Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Rajasthan Congress: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో రాజీ రాజకీయాలు

Rajasthan Congress: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో రాజీ రాజకీయాలు

నివురు కప్పిన నిప్పులా రాజస్థాన్ కాంగ్రెస్ వ్యవహారం

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, మాజీ ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ మధ్య ఉన్న విభేదాలకు, వివాదాలకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎట్టకేలకు తెరదించినట్టు కనిపిస్తోంది. రాజస్థాన్‌ శాసనసభకు త్వరలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో గెహ్లాట్‌, సచిన్‌ లు వాదోపవాదాలలో, విమర్శలు, ప్రతివిమర్శలతో వీథులకెక్కడం సమంజసంగా లేదని భావించిన అధిష్ఠానం ఈ సమస్యకు ముగింపు పలికింది. రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ను సంస్కరించడం జరుగుతుందని, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష పత్రాలు లీక్‌ అవడంపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పార్టీ ప్రకటించడంతో ఈ ఇద్దరు నాయకుల మధ్య వివాదాలు కొద్దిగా సమసిపోయినట్టు కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియా ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలతో పాటు రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పై వచ్చిన ఆరోపణలపై కూడా విచారణ జరిపించాలని పైలట్‌ పట్టుబట్టడం వల్లే ఈ ఇద్దరి మధ్యా ఇటీవలి కాలంలో వివాదం రాజుకుంది.
నిజానికి ఇవన్నీ పైకి కనిపించే కారణాలు మాత్రమే. సచిన్‌ పైలట్‌ ప్రధాన ఆరోపణ ప్రభుత్వంలో తనకున్న స్థానం విషయంలోనే. సచిన్‌ పైలట్‌ను బుజ్జగించడానికి పార్టీ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ కూడా తనవంతు ప్రయత్నం చేశారు. వెనుకటి బీజేపీ ప్రభుత్వం లో జరిగిన అవినీతి కుంభకోణాల గురించే ఎక్కువగా ప్రచారం చేయాలని ఆయన సూచిం చారు. గెహ్లాట్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి అతిగా ప్రచారం జరగడాన్ని పైలట్‌ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాగా, పార్టీ అంతర్గత వ్యవహారాలను బహిరంగ పరిచేవారి పట్ల పార్టీ కఠినంగా వ్యవహరిస్తోందంటూ రాహుల్‌ గాంధీ చేసిన హెచ్చరిక పట్ల గెహ్లాట్‌ వర్గం సంతృప్తి వ్యక్తం చేసింది. గెహ్లాట్‌ ప్రభుత్వ సాఫల్యాలను ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని కూడా ఆయన ఆదేశించారు.
రాజస్థాన్‌ రాష్ట్రంలో సాధారణంగా ఒకే పార్టీ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండే అవకాశం తక్కువ. ఎన్నికల్లో ప్రభుత్వాలను మార్చడం జరుగుతుంటుంది. అయితే, ఈసారి కూడా తానే అధికారంలోకి రావాలని గట్టి నిర్ణయంతో ఉన్న అశోక్‌ గెహ్లాట్‌ తన ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. తమ ప్రభుత్వం ధరల పెరుగుదలను అరికట్టిందని, ప్రజలకు ఎటువంటి కష్టనష్టాలు ఎదురైనా తమ ప్రభుత్వం ఆదుకుంటూనే ఉందని ఆయన, ఆయన వర్గం ప్రచారం చేస్తున్నారు. వంట గ్యాస్‌ సిలెండర్లను 500 రూపాయలకే అందజేయడం, ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు బీమా కల్పించడం వంటివి ఆయన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో ముఖ్యమైనవి. రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటిస్తూ ఆయన ఈ పథకాలకు ప్రచారం కల్పిస్తున్నారు. అయితే, ఈ పథకాల కం ప్రజలు ఎక్కువగా గెహ్లాట్‌, పైలట్‌ ల వివాదాలకే ప్రాధాన్యం ఇవ్వడం, వాటి గురించే ఎక్కువగా చర్చించుకోవడం జరుగుతోంది.
కాంగ్రెస్‌ పార్టీలో తనకు భవిష్యత్తు లేదని భావిస్తున్న పైలట్‌ శాసనసభ ఎన్నికలలోగా కాంగ్రెస్‌ నుంచి బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే, 2018లో ఈసారి ఎన్నికల్లో ఎక్కువ సీట్లతో విజయం సాధిస్తుందంటూ ఇటీవల పైలట్‌ ఒక ప్రకటన చేసినప్పుడు కాంగ్రెస్‌ లో కొద్దిగా ఊరట కనిపించింది. 2018లో ఆయన పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు. అంతర్గత ఐక్యత కూడా సాధ్యమైనప్పుడే పథకాల ప్రచారం కూడా విజయవంతం అవుతుంది. కానీ, ఇక్కడ అలా జరగడం లేదు. వరుసగా రెండవ పర్యాయం కూడా అధికారంలోకి రావాలన్న పక్షంలో కాంగ్రెస్‌ పార్టీ అతి జాగ్రత్తగా తమ అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ వ్యూహాన్ని ఎదుర్కోవడానికి సరైన వ్యూహాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటిదేమీ జరుగుతున్న సూచనలు లేవు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News