామల యాత్ర పేరిట బాసర నుండి శ్రీశైలం వరకు యాత్ర నిర్వహించింది. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును పెట్టాలని 2009లో నిజాం కాలేజ్‌ గ్రౌండ్‌లో లక్ష మంది విద్యార్థులతో విద్యార్థి రణభేరిని మోగించింది. నా రక్తం నా తెలంగాణ పేరుతో ఒకేరోజు 22,000 మంది విద్యార్థులతో రక్తదానం చేయించి చరిత్ర సృష్టించింది.
కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశం మొత్తం కూడా ఏబీవీపీ కార్యకర్తలు సహాయ కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వలస కూలీలకు ప్రయాణ సమయంలో భోజనం ప్యాకెట్లు అందించడంతోపాటు కరోనా సమయం లో కడుపేద కుటుంబాలకు రోజుల తరబడి నిత్యవసర సరుకులను, కరోనా సోకిన పేద ప్రజలకు మెడిసిన్‌ అందించింది. ఆన్లైన్‌ తరగతులు ప్రారంభమై అనేక మంది నిరుపేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్న సందర్భం లో పరిషత్‌కి పాఠశాల పేరుతో పేద మధ్యతరగతి బస్తీలలో ఉండే విద్యార్థులకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రత్యక్ష తరగతులు నిర్వహించారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కరోనా సోకిన వ్యక్తి యొక్క అంత్యక్రియలు కూడా నిర్వహించారు.
ఏబీవీపీ నేడు 55 దేశాల్లో తన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అలాగే థింక్‌ ఇండియా పేరుతో ఎన్‌ఐటీ, ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌సీ ఎన్‌ఐపీఈఆర్‌, లాంటి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల విద్యార్థులతో కలిసి పనిచేస్తుంది. ఎస్‌ఈఐ ఎల్‌ (స్టూడెంట్స్‌ ఎక్స్పీరియన్స్‌ ఇన్‌ ఇంటర్‌ స్టేట్‌ లివింగ్‌) పేరుతో ఏబీవీపీ రూపొందించిన వేదిక కొన్ని వేర్పాటు వాద సంస్థలు విషబీజాలు నాటుతున్న ఈశాన్య భారత విద్యార్థులను దేశమంతా పర్యటింపజేసి ఇక్కడి కుటుంబాలతో కలిసి జీవించడం ద్వారా ఇక్కడి విద్యార్థుల, ప్రజల ఆత్మీయతను అనురాగాలను, సాంస్కృతిక అనుబంధా లను విద్యార్థులు ఆకలింపు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏబీవీపీ నడుపుతున్న మరొక వేదిక డబ్ల్యూఓఎస్‌వై (వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ అండ్‌ యూత్‌) ఉన్నత విద్య కోసం ఇక్కడికి వస్తున్న విదేశీ విద్యార్థులకు మన సంస్కృతిని, జీవన విధానాన్ని అర్థం చేయించడం కోసం దీపావళి, రక్షాబంధన్‌ లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ నిజమైన వసుదైక కుటుంబం అనే భారతీయ భావన వ్యాప్తి చెందిస్తుంది. అదేవిధంగా స్టూడెంట్‌ ఫర్‌ డెవలప్మెంట్‌, స్టూడెంట్‌ ఫర్‌ సేవా, రాష్ట్రీయ కళామంచ్‌ ఖేల్‌ వంటి ఫోరమ్స్‌తో విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా వారి వికాసం, సమాజ సేవలో వారిని మమేకం చేస్తుంది. అదేవిధంగా మెడికల్‌ స్టూడెంట్స్‌ కోసం మెడివిజన్‌ అగ్రికల్చర్‌ స్టూడెంట్స్‌ కోసం అగ్రి విజన్‌ ఫార్మసీ స్టూడెంట్స్‌ కోసం ఫార్మా విజన్‌ ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్‌ కోసం టెక్నికల్‌ సెల్‌ లా విద్యార్థుల కోసం లా ఫోరం వేదికల ద్వారా ఆ విద్యార్థుల నడుమ దేశం కోసం పనిచేయాలని భావనను పెంపొందిస్తూ ఏబీవీపీ నేడు సర్వ వ్యాప్తి సర్వస్పర్షిగా నిలిచి ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా నిలిచింది.
ఛత్రపతి చౌహన్‌
ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు
8074480911

- Advertisement -

(నేడు ఏబీవీపీ స్థాపన దినోత్సవం)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News