మంచిర్యాల జిల్లాలోని ట్రాన్స్ జెండర్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో ఐదుగురు ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డుతో పాటు ట్రాన్స్ జెండర్ ధృవపత్రాలను అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వం ట్రాన్స్ జెండర్లకు అవకాశాలు కల్పిస్తుందని, రిజర్వేషన్లు, గుర్తింపు అందించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించే విధంగా వసతులు కల్పిస్తామన్నారు. జిల్లాలోని మిగతా ట్రాన్స్ జెండర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి కె.చిన్నయ్య, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఆనంద్, సీనియర్ అసిస్టెంట్ రఘువీర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.