Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Telangana slang: దళిత నవల సూర -తెలంగాణ భాషా పరిశీలన

Telangana slang: దళిత నవల సూర -తెలంగాణ భాషా పరిశీలన

దళిత నవల సూర చదివారా?

భారత సాహిత్య చరిత్రలో అందుబాటులో ఉన్న సాహిత్యాన్ని చూస్తే 1954 లో సాహిత్యంలో ‘దళిత‘ అనే పదం వాడింది,హైదరాబాదుకు చెందిన మాజీ మంత్రి శంకర దేవ్‌. ఇతను బీదర్‌ నుంచి హైదరాబాద్‌ అసెంబ్లీకి శాసనసభ్యుడిగా ఎన్నికై, బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉన్నారు.
దళిత పద వివరణ

- Advertisement -

దళిత అంటే మరాఠి భాషలో విధ్వంస మైన అని అర్థం. జ్యోతిరావు పూలే మొదట ఈ పదాన్ని వాడుక లోకి తెచ్చాడు. సమాజంలో అత్యంత వెనుకబడిన, కులవివక్షకు గురవుతున్న అతిశూద్రులను దళిత అనే పేరుతో పూలే గౌరవించాడు.
NCERT ప్రచురించిన social and political life – 1, ప్రకారం Dalit is a term that people to belonging to socalled lower castes use to address themselves.They prefer this word to untouchable. Dalit means those who has been broken, this word according to Dalits shows how social prejudices and Discrimination have broken the Dalit people. the government refers to this group of people as scheduled castes (SC).
దళిత అనే పదం 1972 తర్వాత విస్తృతంగా వాడుక లోకి వచ్చిందని చెప్పవచ్చు. కారణం ‘రాజాదలే’తో కలిసి ‘నామ్దేవ్‌ దస్సాల్‌’ దళిత్‌ పాంథర్స్‌ను స్థాపించడం. మహా రాష్ట్రలో వచ్చిన ఈ మూమెంట్‌ దేశం మొత్తం వ్యాపించి సాహిత్య రంగంలో రచనలు చేయడానికి ఊపిరులు ఊదిం దని అని చెప్పవచ్చు.
తెలుగు సాహిత్యంలో దళిత నవలలు తెలుగు సాహిత్యాన్ని పరిశీలించినట్లయితే ఆధునిక సాహిత్యంలో అభ్యుదయ, దిగంబర, విప్లవ, స్త్రీవాద, ముస్లింవాద సాహిత్యంతో పాటు దళిత కవిత్వం, కథ, నవల సాహిత్యాలు, తెలంగాణ భాష ను ఎంతో ప్రభావితం చేశాయని చెప్పవచ్చు.
దళితుల జీవితాలే కథావస్తువుగా జీవన చిత్రణే కథాంశంగా ఎన్నో నవలలు మన తెలుగు భాషలో తెలంగాణ యాసలో వచ్చినవి వాటిలో కొన్నింటి పేర్లు పరిచయం చేస్తాను. మాలపల్లి- ఉన్నవ లక్ష్మీనారాయణ, వీర మల్లుడు- విశ్వనాథ సత్యనారాయణ, బలిపీఠం- ముప్పాళ్ళ రంగ నాయకమ్మ, నీ బాంచెన్‌ కాళ్ళు మొక్కుతా- ఇల్లిందల సరస్వతీదేవి, మిస్సెస్‌ కోకిల- హేమలత, కోటిగాడు- కె.రామలక్ష్మి, సూర్య నారాయణ రావు, మాతృ మంది రం- వెంకట పార్వతీశ కవులు, హరిజన నాయకుడు- ఆచార్య రంగా, నరుడు- అడవి బాపిరాజు, ఆదర్శం- అంతటి నరసింహం, మల్లిక- రంగనాయకులు, త్రివర్ణ పతాకం- మల్లాది వసుంధర్‌, స్మశానం దున్నేరు- చివరి గుడిసె, రాముడున్నాడు,- కేశవ రెడ్డి, గాలి విరిగిన కెరటాలు- నండూరి సుబ్బారావు, వేర్లు- కేతు విశ్వనాధ రెడ్డి, చీకటి చెదిరింది- దాశరధి రంగాచార్య, నైమి శరణ్యం- ఎన్‌.ఆర్‌.నంది, సోరాజ్జెం, మోహనరాగం, అక్కి నేని కుటుంబరావు, కుల కన్య, అంతులేని అమావాస్య- భూపతి రామారావు, తకధిమి తకధిమి తోలు బొమ్మ- కప్పగంతుల మల్లికార్జునరావు, అసుర గణం -వరహా ప్రసాదరావు, రాకాసి కోన- ఆంజనేయులు నాయుడు; రామరాజ్యానికి రహదారి- పాలగుమ్మి పద్మరాజు, కులం లేని మనిషి -కొడవటిగంటి కుటుంబరావు, గాజు పాలెం గాంధీ- జగన్మోహనరావు, వేకువ- రావూరి భరద్వాజ, నవ కళ్యాణం -ముదిగొండ శివప్రసాద్‌, అద్దంలో చంద మామ, పంచమం – చిలుకూరి దేవపుత్ర, కాకీ బతుకు లు- జి. మోహన రావు, నిప్పుల వాగు-పినాకపాణి, బతుకు పోరు- బి.ఎస్‌.రాములు, ఎల్లి-అరుణ, అంటరాని వసంతం- జి కళ్యాణ రావు, కక్క, సిద్ధి- వేముల ఎల్లయ్య, జగడం, జాతర, పుట్టుమచ్చ- బోయ జంగయ్య, సూర, ఇగురం-భూతం ముత్యాలు, సమత, అనాధ సౌభాగ్య వతి- కొలకలూరి ఇనాక్‌, కొంగవాలు కత్తి-గడ్డం మోహన రావు.
వీటన్నింటిలో దళితులు రాసినవి తక్కువే అయినప్ప టికీ అవి వారి నిజ జీవిత చిత్రాలను కళ్ళముందు కదలాడి స్తాయి. అయితే దళిత రచయిత భూతం ముత్యాలు దృష్టి లో దళితులు రాసిందే నిజమైన దళిత సాహిత్యమని, వారి జీవితాలు వర్ణించడం మిగతా వారి వల్ల కాదని వారి జీవి తంలో 70 ఏళ్ల స్వాతంత్య్రంలో కూడా వివక్ష పోలేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పసునూరి, కొలకలూరి, మద్దూరి, కలేకూరి, నుండి దళిత కవిత్వాలు కథలు విరివిగా వస్తే, వేముల ఎల్లయ్య, భూతం ముత్యాలు, బోయ జంగయ్య, గడ్డం మోహన్‌ రావులు దళిత నవలా సాహిత్యంతో తెలంగాణ భాష, యాసలో తమ జీవితాలను, దళిత బతుకుల వెతలను ప్రతిబింబించారు. పై నలుగురు నల్లగొండ జిల్లాకు చెందిన వారు. తమ యాస తో పాటు తెలంగాణ భాష ను తెలుగు సాహిత్యానికి పరిచయం చేసిన విశిష్ట రచయితలు గా వీరిని గుర్తించవచ్చు.
సూర దళిత నవల కథా పరిచయం భాషా పరిశీలన
‘తెలంగాణ భాష అంటే తెలంగాణ ప్రజలు మాట్లాడే భాష’ అని అర్థం. తెలుగు సాహిత్యంలో తెలంగాణ యాస కు విశిష్ట మైన స్థానం ఉన్నది. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా మంది కథా, కవితా, నవలా రచయితలు నిరూపిం చారు. అందులో భాగంగానే తెలంగాణ మాండలిక భాష, విశేషాలను పరిశీలించ వచ్చు.
సూర నవలా రచయిత భూతం ముత్యాలు, నల్లగొండ జిల్లా, నాంపల్లి మండలం, తిరుమలగిరి గ్రామానికి చెందినవారు. ఈనవల ప్రధమ ముద్రణ 2004లో అ య్యింది. రచయిత భూతం ముత్యాలు ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. సూర నవలలో చెంద్రి, చెన్నని కుమారుడైన సూరడు చదువుకొనిగ్రామంలో పెత్తందారులైన కాశిరెడ్డి, నాగి రెడ్డిల దోపిడీ నుండి దళిత సమాజాన్ని కాపాడడం ఆ సమయం లో అంబేడ్కర్‌, పూలే పాఠశాల పెట్టి విద్యను నేర్పి గో బ్యాక్‌ టు విలేజెస్‌ నినాదం ఇచ్చి, కులాంతర వివాహాలను ప్రోత్సాహించి ప్రోత్సహించి మూడనమ్మకాల నుంచి ప్రజలను విముక్తం చేసి, సమాజాన్ని సంస్కరిం చడం ద్వారా, దళితుల ఆత్మ గౌరవం పెంచి, దోపిడీ దారు లను చంపి తమ తిరుగు బాటు ను చూపించే తు విధంగా ఈ నవల నిజ జీవిత చరిత్రను మనుకు పరిచయం చేస్తుంది.
ఇందులో రచయిత మొత్తం తెలంగాణ భాషను, పక్కా నల్లగొండ యాసను ఉపయోగించి, కొత్త పద ప్రయో గం చేస్తూ సన్నివేశాలను వివరించారు.
తెలంగాణ భాషా పరిశీలన
‘గొర్కోల్లు పొడిసినయ్‌ మూలసుక్క నడినెత్తికెక్కింది. రేకలు వారనికే జాము పొద్దుంది. ముసలోల్లు సిన్నగ సరా యించ్కుంటు మేల్కొంటుండ్రు. పచ్చులు కిసకిస లాడ్తు న్నాయ్‌. అద్దమ్మ రేతిరి కాడనే లేసి కూసున్నడు మాల చెన్నడు. నిద్రోస్తలేదు. తెగిన నుల్క మంచంల గూకొని గుడ్సే కాయి సూస్కుంట ఎప్పుడు ఎప్పుడు తెల్లార్తదని ఎదురు చూడబట్టే కున్కు తీద్దా మంటే నిద్రొస్తలేదు’ రచయిత తెలంగాణ భాష యాసతోనే నవలను ప్రా రంభించాడు. 20వ శతాబ్దం ప్రథమార్థంలో తెలంగాణ ప్రాంతం భూస్వాముల ఏలుబడిలో ప్రజలు వెట్టి చాకిరీ చేస్తూ బానిస బతుకులీడుస్తూ ఉండేవారు. ఆ కాలం లో పొలానికి నీళ్లు పెట్టడానికి రాత్రివేళ ప్రతీ రైతు, కూలీ సమ యమును చూసుకునేది ఆకాశం వైపు చూసే అన్న విష యంను రచయిత చెప్పాడు. మోట తోలడానికి ఈ గొర్కో ల్లు (ఆకాశం లో అర్థరాత్రి వేళ దాటిన తర్వాత ఒకదగ్గరే వచ్చే నక్షత్రాలు ఇవి ఒకదాని కింద ఒకటి మూడు వరు సగా ఉంటాయి), మూలసుక్క (సమయాన్ని సూచించే నక్షత్రం) పదాలను తెలంగాణలోని ప్రతీ పల్లెలో ఉపయో గించేవారు.
ఈ నవలలోని ప్రతి పాత్ర పక్కా నల్లగొండ యాసలో మాట్లాడి తెలంగాణలో మరుగున పడుతున్న ఎన్నో కొత్త పదాలను వెలికితీసి పాఠకునికి, సాహిత్య లోకానికి అం దించినది. భాషా శైలిల విషయంలో రచయితను మెచ్చుకో కుండా ఉండలేం. నల్లగొండ మాండలికం తెలుగు భాషా ప్రియుల్ని, పాఠకుల్ని, అంత తొందరగా ముందుకు సాగ నీయదు. ఈ కింది వాక్యాలను ఒకసారి పరిశీలిస్తే తెలు స్తుంది.
అరే తూ నీ యవ్వ దత్రాలోడ అంత బుగులెంద్కురా, నీకు గింత పీర్కి మందేవడ్రా పోసింది/అరే ఇగ నడురష ఎవనిమొగమెసొంట్దో, తుసుక్కున తుమ్మేరు తుష్కేరు / ఒరక్కో దీని మొగుడెర్రోడైనా ఇది బలే మాట కీర్దిరా, లోడ లోడ ఒకటే వాగుద్ది, ఏ మాట కా మాట అత్కేస్తది /ఇదే అదునుగ అక్కడ ముషమ్మ పండ్గకు దున్నపోతు తల దెగాలె, బొడ్రాయి మీదికి లేపాలె, ఊల్య బలిజల్లాలె. అదే సమయాన ఆన్ని, ఆయం తెల్వకుంట మాయంజెయ్యాలె.
రోజురోజుకు బలేమంకు చేతలు చేస్కుంటా చెంద్రిని ఇస్కించ సాగిండు సూరడు/ఏం బాధలొచ్చే గదర కొడ్క ఊల్య పాలోల్ల పోరు పడలేక నల్గుట్ల ఇజ్జత్‌కి పాట్ల వడి పొట్ట చేతబట్టుకుని దేశం కాని దేశం వొల్స పోవాల్సోచ్చే. నవల మొత్తం కూడా ప్రతి సన్నివేశం, ప్రతిపాత్ర మాట్లాడే విధానం అంతా నల్లగొండ యాస లోనే కొనసాగుతుంది . తెలంగాణ భాష అంటే సమస్త తెలంగాణ ప్రజల భాష, వారి జీవన విధానంలో, పనిలో ప్రవర్తనలో, దాగిన భాష. భాషనే వెలికి తీసేది ఈ మాండలిక సాహిత్యం.
కోయి కోటేశ్వరరావు అన్నట్టుగా తాతలు, నానమ్మ లు, అమ్మమ్మల నోటి దగ్గర దోసిల్లు పడితే వచ్చే ప్రతి పదం మనకు ఒక కొత్త సాహిత్య రచనకు తోడ్పడుతుంది. తదను గుణంగా మనలోని తెలంగాణ మాండలిక భాష, రచనా నైపుణ్యం తప్పక వృద్ధి చెందుతుంది.
సూర నవలలో తెలంగాణ పదసంపద
సూర దళిత నవల అయినప్పటికీ దళితుల భాష మాత్రమే కాకుండా నల్లగొండ జిల్లా ప్రజలు వాడే పద సంపద మొత్తం ఈ నవలలో వాడబడింది. భవిష్యత్తులో భావితరాలకు అందించే తెలంగాణపదసంపదను విరివిగా ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నవ లలో రచయిత వాడిన కొన్ని పదాలను ఇక్కడ పరిశీలిద్దాం.
జకముక/ గాశారం/ తునీయమ్మ/ ఎడ్డిపాసువు/ ఆష్కాలు/ తతిమ్మోళ్లు/ మాపటీలి/ మొత్కుంట/ బరిగె/ మాపటిజాం /ఎర్రపచ్చన/ బుగులు/ మొగులు/ కోడికూస్తాల్కి/ మూలసుక్క/ గోర్కొల్లు/ పిర్కోల్లు/ పుర్సత్‌ గా/ జుర్మానా /తతిమ్మా /నిమ్మళంగా /సూదరోళ్లు/ ఇడ్పున /లచ్చువమ్మోరు/ సాపెనార్థం /నాతిరైంది/ పొద్దడ్కి/ బాజ్జతి/ సగేస్కుంట/ ఇర్కిస్తని /కొత్తేడు/ బెళ్ళంగొట్నరాయి / గొరగానీయడు / గిల్లడొల్పుకుంట /జొరబడ్డది/ గర్జు /పబ్బం/ గడపడం/ ఊడిగం జేయాలె ఎన్కటోళ్ల లెక్క .
ఈ పదాలన్నీ తెలంగాణ భాషకు ఆణి ముత్యాల లాం టివి. దళితులు మాట్లాడే భాషను యాసను అనుసరించి వచ్చిన అన్ని నవలా కథా సాహిత్యాలు అందుబాటులోకి తెచ్చిt వాటిపై సమీక్షలు జరిపినప్పుడు మనకు ఒక కొత్త పడ నిర్మాణం ఏర్పడి మరిన్ని నవలలు కథలు వెలువడే అవకాశాలున్నవి. కాబట్టి తెలంగాణ భాష మాండలికం ను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లాలంటే నవల, కథా రచనల లో ఉన్న తెలంగాణ భాషను తెలుగు సాహిత్యానికి గుండె కాయగా మార్చవచ్చు
సూర నవలలో తెలంగాణ సామెతలు
పేడే మొఖపోడు పెండ్లి కెదిరి చూసినట్టు.
పెసర చేల పోగొట్కోకొని పప్పట్కేలదేవులాడ్తే ఎట్లా.
సంగీతాన్కి సింతకాయలు అన్నట్టు.
మాలోన్ని మందలీయకనే కొట్టాలే.
తుర్కోడెంతో తుమ్మ ముల్లంత
సూరు గాలి ఒకడేడుస్తుంటే చుట్ట కు నిప్పు లేక ఒకడు ఏడుస్తుండంట.
వంద గొడ్లని తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చినట్లు
బతికి చెడ్డోని భాగ్యం జూడు- చెడి బతికినోని చెంపలు జూడు
ముందుగ మురిసినమ్మ పండుగ గుర్తెరుగదంట
కుక్క తోక పట్టుకుని గోదార న్న ఈదొచ్చు.
ఉరుకురుకు లాడి పసుల గాస్తె, పొద్దు గుకుతాది.
పుండు ఒకటైతే మందు ఒకటి పెడ్తారు.
మూడు రూపాయల ముండ పుల్సు,పది రూపాయలపచ్చి పులుసు.
ఒకరి మొఖం చూస్తే పెట్ట బుద్దయిద్ది, ఒకరి మొఖం తు చూస్తే టిట్ట బడ్డటిద్దన్నట్టు .
ఈ నవలలో ప్రత్యేకించి ప్రశంసించాల్సిన అంశాలలో సామెతలు ముందు వరుసలో ఉంటాయి. ఈ సామెతలు వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, మన గ్రామాలలో మాట్లాడుకునే, పెద్ద మనుషులు, తాత, నానమ్మ, అమ్మ మ్మలు గుర్తుకు వస్తారు. ఈ కాలం పిల్లలకు ఈ సమేతలు నేర్పిస్తే మన తెలంగాణభాషను మరింతగా సానబట్టిన వాళ్ళమవుతాం..
ఉపసంహరణం
దళితుల కష్టాలు, కన్నీళ్లు, బాధలు, మోసపోవడం, అవిద్య, అన్నీ సహజంగా తెలిపిన నవల సూర. సూర నవ లలో మనకు సరిపడా తెలంగాణ భాష పదాలు, సంభాష ణలు, సామెతలు, అన్నింటికిమించి మాండలికం భాష ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. రానున్న కాలంలో సాహిత్య రచనలో మాండలికం ముందు వరుసలో ఉంటుందన డంలో సందేహం లేదు.
డా.ననుమాస స్వామి మాటల్లో చెప్పాలంటే నల్ల గొండ మాండలికంలో వచ్చిన తెలుగు నవల కక్క , సర సన నిలబెట్ట గల నవల సూర. దళిత పదానికి నేటికీ మన తెలుగు సాహిత్యం లో స్థానం దక్క లేదు. తెలంగాణ భాషా సాహిత్యం లోనైనా విస్మరణకు గురవుతున్న తెలంగాణ భాషా, యాసలతో వచ్చిన ఏ ప్రక్రియా రచన నైనా, కుల, ప్రాంత లింగ భేదాలు లేకుండా రికార్డు చేయాలి.అప్పుడే మన తెలంగాణ భాషా సాహిత్యం తరతరాలకు అందించ బడి వృద్ధి చెందుతుంది.
తెలుగు భాషా సాహిత్యంలో తెలంగాణ సాహిత్యం కు ప్రత్యేక స్థాన ముంది. తెలంగాణ భాష తెలుగే కాదన్న ఈసడింపుల నుంచి తౌరక్యాంధ్రమన్నా తమాయించుకొని అవహేళనలు తట్టుకొని అక్షరాలనే ఆయుధాలుగా చేత పట్టి సాయుధ పోరాటాల వారసత్వం నుంచి రచనలు కొనసాగించి తెలంగాణ భాష విశిష్టతను దేశ వ్యాప్తం చేసిన ఘన చరిత్ర మన తెలంగాణ యాస భాషలది.
పుట్టుకతోనే వచ్చిన ఈ ఆశ భాష మాటలను ఉప యోగించి ఎన్నో సాహిత్య పురస్కారాలను సాహిత్య అకా డమీలను డాక్టరేట్‌లను పద్మభూషణ్‌లను పీఠాలను అవలీ లగా అందిపుచ్చుకున్న మనం తెలంగాణ సాహిత్య తరా లను సమన్వయం చేసుకుంటూ తెలంగాణ భాషకు యాస కు పబ్బతి పట్టుదాం. తెలంగాణ మాండలికం సంస్కృతి భాషలపై చర్చలు జరుగుతున్న ఈ సందర్భంలో తెలం గాణ దళిత నవలలతో పాటు, తెలంగాణ భాష యాసల పై విస్తృత స్థాయి పరిశోధనలు చేయాల్సిన అవసరం నేటితరం పరిశోధకులకుఎంతైనా ఉంది.
డా.మెంతబోయిన సైదులు

  • 9010910956
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News