పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ఇలా కాపాడుదాం..
పిల్లల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలకు సలహా ఇచ్చేముందు వారేం చెపుతారో వినాలి. పిల్లల మనోభావాలు ఏమిటో తెలుసుకోవాలి. వారి అభిప్రాయాలకు విలువనిస్తున్న ఫీలింగును పిల్లల్లో తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దవాళ్లు కలుగచేయాలి. ఏ విషయానికి సంబంధించైనా సరే పిల్లలకు సత్యం చెప్పాలి తప్ప విషయాన్ని దాచే ప్రయత్నం చేయకూడదు. చిన్నతనం నుంచే వారిలో ఆరోగ్యకరమైన ప్రవర్తన పెరిగేలా ఇంట్లో పెద్దవాళ్లు వారిని పెంచాలి.
అలాగే మంచి వారి సాంగత్యంలో పిల్లలు పెరిగేలా అలాంటి వాతావరణాన్ని ఇంటా, బయటా పిల్లలకు అలవాటు చేయాలి. పిల్లలకు ఏదైనా మాట ఇస్తే దాన్ని తప్పకుండా నిలబెట్టుకోవాలి. ఇది వారిపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాదు వారికి నమ్మకం, విశ్వాసం కలిగేలా పెద్దవాళ్లు ప్రవర్తించాలి. అలాగే తమను తాము సురక్షితంగా ఎలా ఉంచుకోవాలన్న విషయాలను కూడా పిల్లలకు నేర్పాలి. ఇది పిల్లలను
ధైర్యవంతులుగా తీర్చిదిద్దుతుంది. ఏ విషయాన్నైనా ఎలా పరిష్కరించుకోవాలన్న ఆలోచనలను వారిలో పెంచుతుంది. పిల్లలపై తమకు ఎంతో నమ్మకం ఉందన్న భావనను పెద్దవాళ్లు చిన్నపిల్లల్లో పెంపొందించాలి.
అలాగే ప్రతి పనిని టైము ప్రకారం చేసుకునే అలవాటును, క్రమశిక్షణను కూడా పిల్లలకు చిన్నతనం నుంచే అలవరచాలి. ఎక్కువసేపు ఎలక్ట్రానిక్ గూడ్స్ తో పిల్లలు గడపకుండా స్రుజనాత్మకమైన హాబీలను పిల్లల్లో పెంచేలా పెద్దవాళ్లు క్రుషిచేయాలి. వారితోనిత్యం కొంత సమయాన్ని తప్పనిసరిగా గడపాలి. వారిని తరచూ దగ్గరకు తీసుకుంటే, కౌగలించుకుంటూ వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, భద్రతా భావాలను పెంపొందించాలి. నిత్యం రిలాక్సేషన్ వ్యాయామాలను వారితో చేయించాలి. పొరబాట్లు చేస్తే తెలియజెప్పాలే గానీ వారిని తిట్టడం, కొట్టడం, అనుమానించడం వంటివి పెద్దవాళ్లు చేయకూడదు. పిల్లలను క్షమించడంతో పాటు వారు చేస్తున్న తప్పుఒప్పులను కూడా తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దవాళ్లు వాళ్ల చిన్ని మనసులకు అర్థమయ్యేలా చెప్పాలి. వారితో ఎక్కువ సమయం గడపాలి. పిల్లలు భావోద్వేగాలతో ఉన్నప్పుడు వారితో ఓర్పుగా, ప్రేమతో, స్నేహంగా మెలగాలి. పిల్లలు భావాలు, అభిప్రాయాలు, అవసరాల లోంచి వారి ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారితో నిత్యం కాసేపు ఆడుకోవాలి. వారితో పాటు తల్లిదండ్రులూ వ్యాయామాలు చేయాలి. ఇలా తల్లిదండ్రలు, ఇంట్లో పెద్దవాళ్లు పిల్లలతో గడిపితే వారిలో సహజసిద్ధంగా మంచి అలవాట్లు పెంపొందుతాయి. అలాగే పేరెంట్స్ తమ పిల్లల్లోని పాజిటివ్ గుణాలను గుర్తించి వాటిని ప్రోత్సహించాలి. వారి అభిప్రాయాలను గౌరవించాలి. ఇవన్నీ పిల్లలను ఆరోగ్యమైన వ్యక్తిత్వం పెరిగేలా చేస్తాయి.